దళిత మహిళపై టీడీపీ ఎంపీటీసీ దాడి

TDP MPTC Attack On Dalit Woman In Srikakulam - Sakshi

అర్ధరాత్రి సమయంలో ఇంట్లోకి     చొరబడి కత్తితో వీరంగం

టెక్కలి జిల్లా ఆస్పత్రిలో చికిత్స     పొందుతున్న బాధితురాలు

శ్రీకాకుళం, టెక్కలి: టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర స్థాయి నుంచి గ్రామస్థాయి వరకు దళితులు, సామాన్య ప్రజలపై దాడులు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. వీటితో పాటు దళిత మహిళలపై జరుగుతున్న లైంగికదాడులు, విచక్షణ రహిత దాడులు భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి. తాజాగా సంతబొమ్మాళి మండలం బోరుభద్ర గ్రామంలో టీడీపీ ఎంపీటీసీ సభ్యుడు వల్లభ వసంతరావు, గొనప అప్పిలితో పాటు మరికొంతమంది అనుచరులు గ్రామానికి చెందిన దళిత మహిళ యజ్జల పద్మపై  చేసిన విచక్షణ రహిత దాడితో ఆమె తీవ్రంగా గాయాలపాలై టెక్కలి జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఈ సంఘటనపై అధికార పార్టీకి చెందిన నాయకులపై కేసులు నమోదు చేయడానికి పోలీసులు వెనుకంజ వేస్తున్నారంటూ దళిత సంఘాల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న  బాధితురాలు యజ్జల పద్మ తెలిపిన వివరాలు ప్రకారం...

బోరుభద్ర గ్రామంలో తనకు కొంత భూమి ఉందని కౌలు విషయంలో గ్రామానికి చెందిన టీడీపీ ఎంపీటీసీ సభ్యుడు వల్లభ వసంతరావు తన భూమిని ఆక్రమించుకునే ప్రయత్నాలు చేయడంతో ఇటీవల ఆర్డీవోకు ఫిర్యాదు చేశానని ఆమె వెల్లడించారు. దీంతో కక్ష కట్టిన వసంతరావు తన అనుచరుడు గొనప అప్పిలితో కలిసి ఆదివారం అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో తన ఇంట్లోకి ప్రవేశించి చిన్నపాటి కత్తితో విచక్షణ రహితంగా   దాడి చేశారంటూ బాధితురాలు వాపోయింది. మెడ పట్టుకుని గోళ్లుతో రక్కి కొట్టడంతో వారి కాళ్లపై పడి తనను ఏం చేయవద్దంటూ బతిమలాడినా కనీసం మానవత్వ లేకుండా దాడి చేశారని ఆరోపించింది. దీనికి ఇంటి బయట నుంచి   బొడ్డ రాము, వజ్జ జగన్నాయకులు, వల్లభ మల్లి, మార్పు సహదేవుడు, వల్లభ నర్సింహమూర్తి, గొనప వెంకట్రావు, వల్లభ చిన్నవాడు తదితరులు ప్రోత్సహించారని తెలిపింది. దాడి విషయం తెలుసుకున్న కేఎన్‌పీఎస్‌ దళిత సంఘం ప్రతినిధులు బి.ప్రభాకరరావు, వై.గోపి, బి.మోహనరావు తదితరులు ఆస్పత్రి వద్దకు సోమవారం చేరుకుని బాధితురాలిని ఓదార్చారు. సమాచారం తెలుసుకున్న సంతబొమ్మాళి ఏఎస్‌ఐ ఎన్‌.కృష్ణతో పాటు సిబ్బంది టెక్కలి ఆస్పత్రికి చేరుకుని బాధితురాలి నుంచి వివరాలు సేకరించారు.

దాడికి పాల్పడిన వారిపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలి
సంతబొమ్మాళి మండలం బోరుభద్ర గ్రామానికి చెందిన దళిత మహిళపై దాడికి పాల్పడిన టీడీపీ ఎంపీటీసీ సభ్యుడు వసంతరావుతో పాటు ఆయన అనుచరులపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని దళిత సంఘాల నాయకులు బి.ప్రభాకరరావు, వై.గోపి, బి.మోహనరావు డిమాండ్‌ చేశారు. దాడికి పాల్పడిన వ్యక్తులు టీడీపీ కార్యకర్తలు కావడంతో, కేసును నీరుగార్చే ప్రయత్నాలు చేస్తున్నారని, ఈ విషయంలో మంత్రి అచ్చెన్నాయుడు హస్తం ఉందని ఆరోపించారు. సంతబొమ్మాళి మండల రెవెన్యూ అధికారులు చేసిన తప్పుల వల్లే ఇటువంటి సంఘటన జరిగిందన్నారు.  తక్షణమే నిందితులపై కేసులు నమోదు చేయకపోతే బాధితురాలి పక్షాన ఉధృతమైన పోరాటాలు చేస్తామని వారు హెచ్చరించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top