మెతుకు సీమపై చలిపులి పంజా విసురుతోంది. దీంతో 4 రోజులుగా ఉష్ణోగ్రతలు రోజుకు రోజుకూ పడిపోతున్నాయి.
మెదక్ టౌన్, న్యూస్‌లైన్ : మెతుకు సీమపై చలిపులి పంజా విసురుతోంది. దీంతో 4 రోజులుగా ఉష్ణోగ్రతలు రోజుకు రోజుకూ పడిపోతున్నాయి. ఈ ప్రభావంతో చలి తీవ్రత అంతకంతకూ పెరిగిపోతుండడంతో జనం గజగజ వణికిపోతున్నారు. రెండు రోజుల క్రితం 14 డిగ్రీలున్న కనిష్ట ఉష్ణోగ్రత గురువారం 13 డిగ్రీలకు పడిపోయింది. దీంతో అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైన జిల్లాల్లో మెతుకుసీమ రాష్ట్రంలోనే 3వ స్థానంలో నిలిచింది. గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది చలి తీవ్రత ఎక్కువగానే ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. తెల్లవారుజాము నుంచి ఉదయం 8 గంటల వరకు మంచు కురుస్తుండడంతో ప్రజలు కాలు బయటపెట్టేందుకు జంకుతున్నారు. చలిమంటలు వేసుకుని కొంత ఉపశమనం పొందుతున్నారు. చిన్నారులు, వృద్ధులు, శ్వాస సంబంధిత వ్యాధులున్న వారు గజగజ వణికిపోతున్నారు. సాయంత్రం 5 గంటల నుంచే చలిగాలులు వీస్తుండడంతో స్వెట్టర్లు, మంకిక్యాప్‌లు, శాలువాలు ధరించి బయటకు వస్తున్నారు. చలి తీవ్రత పెరగడంతో స్వెట్టర్ల వ్యాపారులకు గిరాకీ పెరిగింది. మున్ముందు ఉష్ణోగ్రతలు మరింతగా తగ్గే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.