మాట వినకపోతే.. శాల్తీ గల్లంతే..!

TDP Leaders Threatened Revenue Authorities For Land Mafia In Prakasam - Sakshi

లింగసముద్రం తహసీల్దార్‌పై టీడీపీ నేతల దౌర్జన్యం

టీడీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లలో వందల ఎకరాల ప్రభుత్వ భూముల ఆక్రమణ

ప్రభుత్వ భూములకు రికార్డులు సృష్టించి బ్యాంకుల్లో కోట్ల రూపాయల రుణాలు

తహసీల్దార్‌పై బెదిరింపులకు పాల్పడిన వారిని శిక్షించాలన్న ఎమ్మెల్యే మహీధర్‌రెడ్డి

సాక్షి, ఒంగోలు : మేం చెప్పినట్లు చేయాల్సిందే.. మాట వినకపోతే శాల్తీ గల్లంతే.. రెవెన్యూ రికార్డులు మా పేర్ల మీద మార్చండి.. లేదంటే మీ అంతు చూస్తాం.. అంటూ  మండల మెజిస్ట్రేట్‌పై కబ్జాదారులు బెదిరింపులకు దిగారు.. ఈ విధంగా బెదిరింపులకు పాల్పడింది అధికార పార్టీ నేతలో, వారి అనుయాయులో కాదు.. గత ఐదేళ్లలో ప్రభుత్వ భూములను ఆక్రమించి బ్యాంకుల్లో కోట్ల రూపాయల లోన్‌లు తీసుకుని అధికారిక దందా నడిపిన టీడీపీ నేతలు. అధికారం కోల్పోయినా వీరి తీరు మాత్రం మారలేదనడానికి లింగసముద్రం మండలంలో జరిగిన సంఘటనే ప్రత్యక్ష ఉదాహరణ. రెవెన్యూ రికార్డుల స్వచ్ఛీకరణలో భాగంగా ప్రకాశం జిల్లా కలెక్టర్‌ పోల భాస్కర్‌ భూ వివాదాలు అధికంగా ఉన్న లింగసముద్రం మండలాన్ని పైలట్‌ ప్రాజెక్ట్‌ కింద తీసుకుని 40 రెవెన్యూ బృందాలతో సర్వే మొదలు పెట్టారు. సర్వేలో టీడీపీ నేతల కబ్జా పర్వం బయటపడుతుండటంతో రికార్డులు మార్చాలంటూ తహసీల్దార్‌పై బెదిరింపులకు దిగారు. వారి హెచ్చరికలతో భయాందోళనకు గురైన తహసీల్దార్‌ తనను బదిలీ చేయాలంటూ ఆర్డీఓ, కలెక్టర్‌కు విన్నవించారు. కబ్జాదారులు తనను చంపుతానంటూ బెదిరిస్తున్నారంటూ బహిరంగ సమావేశంలోనే తహసీల్దార్‌ వాపోయారంటే టీడీపీ నేతలు ఏ స్థాయిలో బెదిరింపులకు పాల్పడ్డారో అర్థం చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే...

టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న ఐదేళ్లలో టీడీపీ నేతలు ప్రకాశం జిల్లా, లింగసముద్రం మండలంలో పలు గ్రామాల్లో ప్రభుత్వ భూములను ఆక్రమించి అప్పట్లో ఉన్న రెవెన్యూ అధికారుల ద్వారా ఆన్‌లైన్‌ చేయించేశారు. అంతటితో ఆగకుండా ఆ భూములను బ్యాంకుల్లో తనఖా పెట్టి కోట్ల రూపాయలు లోన్లు పొందారు. పెదపవని గ్రామంలో టీడీపీ నేతగా వ్యవహరిస్తున్న ఓ మాజీ వీఆర్‌ఓ ఒక్కడే 17 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమిని ఆక్రమించారనేది బహిరంగ రహస్యమే. ఐదేళ్లలో సుమారు వెయ్యి ఎకరాల ప్రభుత్వ భూములను బ్యాంకుల్లో తనఖా పెట్టారంటే టీడీపీ నేతలు ఏస్థాయి దందాకు పాల్పడ్డారో అర్థమౌతుంది.

ముఖ్యంగా మండలంలోని పెదపవని, తిమ్మారెడ్డిపాలెం, మొగిలిచర్ల, లింగసముద్రం, మాలకొండరాయునిపాలెం గ్రామాల్లో వాగు, కుంట, కాలువ, గయాలు, ఏడబ్ల్యూ, పశువుల మేత పోరంబోకులు, శ్మశానాలను సైతం వదలకుండా కబ్జా చేసేశారు. అప్పట్లో ఈ వ్యవహారం బయటపడినప్పటికీ కొందరిపై మాత్రమే చర్యలు తీసుకుని వదిలేశారు. ప్రభుత్వ భూములను భారీగా ఆక్రమించిన టీడీపీ నేతల జోలికి మాత్రం వెళ్లని పరిస్థితి. దీంతో ఇప్పటికీ ప్రభుత్వ భూములన్నీ కబ్జాదారుల చేతుల్లోనే ఉండిపోయాయి. రెవెన్యూ రికార్డుల స్వచ్ఛీకరణ సర్వేలో భాగంగా కలెక్టర్‌ పోల భాస్కర్‌ భూ వివాదాలు, ప్రభుత్వ భూముల ఆక్రమణలు ఎక్కువగా ఉన్న లింగసముద్రం మండలాన్ని పైలట్‌ ప్రాజెక్ట్‌ కింద తీసుకుని సర్వే మొదలు పెట్టారు. జిల్లాలోని అన్ని ప్రాంతాల నుంచి 40 రెవెన్యూ బృందాలను మండలంలో మోహరింపజేయడంతోపాటు కలెక్టర్‌ స్వయంగా అక్కడకు వెళ్లి సర్వేను పర్యవేక్షిస్తున్నారు.

కబ్జా భాగోతాలు బయటకు రావడంతో తహసీల్దార్‌పై బెదిరింపుల పర్వం: 
రెవెన్యూ బృందాల పరిశీలనలో గత ఐదేళ్లలో టీడీపీ నేతలు చేసిన భూ ఆక్రమణలు ఒక్కొక్కటిగా బయటపడుతుండటంతో కబ్జాదారుల్లో గుబులు మొదలైంది. జిల్లా కలెక్టర పర్యవేక్షణలో సర్వే జరుగుతుండటంతో ఇక తమను కాపాడేవారు లేరని భావించిన టీడీపీ నేతలు కొందరు రెవెన్యూ రికార్డులు మార్చి తమ పేర్లు చేర్చాలంటూ తహసీల్దార్‌ రాఘవస్వామిపై బెదిరింపులకు దిగారు. చెప్పినట్లు వినకపోతే శాల్తీ గల్లంతేనంటూ హెచ్చరించారు. దీంతో భయాందోళనకు గురైన తహసీల్దార్‌ తనకు కబ్జా దారుల నుంచి ప్రాణహాని ఉందని, తనను బదిలీ చేయాలంటూ కందుకూరు ఆర్డీవో ఓబులేసు, కలెక్టర్‌ పోల భాస్కర్‌ల వద్ద తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అయితే తనను బెదిరించిన వారి పేర్లు చెప్పేందుకు కూడా ఆయన బయపడుతున్న పరిస్థితి. కనీసం పోలీసులకు ఫిర్యాదు కూడా చేయలేదంటే టీడీపీ నేతలు తహసీల్దార్‌ను ఏస్థాయిలో బెదిరించారో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు సీరియస్‌గా తీసుకుని భూ ఆక్రమణదారులపై కఠిన చర్యలు తీసుకుని జిల్లాలో మరో ఘటన జరగకుండా అక్రమార్కులకు హెచ్చరిక పంపాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు డిమాండ్‌ చేస్తున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top