Sakshi News home page

పట్టు చిక్కేదెప్పుడు?

Published Tue, Nov 21 2017 10:28 AM

Temple Officials Controversy on EO surya kumari  - Sakshi

సాక్షి, విజయవాడ: శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం పాలకమండలి సభ్యులు దుర్గగుడిపై పట్టుకోసం తహతహలాడుతున్నారు. దేవస్థానంలో తమ మాటే చలామణి అయ్యేలా చూసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. దేవాలయం అంతర్గత విషయాలపై చూపించే ఆసక్తి దేవస్థానానికి నిధులు రాబట్టడంపై చూపించడం లేదనే విమర్శలు వస్తున్నాయి. కొంతమంది సభ్యులు తరచుగా ఈవో సూర్యకుమారితో విభేదించడం ఇప్పుడు చర్చనీయాశంగా మారింది.

నిధులు రాబట్టడంలో విఫలం                         
పాలకమండలి సభ్యులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రులు వద్ద తమ పరపతి ఉపయోగించి ప్రభుత్వం నుంచి నిధులు రాబట్టడంలో విఫలమయ్యారు. కనీసం వారు చేసిన తీర్మానాలను ప్రభుత్వంతో అమలు చేయించలేకపోతున్నారు. దసరా ఉత్సవాలకు రూ.10 కోట్లు కావాలని తీర్మానం చేయడం మినహా ప్రభుత్వం నుంచి ఒక్కరూపాయి  రాబట్టలేకపోయారు. అంతరాలయ దర్శనం రూ.300 నుంచి రూ.150 తగ్గించాలని పాలకమండలి తీర్మానం చేసినప్పటికీ ప్రభుత్వం ఆ ప్రతిపాదనను పక్కన పెట్టింది. స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌ కోరిక మేరకు రాష్ట్ర ప్రభుత్వం కోటప్పకొండకు నిధులు విడుదల చేసింది కానీ దుర్గగుడిపై నిర్లక్ష్యం చూపింది.

పరిచయాలున్నా విరాళాలు నిల్‌
పాలకమండలిలో కొంత మందికి అధికార పార్టీ పెద్దలతో విస్తృత పరిచయాలు ఉన్నాయి. వీటిని ఉపయోగించి దాతల నుంచి దేవస్థానానికి చందాలు రాబట్టలేక పోతున్నారు. దీంతో అమ్మవారి మూలధనం తరిగిపోతోంది.  మంత్రులు, ఎంపీలు, పారిశ్రామికవేత్తలను ఒప్పించి విరాళాలు తెప్పించి దేవస్థానాన్ని ఆదాయంలో అగ్రస్థానంలో నిలబెట్టవచ్చు. దుర్గగుడికి ఆదాయం ఇచ్చేందుకు అనేక మంది దాతలు సిద్ధంగా ఉన్నారు. అయినా వారిని గుర్తించి నిధులు రాబట్టడంపై పాలకమండలి శ్రద్ధ చూపడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.

అభివృద్ధిపై ప్రణాళిక ఏదీ?
లడ్డూ ప్రసాదాలు ధరను తొలుత రూ.15 పెంచాలని యోచించారు. అయితే నాణ్యత పెంచి రూ.20 చేయాలని పాలక మండలి సభ్యులు నిర్ణయించారు. దీనిపై విమర్శలు రావడంతో మంత్రి ఉమామహేశ్వరరావు పిలిచి పాలకమండలిని ప్రశ్నించారు. రేట్లు ఎందుకు పెంచామో చెప్పి ఆయన్ను ఒప్పించలేక, ఆయన సూచన మేరకు లడ్డూ రేటును రూ.15కు తగ్గించారు. పాలకమండలి సమావేశం జరిగితే,  ఈవోతో విభేదించడమే తప్ప, అభివృద్ధిపై నిర్దిష్టమైన ప్రణాళికలు తయారు చేయడం లేదనే విమర్శలు వస్తున్నాయి.

ప్రతిపాదనలు పట్టించుకోని ఈవో
 బియ్యం మిల్లర్ల వద్ద రూ.41 కొనడాన్ని ఆక్షేపిస్తూ టెండర్లు పిలిస్తే రూ.38కే కాంట్రాక్టర్లు సరఫరా చేస్తారనే వాదన చేశారు. అయితే రూ.38లకు లభించే బియ్యం ఒకలోడు తీసుకుని అగ్‌మార్కుకు పంపించి, వాటిని పరిశీలించిన తరువాత టెండర్‌ ఇద్దామనే ఈవో ప్రతిపాదనపై పాలకమండలి సభ్యులు సరిౖయెన సమాధానం ఇవ్వలేదని తెలిసింది. అన్నదానం, ప్రసాదాలు, స్టోర్స్, కేశఖండన వంటి వాటిపై పట్టుకోసం కమిటీలు వేయమంటూ ప్రతిపాదన తెస్తున్నారు. విభాగాలకు కమిటీలు ఏర్పడితే అక్కడ పనిచేసే సిబ్బందికి సమస్యలు తప్పవు. గతంలో ఉన్న పాలకమండలి సభ్యులు గ్యాస్‌ సిలిండర్లు, ప్రసాదాలు కూడా దేవస్థానం నుంచే తీసుకువెళ్లిన సందర్భాలు ఉన్నాయి. పాలకమండలి వచ్చి ఐదు నెలలు గడిచినా ఈవోతో విభేదించడం తప్ప భక్తులకు పెద్దగా ఒరిగిందేది కనపడటం లేదు. ఈ పాలకమండలి ఉన్నా,లేకున్నా ఒకటేలాగా ఉందనే విమర్శలు అధికార పార్టీ నేతల నుంచే వినవస్తోంది.

Advertisement

What’s your opinion

Advertisement