సంధ్యారాణి డీలా భంజ్‌దేవ్ ఖుషీ | TDP Leaders Internal Fighting in Vizianagaram | Sakshi
Sakshi News home page

సంధ్యారాణి డీలా భంజ్‌దేవ్ ఖుషీ

Feb 28 2016 11:40 PM | Updated on Oct 3 2018 7:34 PM

ఖుషి..ఖుషిగా ఉందిలే..అని ఓ వర్గం పాడుకుంటుంటే.. డామిట్ కథ అడ్డం తిరిగిదంటూ మరో వర్గం నిండా ఆవేదనలో మునిగిపోయింది.

ఖుషి..ఖుషిగా ఉందిలే..అని ఓ వర్గం పాడుకుంటుంటే.. డామిట్ కథ అడ్డం తిరిగిదంటూ మరో వర్గం నిండా ఆవేదనలో మునిగిపోయింది. సాలూరు నియోజకవర్గ టీడీపీలో నెలకొన్న అంతర్గత పోరులో మాజీ ఎమ్మెల్యే భంజ్‌దేవ్‌దే పైచేయిగా నిలిచింది. ఎమ్మెల్సీ గుమ్మడి సంధ్యారాణికి  ఆ పార్టీ అధిష్టానం కాస్త ఝలక్ ఇచ్చింది. ప్రజాప్రతినిధి కాకపోయినప్పటికీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ హోదాలో భంజ్‌దేవ్‌కే పెద్ద పీట వేసింది.
 
 సాక్షి ప్రతినిధి, విజయనగరం:  ఇటీవల కాలంలో  శాసన మండలి సభ్యురాలు గుమ్మడి సంధ్యా రాణి, నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి ఆర్‌పి భంజ్‌దేవ్‌ల మధ్య ఆధిపత్య పోరు ఎక్కువైంది. సమావేశ వేదికల సాక్షిగా వర్గాల వారీగా పొట్లాడుకుంటున్నారు. ప్రజాప్రతినిధి కాకపోయినప్పటికీ ప్రొటోకాల్ తరహాలో అన్ని అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని,   ప్రజాప్రతినిధిగా చెలామణి అయిపోతున్నారని, నియోజకవర్గానికొచ్చిన అవకాశాలను ఒక్క సాలూరుకే పరిమితం చేస్తున్నారన్న ఆవేదనతో సంధ్యారాణి వర్గీయులున్నారు.
 
  అవకాశం వచ్చినప్పుడల్లా రచ్చకెక్కుతున్నారు.  పార్టీ సీనియర్ అయిన ఆయన మాట చెల్లుబాటు కాకపోతే ఎలా అని, మొదటి నుంచి పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న  ఆయనను కాదని, అనుకోని పరిణామాలతో ఎమ్మెల్సీ అయిన సంధ్యారాణి పెత్తనమేంటని భంజ్‌దేవ్ వర్గీయులు మండిపడుతున్నారు. నియోజకవర్గ ఇన్‌చార్జ్ హోదాలో  ఆయనకే పెద్ద పీట వేయాలని బాహాటంగానే డిమాండ్ చేస్తున్నారు. ఇరువర్గాల పోరుపై  అశోక్ గజపతిరాజు ఆధ్వర్యంలో ఆమధ్య పంచాయతీ కూడా జరిగింది.
 
 లోకేష్ డెరైక్షన్‌లో..
 ఇరువర్గీయుల వ్యవహారం చినికి చినికి గాలివానగా మారి  ఏకంగా రాష్ట్ర పార్టీ దృష్టికి వెళ్లింది.  ఇంకేముంది ప్రభుత్వ స్థాయిలో షాడో నేతగా చెలామణి అవుతున్న చినబాబు లోకేష్  రంగంలోకి దిగారు. జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి జగదీష్‌ను పిలిపించి సాలూరు వ్యవహారంపై డెరైక్షన్ ఇచ్చారు. నియోజకవర్గంలో ఏదైనా  భంజ్‌దేవ్‌కు తెలిసే జరగాలని స్పష్టం చేశారు.   అయినా దారికి రాకపోతే ఇకపై రాష్ట్ర పార్టీయే సాలూరు వ్యవహారాల్ని చూసుకుంటుందని హెచ్చరికలు కూడా పంపించారు. దీంతో   ఆదివారం విజయనగరంలోని అశోక్ బంగ్లాలో సాలూరు నియోజకవర్గ సమన్వయ కమిటీ సమావేశాన్ని జిల్లా అధ్యక్షుడు జగదీష్ నిర్వహించారు. ఎమ్మెల్సీ సంధ్యారాణి, మాజీ ఎమ్మెల్యే భంజ్‌దేవ్ తదితర నియోజకవర్గ నేతలంతా ఈ సమావేశానికి హాజరయ్యారు.
 
  లోకేష్ చెప్పినదంతా  సమావేశంలో జగదీష్ వివరించారు. నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా భంజ్‌దేవే కీలక పాత్ర పోషిస్తారని, ఏదైనా ఆయన కనుసన్నల్లో జరగాలని, ప్రభుత్వ పరంగా వచ్చే పథకాలు, అభివృద్ధి పనులు  ఆయన ఇష్టానుసారమే జరగాలని, ఆయన చెప్పిందే అంతిమమని స్పష్టంగా చెప్పేశారు.    కాకపోతే, సంధ్యారాణిని సమన్వయం చేసుకోవాల్సిన బాధ్యత భంజ్‌దేవ్‌పై ఉందని సూచించారు.
 
 ప్రభుత్వ స్థాయిలో రావాల్సిన వాటి విషయంలో  సంధ్యారాణి చొరవ తీసుకోవాలని తెలిపారు.  ఇదే విషయాన్ని పార్టీలోని అట్టడుగు వర్గాలకు తెలియజేసేందుకు మార్చి 3వ తేదీన సాలూరులో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు జగదీష్ తెలిపారు. దీంతో అంతా తమకు అనుకూలంగా జరిగిందని భంజ్‌దేవ్ వర్గీయులు సంబర పడగా,  సంధ్యారాణి వర్గీయులు కంగుతిన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement