చేనేత కేంద్రంగా.. నృసింహుని సన్నిధిగా ప్రసిద్ధి చెందిన మంగళాద్రి ఇప్పుడు దేశ వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. రాష్ర్టంలో ఏనోట విన్నా ఇప్పుడు దీని గురించే చర్చ నడుస్తోంది.
మంగళగిరి: చేనేత కేంద్రంగా.. నృసింహుని సన్నిధిగా ప్రసిద్ధి చెందిన మంగళాద్రి ఇప్పుడు దేశ వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. రాష్ర్టంలో ఏనోట విన్నా ఇప్పుడు దీని గురించే చర్చ నడుస్తోంది. నవ్యాంధ్ర రాజధాని విజయవాడ-గుంటూరు మధ్య ఏర్పాటు కాబోతోందనే ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. ఈ నేపథ్యంలో పట్టణ పరిసరాల్లో పలు ప్రతిష్టాత్మక సంస్థలు, ప్రాజెక్టుల స్థాపనకు రంగం సిద్ధమవుతోంది. కోట్లాది రూపాయల పెట్టుబడితో ప్రభుత్వ, కార్పొరేట్ సంస్థలు తమ కార్యాలయాల ఏర్పాటుకు ప్రయత్నాలు ఆరంభించాయి.
అందుబాటులో ప్రభుత్వ, అటవీ భూములు, రవాణా సౌకర్యం, నీటి వనరులు పుష్కలంగా ఉన్న ఈ ప్రాంతానికి మహర్దశ పట్టబోతోందని విశ్లేషకుల అంచనా. రాష్ట్ర విభజన నాటి నుంచి అవశేష ఆంధ్రప్రదేశ్‌కు రాజధానిగా ఏ ప్రాంతాన్ని ప్రకటిస్తారు. కొత్త రాజధాని ఎక్కడ ఏర్పాటు కాబోతోంది అనే చర్చ సర్వత్రా ఆసక్తికరంగా సాగుతోంది.
ఏ ప్రాంతం అనుకూలం అనే విషయంపై ప్రభుత్వం ఓ కమిటీని కూడా ఏర్పాటు చేసింది. విజయవాడ-గుంటూరు నగరాల మధ్యే ఉంటుందన్న ప్రచారం మాత్రం మొదటి నుంచీ జోరుగా సాగుతోంది. నాయకులు, అధికారుల ప్రకటనలు, ఈ ప్రాంతంలో హడావుడిగా జరుగుతున్న పరిణామాలు ఇందుకు ఊతమిస్తున్నాయి. మంగళగిరి రాజధా ని కాబోతోందనే చర్చ నేపథ్యంలో దేశవ్యాప్తంగా పలు బహుళార్ధక ప్రాజెక్టుల ఏర్పాటుకు ఆసక్తిని కనపరుస్తున్నాయి.
ప్రముఖ వైద్య సంస్థల ఏర్పాటుకు ప్రయత్నాలు.: ప్రభుత్వ సంస్థలతోపాటు ప్రైవేటు, కార్పొరేట్ సంస్థలు సైతం మంగళగిరి చుట్టూ భూముల కొనుగోలు చేస్తూ తమ కార్యాలయాల నిర్మాణానికి ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. ఎయిమ్స్ లాంటి ప్రతిష్టాత్మక సంస్థతోపాటు సుమారు రూ.2,500 కోట్ల పెట్టుబడులతో పలు సంస్థల ఏర్పాటు కానున్నాయి.
మంగళగిరి టీబీ శానిటోరియంలో అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ(ఎయిమ్స్), చినకాకానిలో రూ.125 కోట్లతో క్యాన్సర్ అపెక్స్ సెంటరుతోపాటు విజయవాడలోని ఎన్టీఆర్ వైద్య విజ్ఞాన ఆరోగ్య విశ్వవిద్యాలయం ఇక్కడే ఏర్పాటవుతుంద నే వార్తలు వినిపిస్తున్నాయి. క్యాన్సర్ సెంటర్ వలన పలు జాతీయ అంతర్జాతీయ పరిశోధన కేంద్రాలు ఇక్కడ ఏర్పాటయ్యే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. ఇవన్నీ ఏర్పాటయితే మంగళగిరి మెడికల్ హబ్‌గా అవతరించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
వనరులు ఇవీ..
సుమారు రూ.1500 కోట్లతో ఏర్పాటు చేయనున్న ఎయిమ్స్‌కు శానిటోరియం స్థలం 200 ఎకరాలతో పాటు అటవీభూములు సైతం అనుకూలంగా వుండడం, రెండు కొండల మధ్య ప్రశాంత వాతావరణం ఎయిమ్స్ ఏర్పాటుకు కలిసి వచ్చే అంశాలు.
ఎయిమ్స్ ఏర్పాటుతో వంద సీట్లతో మెడికల్ కాలేజి, 500 పడకల ఆసుపత్రి, నర్సింగ్ కళాశాల, పలు పరిశోధన కేంద్రాలు ఏర్పాటుకు అవకాశం ఉంది.
ప్రభుత్వభూములు, అటవీభూములు వుండడంతో రవాణాకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రెండు జాతీయ రహదారుల మధ్య పట్టణం వుండడం, గుంటూరు ఛానల్ ద్వారా కృష్ణా నీరు అందుబాటులో వుండడంతో గతంలోనే ప్రభుత్వం 6వ బెటాలియన్ ఇక్కడ ఏర్పాటు చేసింది.
బెటాలియన్‌లో ఆబ్కారి అకాడమీ, పోలీస్ అకాడమీ ఏర్పాటు చేసేం దుకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు.
డీజీపీ కార్యాలయం ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, రాష్ట్ర వ్యాప్తంగా పోలీసు పరిపాలనా కార్యకలాపాలు ఇక్కడి నుంచే జరుగుతాయని ఆశాఖ అధికారులు చెబుతున్నారు.
ఇప్పటికే హైదరాబాద్‌లో పేర్గాంచిన కార్పొరేట్ ఆస్పత్రులు తమ శాఖల ను ఇక్కడ ఏర్పాటు చేసేందుకు భూములు కొనుగోలు చేస్తున్నాయి.
ప్రభుత్వం ప్రకటించిన సంస్థలతో పాటు ప్రవేటు సంస్థల ఏర్పాటుతో ఉపాధి అవకాశాలతోపాటు దేశంలో ప్రముఖ పట్టణంగా మంగళగిరి అవతరించబోతుందని స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.