‘సాక్షి’ కథనంపై టీడీపీ శ్రేణుల అక్కసు

TDT series of stories on Sakshi story

వినుకొండ ఎమ్మెల్యే అవినీతి వ్యవహారాలు బయటపెట్టడంతో  ప్రతుల దహనం

అనంతరం ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు దిష్టిబొమ్మను దహనం చేసిన వైఎస్సార్‌సీపీ 

వినుకొండటౌన్‌/శావల్యాపురం(వినుకొండ): గుంటూరు జిల్లా వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అవినీతి, అక్రమాలపై ‘సాక్షి’లో సోమవారం ‘దోపిడీ లక్ష్యం.. అవినీతి మార్గం’ శీర్షికతో ప్రచురితమైన కథనంతో టీడీపీ శ్రేణులు ఉలిక్కిపడ్డాయి. బినామీ పేర్లతో ఎమ్మెల్యే భూఆక్రమణలు, రేషన్‌ మాఫియా, నీరు–చెట్టు, మరుగుదొడ్లు, ఉపాధి హామీ పనుల్లో జరిగిన అవినీతి, అక్రమాలను ఆ కథనం కళ్లకు కట్టింది. అంతేగాకుండా జన్మభూమికి సేవ పేరుతో కళ్ల జోళ్ల పంపిణీ, కంటి ఆపరేషన్లు చేయిస్తున్నట్టు చేసుకుంటున్న ప్రచారంలోని లోగుట్టును కథనం బట్టబయలు చేసింది. కంచి పీఠాధిపతుల ఆధ్యర్యంలో శంకర్‌ ఆస్పత్రి నిర్వహిస్తున్న ఆపరేషన్లను తానే సొంత డబ్బుతో చేయిస్తున్నట్టు చెప్పడం అవాస్తవమని పేర్కొంది. ఇవన్నీ బయటపెట్టడాన్ని జీర్ణించుకోలేని ఆ పార్టీ శ్రేణులు పత్రిక ప్రతులను, వైఎస్సార్‌సీపీ నేత బొల్లా బ్రహ్మనాయుడి దిష్టిబొమ్మను దహనం చేశారు. 

దమ్ముంటే నిజాయితీని నిరూపించుకోండి..
వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అవినీతి, అక్రమాలకు నిరసనగా శావల్యాపురంలో జాతీయ రహదారి మార్గంలో వైఎస్సార్‌సీపీ నాయకులు కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. ‘సాక్షి’ పత్రికను దహనం చేయడంపై వారు మండిపడ్డారు. పత్రికాస్వేచ్ఛను కాలరాయకూడదన్నారు. దమ్ముంటే నిజాయితీ నిరూపించుకోవాలని సవాల్‌ విసిరారు. ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ఓటమి భయంతో వైఎస్సార్‌సీపీ నాయకుడు బొల్లా బ్రహ్మనాయుడుపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు దిష్టిబొమ్మను దహనం చేశారు. కార్యక్రమంలో పార్టీ నేతలు బోడెపూడి శ్రీనివాసరావు, భీమని అంకారావు, పాపసాని సత్యం, పచ్చవ శ్రీనివాసరావు, నర్రా శ్రీహరి, వెంకట్రావు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top