ఉద్యోగ భద్రతకు ముప్పులేదు

There Is Job Security In Garage Maintaince In Madanapalle - Sakshi

సాక్షి, మదనపల్లె అర్బన్‌ : గ్యారేజ్‌ మెయింటెనెన్స్‌ విధానంలో మార్పులతో కార్మికుల ఉద్యోగ భద్రతకు ఎలాంటి ముప్పులేదని ఏపీఎస్‌ ఆర్టీసీ చిత్తూరు రీజియన్‌ డెప్యూటీ చీఫ్‌ మెకానికల్‌ ఇంజినీర్‌ నరసింహులు తెలిపారు. ఆయన శనివారం మదనపల్లె 1, 2 డిపోల్లో గ్యారేజ్‌ మెయింటెనెన్స్‌ కొత్త విధానం గురించి మెకానిక్‌లకు వివరించారు. ఆయన మాట్లాడుతూ ఈ నెల 18వ తేదీ నుంచి గ్యారేజ్‌ మెయింటెనెన్స్‌పై కొత్త విధానాన్ని యాజమాన్యం అమలులోకి తెచ్చిందన్నారు. బస్సుల సాంకేతికతలో అత్యాధునిక మార్పులు వచ్చినందున రోజువారీ తనిఖీలు అవసరం లేదని యాజమాన్యం భావిస్తోందన్నారు.

బస్సు నడిపేటప్పుడు డ్రైవరు గుర్తించిన లోపాలను గ్యారేజీలో నివేదిస్తే ఆ మేరకు మరమ్మతులు చేపడతారన్నారు. కొత్త విధానంతో మెకానిక్‌లకు ఉద్యోగ భద్రతకు ఎలాంటి ముప్పు ఉండదన్నారు. కార్మికులకు  పని సులభతరం అవుతుందన్నారు. పాత విధానంలో ప్రతి రోజూ బస్సును క్షుణ్ణంగా పరిశీలించాల్సి ఉండేదన్నారు. ఇప్పుడు బస్సు నడుపుతున్న డ్రైవర్‌ చెప్పిన లోపాల్ని సరిచేస్తే సరిపోతుందన్నారు. కార్మికునికి పనిభారం తగ్గుతుందని, బస్సులు కండీషన్‌లో ఉంటాయని చెప్పారు. కొత్త విధానాన్ని కార్మికులు అవగాహన చేసుకోవడానికి ప్రయత్నించాలని, గుడ్డిగా వ్యతిరేకించవద్దని కోరారు. డిపో మేనేజర్లు రాజా గజలక్ష్మి, పెద్దన్నశెట్టి, ఎంఎఫ్‌లు నిరంజన్, ఎంవీఆర్‌ రెడ్డి, మెకానిక్‌లు, గ్యారేజ్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top