శ్వేతపత్రం విడుదల చేయాలి: జేపీ | To the release of the white paper: JP | Sakshi
Sakshi News home page

శ్వేతపత్రం విడుదల చేయాలి: జేపీ

Mar 9 2015 2:51 AM | Updated on Sep 2 2017 10:31 PM

రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలని లోక్‌సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ... సీఎం చంద్రబాబును డిమాండ్ చేశారు.

విజయవాడ బ్యూరో: రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలని లోక్‌సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ... సీఎం చంద్రబాబును డిమాండ్  చేశారు. ‘తెలుగు ప్రజల భవిత కోసం’ అనే నినాదంతో ఆదివారమిక్కడ సంకల్పదీక్ష చేపట్టారు. మౌనదీక్ష ప్రారంభానికి ముందు ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ర్టం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని ఒకవైపు చెబుతూనే మరోవైపు దుబారాఖర్చులు చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర  ఆర్థికస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. పోలవరం ప్రోజెక్టుకు నిర్దేశించిన వ్యయం రూ.16వేల కోట్లకు నెలకు నూటికి రూపాయి వడ్డీ లెక్కగట్టినా రూ.1,900 కోట్లు అవుతుందన్నారు. అటువంటి ప్రాజెక్టుకు రూ.100 కోట్లు కేటాయించి నాలుగేళ్లలో పూర్తి చేస్తామని చెప్పడం హాస్యాస్పదమన్నారు.

ఈ నెల 15న హైదరాబాద్‌లో రాజకీయ పార్టీ నేతలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, విద్యార్థి, యువజన, మహిళా సంఘాల ప్రతినిధులతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తామన్నారు.ప్రత్యేక హోదా తదితర డిమాండ్లపై రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థలకు చెందిన విద్యార్ధులు ఈ నెల 16న కనీసం రెండు గంటలపాటు మానవహారాలు, ప్రదర్శనలు నిర్వహించాలని ఆయన పిలుపునిచ్చారు. దీక్షలో లోక్‌సత్తా జాతీయ అధ్యక్షుడు శ్రీవాస్తవ, జాతీయ కార్యదర్శి హైమా ప్రవీణ్, రాష్ట్ర అధ్యక్షుడు కామినేని పట్టాభిరామయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాబ్జి, విజయవాడ నగర అధ్యక్షుడు బి.అశోక్‌కుమార్ పాల్గొని మాట్లాడారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా నగరంలో బహిరంగంగా దీక్ష చేపట్టేందుకు పోలీసులు అనుమతించపోవడంతో ఐఎంఏ హాలులో జేపీ సంకల్ప దీక్ష చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement