కేఈ వర్సెస్‌ తుగ్గలి

tdp leaders internal fight In Kurnool - Sakshi

రైల్వే కాంట్రాక్టు పనులపై రభస 

పనులు చేస్తున్న ప్రాంతంలో దాడి 

కేఈ శ్యాంబాబు అనుచరుల పనేనంటున్న తుగ్గలి నాగేంద్ర

సాక్షి ప్రతినిధి, కర్నూలు: అధికార పార్టీలో ఉన్న కేఈ, తుగ్గలి నాగేంద్ర మధ్య విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. రైల్వే కాంట్రాక్టు పనుల విషయంలో విభేదాలు ముదిరి, ఏకంగా దాడులు చేసుకునే దాకా పరిస్థితి వెళ్లింది. రైల్వే కాంట్రాక్టు పనులు చేస్తున్న ప్రాంతంలోకి కేఈ శ్యాంబాబు స్టిక్కరు తగిలించుకున్న వాహనంలో ఆయన అనుచరులు వచ్చి.. కాంట్రాక్టు సంçస్థకు చెందిన లారీలు, జేసీబీలపై దాడులు చేశారని తుగ్గలి నాగేంద్ర అంటున్నారు. లింగనేనిదొడ్డి నుంచి గుంతకల్లు వరకు మొత్తం 50 కిలోమీటర్ల మేర రూ.78 కోట్లతో రైల్వే లైన్‌ డబ్లింగ్‌ పనులు జరుగుతున్నాయి. 

వీటిని తుగ్గలి నాగేంద్ర అండదండలతో కాంట్రాక్టర్లు చేస్తున్నారనేది కేఈ వర్గం భావన. కాంట్రాక్టు చేయొద్దని తుగ్గలిని వారించినప్పటికీ వినకపోవడం వల్లనే ఈ ఘటనలు జరుగుతున్నాయన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. తమను బెదిరించేందుకు చేస్తున్న ఈ ఘటనలకు భయపడబోమని తుగ్గలి నాగేంద్ర అంటున్నారు. కేఈ శ్యాంబాబు ఇప్పటికే వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పత్తికొండ నియోజకవర్గ నేత చెరుకులపాడు నారాయణ రెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. తాజా సంఘటనలోనూ ఆయనపై సొంత పార్టీ నేతనే ఆరోపణలు చేయడం గమనార్హం. మరోవైపు దీనిపై కేఈ వర్గం ఇంకా అధికారికంగా స్పందించలేదు. మొదటి నుంచి ఇరువర్గాల మధ్య నెలకొన్న విభేదాలు ఇప్పుడు ఏకంగా దాడుల దాకా వెళ్లడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. మరోవైపు జరిగిన సంఘటనకు సంబంధించి గుర్తు తెలియని వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేశారు.  

మొదటి నుంచీ అదే తీరు!
వాస్తవానికి ఇరువర్గాల మధ్య ఆధిపత్యపోరు మొదటి నుంచీ నడుస్తోంది. అయితే, చంద్రబాబు కుటుంబానికి తుగ్గలి నాగేంద్ర దగ్గర కావడంతో కేఈ వర్గం ఆయన్ను ఏమీ చేయలేకపోతోందన్న అభిప్రాయం ఉంది. ఇక ఏటా నిర్వహించే సామూహిక వివాహ మహోత్సవానికి జిల్లాలోని అందరు నేతలను పిలిచిన తుగ్గలి నాగేంద్ర.. కేఈ కుటుంబాన్ని మాత్రం దూరంగా ఉంచారు. అలాగే వివిధ కార్పొరేషన్లకు సంబంధించి లబ్ధిదారుల ఎంపికలో కేఈ వర్గం వారికే ప్రాధాన్యత ఇస్తున్నారంటూ మండల కార్యాలయంలో హల్‌చల్‌ చేశారు. తమ వర్గానికి కూడా కార్పొరేషన్‌ రుణాలు అందేలా జాబితా రూపొందించాలంటూ ఉద్యోగులపై చిందులు వేశారు. దీంతో నాగేంద్రపై కేసు పెట్టేదాకా పరిస్థితి వెళ్లింది. 

ఇక రైల్వే కాంట్రాక్టు విషయంలో ఎవ్వరూ టెండరు వేయవద్దని కేఈ వర్గం నుంచి హెచ్చరికలు వెళ్లాయి. ఈ కాంట్రాక్టు పనులను వారే తీసుకోవాలని భావించారు. అయితే, దీన్ని ఖాతరు చేయని తుగ్గలి నాగేంద్ర టెండర్‌లో పాల్గొనడమే కాకుండా పనులు సైతం దక్కించుకున్నారు. ఇది కేఈ వర్గానికి మింగుడుపడని వ్యవహారంగా మారింది. ఈ నేపథ్యంలోనే రైల్వే పనులు చేస్తున్న ప్రాంతానికి వెళ్లి.. లారీలు, జేసీబీల అద్దాలు పగలగొట్టి, పనులు చేయవద్దంటూ బెదిరింపులకు దిగారు. వారు కేఈ శ్యాంబాబుకు చెందిన స్టిక్కర్లు అతికించిన వాహనాల్లో వచ్చారని తుగ్గలి నాగేంద్ర అంటున్నారు. దీనిపై పోలీసు స్టేషన్‌లోనూ ఫిర్యాదు చేశారు. అయితే, ఇప్పటివరకు కేఈ కుటుంబంపై ఎటువంటి కేసు నమోదు కాలేదు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top