breaking news
job security Provide
-
ఉద్యోగ భద్రతకు ముప్పులేదు
సాక్షి, మదనపల్లె అర్బన్ : గ్యారేజ్ మెయింటెనెన్స్ విధానంలో మార్పులతో కార్మికుల ఉద్యోగ భద్రతకు ఎలాంటి ముప్పులేదని ఏపీఎస్ ఆర్టీసీ చిత్తూరు రీజియన్ డెప్యూటీ చీఫ్ మెకానికల్ ఇంజినీర్ నరసింహులు తెలిపారు. ఆయన శనివారం మదనపల్లె 1, 2 డిపోల్లో గ్యారేజ్ మెయింటెనెన్స్ కొత్త విధానం గురించి మెకానిక్‌లకు వివరించారు. ఆయన మాట్లాడుతూ ఈ నెల 18వ తేదీ నుంచి గ్యారేజ్ మెయింటెనెన్స్‌పై కొత్త విధానాన్ని యాజమాన్యం అమలులోకి తెచ్చిందన్నారు. బస్సుల సాంకేతికతలో అత్యాధునిక మార్పులు వచ్చినందున రోజువారీ తనిఖీలు అవసరం లేదని యాజమాన్యం భావిస్తోందన్నారు. బస్సు నడిపేటప్పుడు డ్రైవరు గుర్తించిన లోపాలను గ్యారేజీలో నివేదిస్తే ఆ మేరకు మరమ్మతులు చేపడతారన్నారు. కొత్త విధానంతో మెకానిక్‌లకు ఉద్యోగ భద్రతకు ఎలాంటి ముప్పు ఉండదన్నారు. కార్మికులకు పని సులభతరం అవుతుందన్నారు. పాత విధానంలో ప్రతి రోజూ బస్సును క్షుణ్ణంగా పరిశీలించాల్సి ఉండేదన్నారు. ఇప్పుడు బస్సు నడుపుతున్న డ్రైవర్ చెప్పిన లోపాల్ని సరిచేస్తే సరిపోతుందన్నారు. కార్మికునికి పనిభారం తగ్గుతుందని, బస్సులు కండీషన్లో ఉంటాయని చెప్పారు. కొత్త విధానాన్ని కార్మికులు అవగాహన చేసుకోవడానికి ప్రయత్నించాలని, గుడ్డిగా వ్యతిరేకించవద్దని కోరారు. డిపో మేనేజర్లు రాజా గజలక్ష్మి, పెద్దన్నశెట్టి, ఎంఎఫ్‌లు నిరంజన్, ఎంవీఆర్ రెడ్డి, మెకానిక్‌లు, గ్యారేజ్ సిబ్బంది పాల్గొన్నారు. -
ఉద్యోగ భద్రత కల్పించండి
భీమవరం క్రైం : ఎనిమిదేళ్లుగా పనిచేస్తున్న తమను తొలగించాలనుకోవడం దారుణమని, తమకు ఉద్యోగ భద్రతకల్పించేలా చూడాలని జిల్లాలోని ఆయుష్ ఉద్యోగులు ఏలూరు ఎంపీ మాగంటి బాబును శనివారం కలిసి వినతిపత్రం సమర్పించారు. జాతీయ గ్రామీణ ఆరోగ్య పథకం ప్రారంభించిన నాటి నుంచి గ్రామాల్లో ఆయుర్వేద, హోమియో, యునాని, నేచురోపతి వంటి వైద్య సేవలను అందిస్తూ వస్తున్నామన్నారు. తమకు జీతాలు చెల్లించడం ఆలస్యమవుతున్నా కష్టపడి పనిచేస్తున్నామని వారు ఎంపీకి వివరించారు. అధికారులు తీసుకుంటున్న ఈ నిర్ణయం వల్ల జిల్లాలో 81 మంది ఉద్యోగులు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడిందని వెల్లడించారు. దీనిపై స్పందించిన మాగంటి బాబు ఆయుష్ కమిషనర్‌తో ఫోన్లో మాట్లాడారు. ఆయుష్‌ను బలోపేతం చేయాలని, డాక్టర్లను నియమించి కార్యకలాపాలను విస్తరించేలా చూడాలని కమిషనర్‌ను ఎంపీ కోరారు. ఎంపీని కలిసిన వారిలో ఉద్యోగులు బి.రమేష్‌వర్మ, ఎన్.ఆంజనేయులు, వి.హైమావతి, చంద్రశేఖర్, సత్యనారాయణ తదితరులున్నారు.