క్వార్టర్‌ పట్టు..  ఓటు కొట్టు!

Is TDP Supplying Alcohol For Voters In Cheerala - Sakshi

ప్రలోభాల పర్వంలో టీడీపీ

పట్టపగలే నోట్లు పంపిణీ చేస్తున్న అధికార పార్టీ

సాక్షి, చీరాల టౌన్‌ (ప్రకాశం): మీ ఓట్లు మాకే వేయండి.. మీ సంక్షేమంతో పాటు ఏం కావాలన్నా మేము చూసుకుంటాం..అంటూ టీడీపీ నేతలు గ్రామాల్లో ప్రలోభాలకు తెరలేపుతున్నారు. ఉదయం పూట గ్రామాలు, వార్డుల్లో మంతనాలు చేయించడంతో పాటు రాత్రి వేళల్లో  ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారు. ఓటర్లను తాగుబోతులుగా తయారుచేసేందుకు తమ నాయకులతో కలిసి రాత్రి వేళల్లో ఇంటికో క్వార్టర్‌ మద్యం బాటిల్‌ పంపిణీ చేస్తూ టీడీపీకి ఓట్లేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. చీరాల నియోజకవర్గంలోని 33 వార్డులు, 24 గ్రామ పంచాయతీల్లోని ఓటర్లను ప్రలోభాలకు టీడీపీ నేతలు తమ అనుచరులను రంగంలోకి దింపి మద్యం పంపకాలు చేస్తున్నారు.

మున్సిపాలిటీలోని వార్డుకు ముగ్గురు టీడీపీ ఇన్‌చార్జులను నియమించుకుని పగలు ఓటర్లతో మంతనాలు చేసుకుంటూ రాత్రి వేళల్లో మాత్రం పంపకాలకు తెరలేపుతున్నారు. ఇంటికి ఒక క్వార్టర్‌ పంపకాలు చేస్తున్నారు. ఏప్రిల్‌ 11న జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఒక్కో కుటుంబంలో ఎన్ని ఓట్లు ఉన్నాయి, ఎంతకు ఓట్లు కొనవచ్చు, ఏ విధంగా ఓటర్లను ప్రలోభాలకు గురిచేసి తమవైపు తిప్పుకోవాలో ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు టీడీపీ నేతలు, టీడీపీ నాయకులు గ్రామాలు, వార్డుల్లో ఇంటికి ఒక క్వార్టర్‌ను రాత్రివేళల్లో పంపకాలు చేస్తూ టీడీపీకి ఓట్లేయాలని వార్డు స్థాయి టీడీపీ నేతలు ఓటర్లకు వల విసురుతున్నారంటే ఏవిధంగా ప్రలోభాలకు పాల్పడుతున్నారో అర్థం చేసుకోవచ్చు.

ఓటుకు అమ్ముడు పోవాలా?
చీరాల టౌన్‌: సార్వత్రిక ఎన్నికల ప్రచార జాతర ముగియక ముందే నియోజకవర్గంలో నోట్ల జాతర మొదలైంది. సార్వత్రిక పోరులో పోటీ నెలకొని ఉండటంతో నేతలు నోట్లు పంపిణీ చేస్తుండటంతో ఓటర్ల జేబులు కళకళలాడుతున్నాయి. ఈ ఎన్నికల్లో మాత్రం ఒక్కో ఓటు రూ. 2000 పైగా పలుకుతోంది. పురపాలక సంఘంలోని అన్ని వార్డుల్లో, రూరల్‌ గ్రామాల్లో టీడీపీ నేతలు ఓటర్లకు డబ్బుల పంపిణీలో నిమగ్నమయ్యారు. ప్రచారాల ముగింపునకు మంగళవారం సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే సమయం ఉండటంతో ఓ వైపు ప్రచారాలు చేస్తూనే మరో వైపు ఓటర్లకు నోట్లు పంపిణీలు చేస్తున్నారు. డిమాండ్‌ ఉన్న ఓటుకు రూ.2,500 నుంచి రూ.3000 చొప్పున పంపిణీ జరిగింది. మున్సిపాలిటీలో మొత్తం 33 వార్డులకు, రూరల్‌ గ్రామాల్లో ఓటుకు నోటు పంపిణీతో హోరెత్తింది.

రాత్రి వేళల్లో పొలీసుల హడావుడి ఉంటుందేమోనని ఈ సారి మాత్రం పట్టపగలే ఓటుకు నోట్లు పంచారు. వార్డుకు నాలుగు బృందాలు వెళ్లి నోట్లు పంపిణీ తంతు పూర్తిచేశారు. అయితే ఓటరు  మాత్రం ఎవరికి ఓటు వేస్తారో చూడాల్సిందే. అలాగే టీడీపీ నేతలు ఇంటికో క్వార్టర్‌ మద్యాన్ని పంపిణీ చేస్తున్నారు. ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదలైన నాటినుంచి నామినేషన్లు, ప్రచారాలకు కావాల్సిన అద్దె కార్యకర్తలకు నోటు, క్వార్టర్‌ మద్యాన్ని పంచారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top