చైర్మన్ మాటలు నీటి మూటలేనా..? | The chairman of the agricultural market negligence on market problems | Sakshi
Sakshi News home page

చైర్మన్ మాటలు నీటి మూటలేనా..?

Dec 16 2013 3:23 AM | Updated on Aug 17 2018 5:24 PM

వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ చైర్మన్ మంద వినోద్‌కుమార్ సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చారంటే ఇక అంతే సంగతులు.

కాశిబుగ్గ, న్యూస్‌లైన్ :  వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ చైర్మన్ మంద వినోద్‌కుమార్ సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చారంటే ఇక అంతే సంగతులు. మళ్లీ గుర్తు చేస్తే తప్ప స్పందించని పరిస్థితి. పాలకవర్గం కొలువుదీరి సుమారు వంద రోజులు గడుస్తున్నా ఇంతవరకు ఏ ఒక్క పనిని కూడా పూర్తి చేసిన దాఖలాలు లేవు. దీంతో మా ర్కెట్‌కు వచ్చే రైతులు సమస్యలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
 మచ్చుకు కొన్ని..
 ‘రైతులంటే అలుసేనా’ శీర్షికన ‘సాక్షి’లో గత సోమవారం ప్రచురితమైన కథనానికి చైర్మన్ స్పందించారు. అదేరోజు మార్కెట్‌ను సందర్శించి ‘సాక్షి’లో వచ్చిన సమస్యలను వారంలో గా పరిష్కరిస్తామని అప్పటికప్పుడు ప్రకటిం చారు. అయితే వారం దాటుతున్నా ఒక్కటంటే ఒక్క సమస్య కూడా పరిష్కారానికి నోచుకోలేదు. వెలగని విద్యుత్ లైట్లు, తూకానికి నోచుకోని వే బ్రిడ్జి, నిరుపయోగంగా మరుగుదొడ్లు, మంచినీటి కొరత, అలంకారప్రాయంగా షెడ్లు, డివైడర్ల మధ్య ఏపుగా పెరిగిన పిచ్చి మొక్కలు, చెత్తాచెదారం అలాగే ఉన్నాయి.
 ఉచిత భోజనం, ఖాళీ సంచుల లెక్క..
 మార్కెట్‌లో ఉచిత భోజనం అమలు చేస్తానని, గత సంవత్సరం సీసీఐ కొనుగోలు చేసిన ఖాళీ సంచుల డబ్బులను రైతులకు ఇప్పిస్తానని చైర్మన్ వినోద్‌కుమార్ హామీ ఇచ్చారు. ఈ హామీ ఇచ్చి  రెండు నెలలు గడుస్తున్నా ఇంతవరకు అమలుకు నోచుకోలేదు. అదేవిధంగా పెద్ద మార్కెట్‌కు అనుబంధంగా ఉన్న కూరగాయలు, పండ్ల మార్కెట్‌లో కూడా సమస్యలు తాండవిస్తున్నాయి. ఈ సమస్యలను కూడా పరిష్కరిస్తానని చైర్మన్ హామీ ఇచ్చినా అతీగతి లేదు. తమకు పెంచిన చార్జీలను అమలు చేయాలని హమాలీకార్మికులు పలుమార్లు వినతిపత్రం ఇచ్చినా స్పందన లేదు.  పదవీ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి చైర్మన్ ఒక్క పని కూడా పూర్తిచేయలేదనే విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికైనా మార్కెట్‌లో సమస్యలు పరిష్కరించాలని రైతులు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement