దర్శనమేదీ? | TDP MP galla jaydev not visits his Constituency | Sakshi
Sakshi News home page

దర్శనమేదీ?

Sep 23 2014 12:23 AM | Updated on Sep 2 2017 1:48 PM

దర్శనమేదీ?

దర్శనమేదీ?

సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో హామీలు గుప్పించిన గల్లా జయదేవ్ గెలుపొందిన తరువాత అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు.

 గుంటూరు :  సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో హామీలు గుప్పించిన గల్లా జయదేవ్ గెలుపొందిన తరువాత అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. వీలు కుదిరినప్పుడు నియోజకవర్గానికి వస్తున్నారు. రెండుమూడు రోజులు ఉండి గుట్టుచప్పుడు కాకుండా వెళ్లిపోతున్నారు. నియోజకవర్గానికి, పార్టీ కార్యకర్తలకు, ప్రజలకు ఇంత వరకు చెప్పుకోదగిన సేవలు చేయలేదనే విమర్శలు బాహాటంగా వినపడుతున్నాయి. కార్యకర్తలు, నాయకులు, నియోజకవర్గ స్థాయి నాయకులకు కనీసం ఫోన్ టచ్‌లో కూడా ఉండటం లేదని అంటున్నారు. సమస్యల పరిష్కారానికి ఎంపీ కార్యాలయానికి వెళ్లిన ప్రజలకు అక్కడి సిబ్బంది సరైన రీతిలో స్పందించడం లేదంటు న్నారు.


 ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన సినీతారలు, పారిశ్రామిక వేత్తలు ప్రజలకు అందుబాటులో ఉండరనే నానుడి ఉన్నప్పటికీ, హైటెక్ ప్రచార మాయలో పడిన ఓటర్లు గల్లా జయదేవ్‌ను గుంటూరు ఎంపీగా గెలిపించారు. గుంటూరులో స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటానని ఆయన ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు. ఇంత వరకు ఆ ప్రయత్నమే చేయలేదు.


  బస్టాండ్‌కు సమీపంలో ఇల్లు నిర్మించుకుని ప్రజలందరికీ అందుబా టులో ఉంటానని సన్నిహితుల వద్ద ఆయన చెబుతున్నప్పటికీ నేటికీ స్థల అన్వేషణ పూర్తికాలేదు.   కుటుంబసభ్యులెవరూ ఇక్కడ ఉండకపోవడంతో ఆయన రాకపోకల సమాచారం పార్టీ ముఖ్యనేతలకీ తెలియడం లేదు. సామాన్య ప్రజలకు ఆయన కార్యాలయ గడప ఎక్కే పరిస్థితులు లేవు. పసుపు చొక్కాలు, ఇన్నోవా, ఓక్సువ్యాగన్. స్కార్పియోలాంటి లగ్జరీ వాహనాల్లో వచ్చే నేతలు, వ్యాపారవేత్తలకే అక్కడ ప్రవేశం ఉంటోంది. జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చిన గల్లా ఆ ప్రయత్నాలు చేస్తున్న దాఖలాలు కనిపించడం లేదు. ఇంటి స్థల అన్వేషణకే మూడు నెలల సమయం తీసుకున్న ఎంపీ పరిశ్రమలు ఏర్పాటు చేస్తారా? ఉద్యోగాలు ఇస్తారా? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.


     ఎన్నికల సమయంలో ఇంజినీరింగ్, ఫార్మసీ, మెడికల్ కళాశాలల విద్యార్థులతో సమావేశమైన జయదేవ్ ఈ ప్రాంత అభివృద్ధికి గల అవకాశాలను వివరించారు. దీంతో విద్యార్థులంతా ఉద్యోగాల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేదని భావించారు. గెలిచిన తరువాత  ఆయన కనపడకపోవడంతో విద్యార్థులంతా నీరుగారిపోతున్నారు.

    చివరకు పార్టీ కార్యకర్తలు, నాయకులకూ అందుబాటులో ఉండటం లేదు. ఎన్నికల సమయంలో రేయింబవళ్లు పనిచేసిన అనేక మంది ద్వితీయ శ్రేణి నాయకులు ఆయనపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. పదవులు వస్తాయనీ, ప్రభుత్వంలో పనులు చేయించుకోవచ్చని భావించారు.


    ప్రస్తుతం పార్టీ పదవులు లేకపోగా, ప్రభుత్వ కార్యాలయాల్లోని పనులకు ఎంపీతో సిఫారసు చేయించుకునే అవకాశాలు లేక వారంతా డీలా పడిపోయారు.


     పార్లమెంటు సమావేశాలు జరిగిన అన్ని రోజులూ జయదేవ్ ఢిల్లీలోనే ఉండటంతో ఆ తరువాత నియోజకవర్గానికి వస్తారని పార్టీ కార్యకర్తలు భావించారు. సమావేశాలు ముగిసిన తరువాత నియోజకవర్గంలోకి అడుగుపెట్టలేదు.


     చివరకు విజయవాడలో శనివారం జరిగిన ఎంపీల సమావేశానికి హాజరై పనిలో పనిగా గుంటూరు వచ్చారు. నియోజకవర్గంలో ఆదివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని గుట్టుచప్పుడు కాకుండా వెళ్లిపోవడంతో కార్యకర్తలు, నాయకులు తీవ్ర నిరాశకు గురయ్యారు.


     మా ఎంపీ కనపడటం లేదు. నియోజకవర్గానికి రావడం లేదని బా హాటంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని మిగిలిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు కూడా ఎంపీకి ఇక్కడి పరిస్థితులను వివరించే స్థితిలో లేరు.ఆయన వచ్చినప్పుడు మాత్రం ‘బాబు’  వచ్చారంటూ దర్శనం చేసుకుని వెళ్లిపోతు న్నారు.


     వివిధ పనులపై ఇక్కడకు వస్తున్న ప్రజలు, పార్టీ కార్యకర్తలు గల్లాపై నమ్మకం లేక నరసరావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావు, గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాలరెడ్డి కార్యాలయాలకు వెళుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement