న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ గ్రామ రెవెన్యూ సహాయకుల(వీఆర్‌ఏ) సంఘ జిల్లా శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షలను నాల్గవ రోజైన సోమవారం రాత్రి 9.30గంటల సమయంలో పోలీసులు భగ్నం చేశారు.
ఒంగోలు కలెక్టరేట్, న్యూస్‌లైన్: న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ గ్రామ రెవెన్యూ సహాయకుల(వీఆర్‌ఏ) సంఘ జిల్లా శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షలను నాల్గవ రోజైన సోమవారం రాత్రి 9.30గంటల సమయంలో పోలీసులు భగ్నం చేశారు. కలెక్టరేట్ వద్ద పదిమంది నిరవధిక దీక్షలకు దిగారు. చీకటి శ్రీనివాసరావు, కే మాణిక్యరావు, వీ శ్రీనివాసరావు, వీ యాకోబు, ఎస్‌కేవై గరీబా,కే బాలయ్య, పీ హరిబాబు, పీ శ్రీధర్‌బాబు, అన్నంగి పురుషోత్తం, పీ మోహన్‌రావులు నిరవధిక దీక్షలో కూర్చున్నారు. రిమ్స్ వైద్యులు నయోమి వారిని పరీక్షించారు.
వారి ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో ఆస్పత్రికి తరలించాలని సూచించారు. వన్‌టౌన్ పోలీసులు దీక్షా శిబిరం వద్దకు చేరుకొని వారిని బలవంతంగా జీపులోకి ఎక్కించారు. ఈ సందర్భంగా అక్కడే ఉన్న ప్రజాసంఘాల నాయకులు పోలీసుల చర్యను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. దీక్షకు దిగిన వారిని రిమ్స్ హాస్పిటల్‌కు తరలించి వైద్య సేవలు అందిస్తున్నారు.
నేడు జిల్లావ్యాప్తంగా నిరసనలు
డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ నిరవధిక దీక్షలకు దిగిన వారిని పోలీసులు బలవంతంగా అరెస్టుచేసి హాస్పిటల్‌కు తరలించడాన్ని నిరసిస్తూ ఈనెల 21వ తేదీ జిల్లావ్యాప్తంగా నిరసనలు చేయాలని గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు గుర్రం నాగయ్య, పాలడుగు వివేకానంద ఒక ప్రకటనలో కోరారు. అన్ని మండల కార్యాలయాల వద్ద ప్రభుత్వ దిష్టిబొమ్మలు దహనం చేయాలని పిలుపునిచ్చారు.