సాక్షి, శ్రీకాకుళం: శ్రీకాకుళంలో(Srikakulam Stampade) విషాదకర ఘటన చోటుచేసుకుంది. జిల్లాలోని కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో(Kashibugga Temple) తొక్కిసలాట జరిగింది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది మృతి చెందగా.. మరో పది మందికి గాయపడినట్టు సమాచారం. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

వివరాల ప్రకారం.. కార్తీక మాసం నేపథ్యంలో కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఈరోజు ఏకాదశి కావడంతో భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. రద్దీ కారణంగా ఆలయంలో ఉన్న రెయిలింగ్ ఊడిపోయి భక్తులు కిందపడిపోయారు. అనంతరం, తొక్కిసలాట చోటుచేసుకుంది. ప్రమాదం కారణంగా 9 మంది మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో, గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. మృతుల్లో చిన్నారులు, మహిళలు ఉన్నారు.

అయితే, ఓ భక్తుడు.. తనకు తిరుమలలో దర్శనం కాలేదని సొంతంగా ఆలయాన్ని నిర్మించాడు. 12 ఎకరాల విస్తీర్ణంలో ఆలయం ఉంది. దీంతో, ఉత్తరాంధ్ర చిన్న తిరుపతిలా కాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయం ప్రసిద్ధి చెందింది. చిన్న తిరుపతిగా పేరు రావడంతో భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఏకాదశి సందర్బంగా ఆలయ అధికారులు, ఆలయ సిబ్బంది.. భక్తులకు ఎలాంటి ఏర్పాట్లు చేయలేదు. కనీస సౌకర్యాలు కూడా కల్పించలేదు. దీంతో, అధికారుల నిర్లక్క్ష్యంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆలయ సిబ్బంది ఉదాసీనతే ప్రమాదానికి ముఖ్య కారణమని భక్తులు ఆరోపిస్తున్నారు.
మృతులు వీరే..
- ఇదురి చిన్నమ్మి(50),రామేశ్వరం, టెక్కలి
- రాపాక విజయ(48), టెక్కలి
- మురిపింటి నీలమ్మ(60), దుక్కవానిపేట, వజ్రపుకొత్తూరు
- దువ్వు రాజేశ్వరి(60), బెలుపటియ, మందస
- చిన్ని యశోదమ్మ(56), శివరాంపురం
- , రూప, గుడిభద్ర
- లొట్ల నిఖిల్(13), బెంకిలి, సోంపేట
- డొక్కర అమ్ముడమ్మ, పలాస
- బృందావతి(62), మందస

కాశీబుగ్గ తొక్కిసలాట ఘటనపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి
కాశీబుగ్గ తొక్కిసలా ఘటనపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన చాలా బాధాకరమన్నారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానన్నారు. మృతులకు రెండు లక్షలు, గాయాల పాలై వారికి 50 వేలు చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించారు.



