నిర్లక్ష్యపు డ్రైవింగ్ ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది.
గన్నవరం : నిర్లక్ష్యపు డ్రైవింగ్ ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది. మితిమిరిన వేగంతో దూసుకువచ్చిన కారు రోడ్డుపై వెళ్తున్న ఇద్దరిని ఢీకొట్టి పక్కనే ఉన్న డ్రెయిన్‌లో దూసుకువెళ్లింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానిక దావాజిగూడెం రోడ్డులో సోమవారం తెల్లవారుజామున జరిగిన ఈ సంఘటన వివరాలీలా వున్నాయి. కేసరపల్లి శివారు వీఎన్. పురం కాలనీకి చెందిన జలసూత్రం కృష్ణ(60) స్థానిక వీఎస్. సెయింట్‌జాన్స్ హైస్కూల్‌లో తోటమాలిగా పనిచేస్తున్నాడు. నైట్‌డ్యూటీలో ఉన్న కృష్ణ సోమవారం తెల్లవారుజామున 5 గంటల సమయంలో టీ తాగేందుకు సైకిల్‌పై సినిమాహాల్ సెంటర్‌కు వెళ్లాడు. కొద్ది సేపటి తర్వాత సమీపంలోని అపార్ట్‌మెంట్‌లో వాచ్‌మెన్‌గా పనిచేస్తున్న కొండా కొండలరావుతో కలిసి తిరిగి బయలుదేరారు.
దావాజిగూడెం రోడ్డులోని ఇంద్రప్రస్థ కాంప్లెక్స్ వద్దకు రాగానే నాగవరప్పాడు నుంచి గన్నవరం వైపు వేగంగా దూసుకువచ్చిన కారు వీరిద్దరినీ ఢీకొంది. అనంతరం కారు పక్కనే సైడ్ డ్రెయిన్‌లోకి దూసుకువెళ్ళింది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలైన కృష్ణ, కొండలరావును విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కృష్ణ పరిస్ధితి విషమించడంతో కొద్దిసేపటికే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కారు డ్రైవర్ సత్యనారాయణ నిత్రమత్తులో కారు నడపడం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు విచారణలో తేలింది.