పుట్టిన ఊరికి సేవ చేసేందుకు విశ్రాంత ఉద్యోగులు, ప్రస్తుతం పనిచేస్తున్న ఉద్యోగులు ఒక్కటయ్యారు.
మరిపెడ, న్యూస్‌లైన్ : పుట్టిన ఊరికి సేవ చేసేందుకు విశ్రాంత ఉద్యోగులు, ప్రస్తుతం పనిచేస్తున్న ఉద్యోగులు ఒక్కటయ్యారు. అభివృద్ధికి దూరంగా ఉన్న తమ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలని ప్రతినబూనారు. ఇందుకు మండలంలోని జయ్యారం గ్రామం వేదికైంది. వివరాలిలా ఉన్నాయి. మండలంలోని జయ్యారంలో కనీస వసతు లు కరువయ్యాయి. దీంతో గ్రామాభివృద్ధి కోసం విశ్రాంత ఉద్యోగులు, ప్రస్తుతం పనిచేస్తున్న ఉద్యోగులు ఒక్కటయ్యారు. గ్రామం లో ఆదివారం జరిగిన సమ్మేళనంలో వారం తా ఒకరిని ఒకరు ఆప్యాయంగా పలకరించుకుంటూ రోజంతా ఆనందంగా గడిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలో పుట్టి పెరిగిన వారు వివిధ ప్రాంతాల్లో ఉద్యోగరీత్యా స్థిరపడ్డారని, అలాంటి వారంతా ఒక వేదికపైకి రావడం ఆనందంగా ఉందన్నారు.
తీసుకున్న నిర్ణయాలు..
గ్రామంలో ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధిపోను మిగిలిన అభివృద్ధి కోసం పలు నిర్ణయాలు చేశారు. గ్రామంలో గ్రంథాలయం, ఆరోగ్య ఉపకేంద్రం ఏర్పాటు చేయాలని, క్రీడామైదానం కోసం స్థలం సేకరించాలని, రవాణ సౌకర్యం మెరుగుపరచుకోవాలని, కమ్యూనిటీ భవన నిర్మాణం చేయాలని నిర్ణయించారు. అలాగే ప్రతి ఇంట్లో మరుగుదొడ్డి నిర్మించుకునేలా గ్రామస్తులను ప్రోత్సహించ డం, పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ధపెట్టి పాలకులతో పని చేయించాలని నిర్ణయించారు.
గ్రామాభివృద్ధి కమిటీ ఇదే..
జయ్యారం గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షుడిగా పానుగంటి శ్రీనివాస్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు గాడిపెల్లి సుధాకర్‌గౌడ్, ప్రధాన కార్యదర్శిగా యాకూబ్‌మియా, సహాయ కార్యదర్శి పూసపాటి విజయ్‌కుమార్, కోశాధికారి జగన్నాథరెడ్డి, సభ్యులుగా సి. ప్రసాద్, వెంశెట్టి సోమేష్, ఈశ్వరప్రసాద్‌ను ఎన్నుకున్నారు. సత్యనారాయణరావు, జగన్మోహన్‌రావు, శౌరి బిక్షమయ్య, మాకుల స్వరూపరెడ్డి, పాఠశాల హెచ్‌ఎం రమేష్‌కుమార్, వల్లూరి కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.