టీడీపీ కంట్లో ఇసుక దుమారం!


హయాతినగరంలో ‘తేజ’స్సు

 పేరు మహిళా సంఘాలది...

 నడుపుతున్నది బినామీలు

 అధిష్టానానికి ఫిర్యాదు

 చేస్తామంటున్న దిగువశ్రేణి నేతలు

 80 అడుగుల రోడ్డులో

 నిర్మిస్తున్న కొత్త భవనానికి

 ఇదే ఇసుక


 

 

 సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ఎంపీ, ఎమ్మెల్యే, మంత్రి తమకు బంధువులేనంటూ ప్రభుత్వ కార్యాలయాల్లోని కొంతమంది జులుం ప్రదర్శించడాన్ని తెలుగు తమ్ముళ్లు ఆక్షేపిస్తున్నారు. శ్రీకాకుళం  పట్టణంలోని హయాతినగరంలో గతనెల 16వ తేదీన ప్రారంభించిన ఇసుక రీచ్ ఇపుడు అందరి నోళ్లలోనూ నానుతోంది. నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తరలించడంతో పాటు అందినకాడికి దండుకునేం దుకు కొత్త వ్యక్తులు తెరమీదకు రావడంతో దిగువశ్రేణి నాయకులు మనస్తాపం చెందుతున్నారు. రేవులో జరుగుతున్న అక్రమాలు డీఆర్‌డీఏ, మెప్మా, అధికారుల దృష్టికి వచ్చినప్పటికీ నాయకుల ఒత్తిళ్లతో మిన్నకుండిపోతున్నారు. బల్క్ ఆర్డర్ పేరిట జరుగుతున్న తంతుపై కలెక్టరేట్ సిబ్బందికి ఫిర్యాదులొస్తున్నా ఏమీ చేయలేని పరిస్థితి. ఈ రేవును మూసివేయాలంటూ టీడీపీకే చెందిన ఓ మాజీ కౌన్సిలర్ కలెక్టరేట్ వద్దే ఆందోళన నిర్వహించిన విషయాన్ని ఇపుడు తమ్ముళ్లు గుర్తు చేస్తున్నారు.

 

 చక్రం తిప్పుతున్న మెకానిక్ కొడుకు!

 హయాతినగరం ఇసుక రేవును పట్టణంలోని ఓ మహిళా సంఘానికి అప్పగించినా ఓ మెకానిక్ కుమారుడే రీచ్‌ను కొనసాగిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. మహిళా సంఘాల సభ్యులు ఉదయం ఆరు నుంచి సాయంత్రం ఆరు గంటల వరకే దృష్టి సారిస్తుండడంతో తర్వాత కాలంలో జరుగుతున్న తంతు బయటికి రావడం లేదు. సంఘ సభ్యులు కూడా అరకొరగానే హాజరవుతూ అక్కడి కంప్యూటర్ ఆపరేటర్‌పైనే ఆధారపడుతున్నారు. తనకు మంత్రి మేనల్లుడు సహా ఇతర నేతలంతా బంధువులేనని, ఇక్కడ జరుగుతున్న తతంగం చూసీ చూడనట్లు ఉండాలని డీఆర్‌డీఏ సిబ్బందితో చెబుతుండడాన్ని స్థానిక నాయకులు ఓర్చుకోలేకపోతున్నారు. స్థానిక ఎంపీ కార్యాలయంలో నిత్యం కనిపించే ఇద్దరు వ్యక్తులు ఈ రీచ్ ఆరిథక నిర్వహణ పర్యవేక్షిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. రోజుకు ఈ రీచ్ నుంచి ఎంత స్థాయిలో ఇసుక బయటకు వెళ్తోంది, ఎవరెవరికవసరాల మేరకు ఇసుక ఉపయోగించుకుంటున్నారు, రాత్రి వేళల్లో, సెలవుపూట, పుష్కరాల సమయంలో ఏం జరిగిందో ఆరా తీస్తే అంతా బయటపడుతుందని టీడీపీలోని మరో వర్గం చెబుతోంది.

 

 అక్రమాలకు అడ్డొచ్చిన వారికి నయానో, భయానో నచ్చచెబుతూ ఏరోజుకారోజు ఎవరి వాటాలు వారికి పంపిణీ చేయడంలో ఆ ఇద్దరు వ్యక్తులు బిజీగా ఉంటున్నారు. దీంతో ఇసుక రేవు ‘తేజ’స్సుగా మారుతోంది. నెలరోజుల వ్యవధిలోనే విజయనగరానికి చెందిన ఓ లారీ ఓనర్‌తోపాటు విశాఖకు చెందిన ఓ వ్యాపారి ద్వారా కోట్లాది రూపాయలు వ్యాపారం జరిగినట్లు దిగువశ్రేణి నేతలు చెబుతున్నారు. వాస్తవానికి బల్క్ ఆర్డర్ నిర్వహణ కలెక్టర్ పరిధిలోనే ఉంటుంది. జీవోలో పేర్కొన్న నిబంధనలు అమలు చేయాల్సిన బాధ్యత మాత్రం వివిధ విభాగాల సిబ్బందికి ఉంటుంది. అయితే ఇక్కడ మాత్రం తామంతా పక్కాగా రికార్డులు నిర్వహిస్తున్నామని, మీ-సేవ కేంద్రంలో డబ్బులు చెల్లించి పత్రాలు తెచ్చిన వారికే ఇసుక ఇస్తున్నామని అక్కడి మహిళా సంఘాల సభ్యులతో చెప్పిస్తుండడం విశేషం.

 

 తోపుడు బళ్లే కదా అని..

 గతంలో జీవనాధారం పోతోందని పేర్కొంటూ తోపుడు, టైర్లు, నాటుబళ్లకు అవకాశం ఇవ్వాలని స్థానిక ఎమ్మెల్యే జేసీకి ఫిర్యాదిచ్చిన ఉదంతాన్ని దేశం తమ్ముళ్లు గుర్తు చేస్తున్నారు. ఓ జీవో మార్చాలంటే అది జేసీ చేతుల్లో ఉండదన్న విషయం అందరికీ తెలిసిందే. సెంటిమెంట్ పేరిట ఇచ్చిన లేఖ ఏమైందో తెలియదు గానీ నాయకుల పేరు చెప్పుకుంటూ భారీ ఎత్తున అదే తోపుడు, నాటు, టైరు బళ్లల్లో ఇసుక బయటకు వెళ్లిపోతోంది. 80 అడుగుల రోడ్డులో నిర్మితమవుతున్న భవనానికి ఇసుక, కంకర, మట్టి ఎక్కడి నుంచి వస్తుందో అధికారులు దృష్టి సారిస్తే అంతా బయటపడుతుందని తమ్ముల్లే చెబుతున్నారు. గతంలో పోలీసు కేసులు నమోదై టీడీపీ అధికారంలోకి వచ్చాక లైన్‌మన్ల ఉద్యోగాలు ఇప్పిస్తానని రూ. లక్షలు దండుకున్న యువకుడే అన్నీ తానై రేవు నిర్వహణ బాధ్యతలు చూస్తుండడాన్ని తట్టుకోలేక ఇదే విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకువెళతామంటున్నారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top