సాక్షి, శ్రీకాకుళం: శ్రీకాకుళంలోని కాశీబుగ్గలో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. స్థానిక వేంకటేశ్వరస్వామి ఆలయంలో తొక్కిసలాట కారణంగా పది మంది మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. అయితే, ఆలయానికి దాదాపు 25వేల మంది భక్తులు వచ్చినట్టు తెలిసింది. ప్రమాదం తర్వాత ఆలయం గుర్తించి పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.
12 ఎకరాల్లో ఆలయం..
కాశీబుగ్గ పదనాపురం నాలుగేళ్ల క్రితం ఈ ఆలయ నిర్మాణాన్ని ధర్మకర్త హరిముకుంద్ పండా ప్రారంభించారు. 12 ఎకరాల సొంత భూమిలో ఈ ఆలయ నిర్మాణం జరిగింది. ఆలయం ఐదు ఎకరాల్లో ఉంది. సుమారు రూ.20 కోట్లతో దీనిని నిర్మించారు. కాగా, తనకు తిరుమల వెళ్లిన సమయంలో దర్శనం కాకపోవడంతోనే ఇక్కడ ఆలయం నిర్మించినట్టు తెలిసింది. ఇక, కొత్తగా నిర్మించిన ఆలయంలో మే నుంచి దర్శనాలు ప్రారంభమయ్యాయి. చిన్న తిరుపతిగా కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి క్షేత్రం ప్రసిద్దిలోకి వచ్చింది. వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణం గురించి సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం కూడా చేశారు.

గుడి నిర్మించిన హరి ముకుంద పాండా
25వేల మంది భక్తులు..
దీంతో, ఆలయానికి ప్రతీరోజు దాదాపు 1000 మంది వరకు భక్తులు వస్తున్నారు. ప్రతి శనివారం ఈ ఆలయానికి భారీగా భక్తులు తరలివస్తారు. ఆలయ సామర్థ్యం దాదాపు రెండు వేల నుంచి మూడు వేలుగా ఉందని పలువురు చెబుతున్నారు. అయితే, ఈరోజు ఏకాదశి నేపథ్యంలో ఆలయానికి దాదాపు 25వేల మంది భక్తులు వచ్చినట్టు సమాచారం. కాగా, భక్తుల రద్దీని పోలీస్ ఇంటలిజెన్స్ విభాగం, ఆలయ కమిటీ అంచనా వేయలేదు. ఆలయ కమిటీ సొంతగా భద్రతను సైతం ఏర్పాటు చేయలేదు. వేల సంఖ్యలో భక్తులు వస్తారని తెలిసినప్పటికీ పోలీసు సిబ్బంది రాలేదు. గంట సమయం దాటినా ఘటనా స్థలానికి 108 అంబులెన్స్ చేరుకోలేదని భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు.


