సాక్షి, విజయవాడ: కాశీబుగ్గ ఘటన ప్రభుత్వ వైఫల్యమేనని.. భక్తుల మరణానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. కాశీబుగ్గ తొక్కిసలాట ఘటనపై ఆయన స్పందిస్తూ.. చంద్రబాబు హిందూ ధర్మ వ్యతిరేకి.. ఆయన పాలనలోనే వరుసగా ఆలయాల్లో అపచారాలు జరుగుతున్నాయంటూ మండిపడ్డారు.
‘‘కాశీబుగ్గ ఘటన నుంచి ప్రభుత్వం తప్పించుకునే ప్రయత్నం చేస్తోంది. ప్రైవేట్ ఆలయం అంటూ చంద్రబాబు, పవన్ కళ్యాణ్, అనిత, ఆనం రామనారాయణరెడ్డి మాట్లాడటం సిగ్గుచేటు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఆలయాల్లో ఎప్పుడూ లేని అపచారాలు జరుగుతున్నాయి. తిరుపతిలో ముక్కోటి ఏకాదశి రోజు ఆరుగురు చనిపోయారు. సింహాచలంలో ఏడుగురు చనిపోయారు. చంద్రబాబుకు హిందూ ఆలయాల మీద ఏనాడూ ప్రేమ లేదు. తన పబ్లిసిటీ కోసం తప్ప ఆలయాల కోసం చంద్రబాబు ఏమీ చేయలేదు. గోదావరి పుష్కరాలలో 29 మంది మృతికి కారణమయ్యారు. ఆలయాల్లో భక్తులకు సౌకర్యాలు కల్పించాలన్న ఆలోచనే వారికి లేదు.
..చంద్రబాబు, పవన్ కళ్యాణ్, హోంమంత్రి అనిత, ఆనం రామనారాయణరెడ్డి తమకు సంబంధం లేదన్నట్టుగా మాట్లాడతున్నారు. కార్తీకమాసంలో ఆలయాలకు భక్తులు వెళ్తారన్న సంగతి తెలీదా?. ఆలయాలు నిర్మించటం తప్పు అని చంద్రబాబు అనటం సిగ్గుచేటు. ఏ ఆలయానికి ఎంతమంది భక్తులు వస్తారో అంచనా వేయలేరా?. ఇంటిలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తోంది?. మా పార్టీ నాయకులు, కార్యకర్తలను అరెస్టు చేయటానికే పోలీసులను వాడుకుంటారా?. ప్రైవేటు వ్యక్తులు ఆలయాలు కట్టటం తప్పా?
..విజయవాడలో ప్రయివేటు వ్యక్తుల ఉత్సవాలకు పోలీసుల బందోబస్తు నిర్వహిస్తారా?. అదే ఆలయాల దగ్గర మాత్రం బందోబస్తు ఏర్పాటు చేయరా?. మా మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు చాలామంది భక్తులను కాపాడారు. సీపీఆర్ చేసి రక్షించారు. హోంమంత్రి అనితకు పోలీసు వ్యవస్థ మీద ఏమాత్రం పట్టు లేదు. ఆమె ఎంతసేపటికీ మా పార్టీ వారిపై దూషణలు చేయటానికే పరిమితం అయ్యారు. గోశాలలో ఆవులు చనిపోతున్నా పట్టించుకోవటం లేదు.
..చంద్రబాబు బూట్లు వేసుకుని పూజలు చేస్తారు. ఇదేనా ఆయనకు హిందూ ధర్మం మీద ఉన్న భక్తి?. చంద్రబాబు విజయవాడలో ఆలయాలను కూల్చి మున్సిపాలిటీ చెత్తలారీలో విగ్రహాలను తీసుకెళ్లారు. కాశీబుగ్గ ఘటన ప్రభుత్వ వైఫల్యమే. ఇంత జరుగుతుంటే పవన్ కళ్యాణ్ ఎక్కడ సినిమా షూటింగ్ లో ఉన్నారు?. జరిగిన తప్పుపై ఎందుకు మాట్లాడటం లేదు?. ఆలయాలపై రాజకీయ కుట్రలు మానుకోవాలి. తిరుమల లడ్డూపై కూడా రాజకీయం చేసిన చరిత్ర టీడీపీది’’ అంటూ వెల్లంపల్లి శ్రీనివాసరావు మండిపడ్డారు.


