అందరి చూపు... ఆ మ్యాచ్ వైపు | Today, war between India and Pakistan cricket teams | Sakshi
Sakshi News home page

అందరి చూపు... ఆ మ్యాచ్ వైపు

Mar 19 2016 1:42 AM | Updated on Sep 3 2017 8:04 PM

అందరి చూపు... ఆ మ్యాచ్ వైపు

అందరి చూపు... ఆ మ్యాచ్ వైపు

ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి రోజంతా శ్రమించి చదివిస్తున్న తల్లిదండ్రుల ఆశయాలను తుంగలో తొక్కి యువత క్రికెట్ బెట్టింగ్‌లకు ....

నేడు భారత్-పాకిస్థాన్ క్రికెట్ జట్ల మధ్య పోరు
సత్తెనపల్లి ప్రాంతంలో బెట్టింగ్‌లకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు
వడ్డీలకు డబ్బు తెచ్చి పందెం కాస్తున్న యువత

 
 క్రికెట్ మాట వింటేనే యువతకు ఎక్కడలేని ఉత్సాహం ఆటను ఆస్వాదించాల్సిన యువత బెట్టింగ్‌లకుపాల్పడుతూ తమ  జీవితాలను బుగ్గి చేసుకుంటుంది. ఇప్పటి వరకు జరిగిన క్రికెట్ పోటీలు  ఓ ఎత్తు. శనివారం జరగనున్న భారత్ - పాకిస్థాన్ మ్యాచ్ ఒక్కటే ఒక ఎత్తు. ఈ మ్యాచ్ వైపు అందరి చూపు నెలకొంది.
 
సత్తెనపల్లి: ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి రోజంతా శ్రమించి చదివిస్తున్న తల్లిదండ్రుల ఆశయాలను తుంగలో తొక్కి యువత క్రికెట్ బెట్టింగ్‌లకు పాల్పడుతోంది. ఈ మహమ్మారిని అరికట్టకపోతే తీవ్ర విష పరిణామాలు సమాజంలో చోటు చేసుకోక తప్పదని సామాజిక వేత్తలు హెచ్చరిస్తున్నారు. బెట్టింగ్ వంటి వ్యసనానికి పాల్పడుతూ సత్తెనపల్లిలో కొన్ని కుటుంబాలు రోడ్డున పడ్డ ఉదంతాలు ఉన్నాయి. మరికొందరైతే ఆత్మహత్యలకు పాల్పడ్డారు. కొందరు విద్యార్థులు తమ తల్లిదండ్రులకు ఏవో మాటలు చెప్పి ఇంట్లో నుంచి పెద్ద మొత్తంలో డబ్బు తీసుకొచ్చి బెట్టింగ్‌లకు పాల్పడుతున్నారు.

ఇంట్లో డబ్బు ఇవ్వకపోతే తమ వద్ద  ఉన్న ల్యాప్‌ట్యాప్‌లు, ద్విచక్ర వాహనాలు, స్మార్ట్‌ఫోనులు తాకట్టు పెట్టి అధిక వడ్డీలకు డబ్బు తెచ్చి బెట్టింగ్‌లకు పాల్పడడం ఇక్కడ పరిపాటిగా మారింది. వస్తువులు లేకపోతే ఖాళీ ప్రామిసరి నోట్లు, ఖాళీ చెక్కులపై సంతకాలు చేసి రూ.10 వడ్డీకి తీసుకొని మరీ బెట్టింగ్‌ల్లో పాల్గొంటున్నారు. వడ్డీ వ్యాపారులు కూడా దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న చందాన అధిక వడ్డీలకు ఇస్తూ పెద్ద మొత్తంలో సొమ్ము చేసుకుంటున్నారు.

 ఈ బెట్టింగ్‌లలో నగదు ఇచ్చి పుచ్చుకునే వ్యవహారాల్లో కూడా మోసాలు చోటు చేసుకుంటున్నాయి. మోసపోయిన వారు ఘర్షణలకు దిగడంతో ఈ వ్యవహారం పోలీసుల దృష్టికి చేరుతోంది. అప్పుడు బెట్టింగ్‌లకు పాల్పడినవారిపై, నిర్వహించిన వారి పై చర్యలు తీసుకోవడంతో అసలుకే నష్టం వస్తుంది.

నేటి మ్యాచ్‌కు పెద్ద ఎత్తున ఏర్పాట్లు...
ఏ మాత్రం పోలీసులకు అనుమానం రాకుండా భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లపై బెట్టింగ్‌లు నిర్వహించేందుకు సత్తెనపల్లి ప్రాంతంలో పెద్ద ఎత్తున  ఏర్పాట్లు చేస్తున్నారు. ఏమి మాట్లాడుకోకుండా కళ్లతోనే సైగలు చేసుకుంటూ రహస్య ప్రాంతాలకు వెళుతున్నారు. మరి కొందరైతే దిక్కులు చూసుకుంటూ స్మార్ట్‌ఫోన్లల్లో కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. బెట్టింగ్‌ల్లో టాస్ ఎవరు గెలుస్తారు, ఏ ఓవర్‌లో ఎవరు ఎన్ని పరుగులు తీస్తారు.

మొత్తం మీదు ఎన్ని పరుగులు చేస్తారు, మ్యాచ్‌లో విజయం ఎవరు సాధిస్తారు, ఈ బాల్‌లో సిక్స్ కొడతారా లేదా ఇలా బంతి బంతికి బెట్టింగ్‌లు కాసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అంతా ఆన్‌లైన్ కావడంతో సెల్‌ఫోన్‌ల ద్వారా మాట్లాడుకుంటూ చాప కింద నీరులా వ్యవహారం నడిపిస్తున్నారు.బుకీలు పెద్ద ఎత్తున ఫోన్‌ల ద్వారా రేటింగ్స్ చెబుతుండటంతో బెట్టింగ్ రాయుళ్ళు అందుకనుగుణంగా బెట్టింగ్‌లు కట్టడం జరుగుతుంది. ఈ వ్యవహారంపై పూర్తిస్థాయిలో పోలీసులు దృష్టి సారించి బెట్టింగ్‌లు జరగకుండా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement