అధికార పార్టీ అరాచకం | TDP Leaders Attack On BLO Prakasam | Sakshi
Sakshi News home page

అధికార పార్టీ అరాచకం

Oct 29 2018 1:34 PM | Updated on Apr 3 2019 4:04 PM

TDP Leaders Attack On BLO Prakasam - Sakshi

అధికార పార్టీ నేతల ఆగడాలు రోజురోజుకూ పెచ్చుమీరుతున్నాయి. ప్రభుత్వ అధికారులు, సిబ్బంది విధుల్లో మితిమీరిన జోక్యం చేసుకుంటూ వారిని తీవ్ర ఒత్తిడికి గురిచేస్తున్నారు. ఒంగోలులో విధుల్లో ఉన్న బీఎల్వోతో టీడీపీ నేతలు వాగ్వాదానికి దిగి ఆమెతో దురుసుగా మాట్లాడారు. దీంతో ఒత్తిడి తట్టుకోలేని ఆమె అక్కడికక్కడేకుప్ప కూలిపోయింది.

ఒంగోలు: అధికార పార్టీ అరాచకం పరాకాష్టకు చేరిందనేందుకు ఆదివారం ఒంగోలులో జరిగిన ఘటనే నిదర్శనం. బీఎల్వో విధుల్లో ఉన్న కసుకుర్తి జయశ్రీపై పలువురు టీడీపీ నేతలు వాగ్వాదానికి దిగారు. ఒకానొక దశలో వారిని నిలువరించడం అక్కడ ఉన్నవారందరికీ కష్టంగా మారింది. మహిళని కూడా చూడకుండా ఆమె మనసు తీవ్రంగా గాయపడేలా మాట్లాడటంతో ఆమె ఉక్కిరిబిక్కిరై అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. ఈ ఘటన స్థానిక బైపాస్‌కు పడమర వైపు ఉన్న వివేకానంద విద్యావిహార్‌ (కొడవల్లూరు సుబ్బారెడ్డి) హైస్కూల్లో చోటుచేసుకుంది.

ఏం..జరిగిందంటే?
ఈ నెల 21న టీడీపీ నాయకుడు వాసు, మరికొంతమంది వచ్చి ఓటర్లను బండిల్స్‌గా తీసుకోవాలంటూ ఒత్తిడి తెచ్చారు. ఇందుకు ఆమె ససేమిరా అంది. ఆమెపై ఒత్తిడి తెచ్చారు. చివరకు అక్కడకు వెళ్లిన అధికారులు సైతం ‘మీరు అధికార పార్టీ నేతల టార్గెట్‌లో ఉన్నారు. ఎందుకు అనవసరమైన రాద్ధాంతం..దరఖాస్తులు తీసుకోవాలంటూ ఉచిత సలహా ఇచ్చారు. ఇది ఎన్నికల నియమ నిబంధనలకు విరుద్ధమని, తాము అలా తీసుకోలేమంటూ బీఎల్‌వోలు తిరస్కరించారు. విషయం వైఎస్సార్‌ సీపీ నేతల దృష్టికి చేరడంతో వారు కూడా అక్కడకు చేరుకున్నారు. విషయం సద్దుమణిగింది. ఇది ఈ ఒక్కచోటే కాదు.. అనేక పోలింగ్‌ బూత్‌ల్లో పరిస్థితి ఇలాగే ఉంది. దాదాపు 40 మందికిపైగా బూత్‌ లెవల్‌ ఆఫీసర్లు మరునాడైన సోమవారం తహసీల్దార్‌ కార్యాలయానికి చేరుకొని తమ గోడు వెళ్లబోసుకున్నారు. తమకు రక్షణ కల్పించకుంటే బీఎల్‌వోలుగా విధులు నిర్వహించలేమంటూ తేల్చి చెప్పారు. ఇదే విషయాన్ని మీడియాకు కూడా వివరించారు. ఈ వీడియో వాట్సప్‌లో రావడంతో ఆగ్రహించిన టీడీపీ నాయకుడు వాసు కొంతమందితో కలిసి పోలింగ్‌ బూత్‌ వద్దకు వెళ్లి ఆమెతో ఈ ఆదివారం వాగ్వాదానికి దిగాడు.

అతనికి ఆమె సమాధానం చెబుతుండగానే వాసుతో పాటు వెళ్లిన జిల్లెలమూడి కోటేశ్వరరావు అనే వ్యక్తి ఆమెపై మరింత ఆగ్రహం వ్యక్తం చేస్తూ పైపైకి వెళ్లడంతో ఒక్కసారిగా ఆమెలో దుఃఖం కట్టలు తెంచుకొని భావోద్వేగానికి గురై అక్కడికక్కడే స్పృహ కోల్పోయింది. అధికార పార్టీ నాయకుల అరాచక వాగ్వాద్దానికి తట్టుకోలేక బీఎల్‌ఓ పడిపోయారనే సమాచారం రావడంతో వైఎస్సార్‌ సీపీ నగర అధ్యక్షుడు సింగరాజు వెంకట్రావు, గంటా రామానాయుడు, ఓగిరాల వెంకట్రావు పోలింగ్‌ బూత్‌ వద్దకు చేరుకున్నారు. పడిపోయిన జయశ్రీని తమ కారులో ఆస్పత్రికి తీసుకెళ్తామని అక్కడ ఉన్న వారికి చెప్పారు. అలా అయితే  తమపై రాజకీయ ముద్రవేస్తారని, తాము ఇప్పటికే తహసీల్దార్‌కు సమాచారం అందించామని పేర్కొంటూ అక్కడ ఉన్న వారు విజ్ఞప్తి చేశారు. మరో వైపు సమస్య తన దృష్టికి రావడంతో  సంఘటన స్థలానికి వెళ్లాలంటూ తహసీల్దార్‌ను ఒంగోలు ఆర్‌డీవో ఆదేశించారు. తహసీల్దార్‌ బ్రహ్మయ్య అక్కడకు చేరుకుని పరిశీలిస్తే ఆయనకు సైతం నోటమాట రాలేదు. ఒక వైపు శ్వాస పీల్చుకునేందుకు జయశ్రీ కష్టపడుతుండటంతో అక్కడ ఉన్నవారందరినీ బయటకు పంపి ఆమెకు ప్రాథమిక సహాయక చర్యలు అందించాలని సూచించారు. టీడీపీ నాయకులపై తహసీల్దార్‌ ఆగ్రహించి అక్కడి నుంచి వెళ్లిపోవాలని హెచ్చరించడంతో వారు అదృశ్యమయ్యారు.   

అధికారుల్లో టెన్షన్‌
తహసీల్దార్‌ నుంచి సమాచారం అందగానే ఒంగోలు ఆర్డీవో పెంచల కిశోర్‌ వివేకానంద విద్యావిహార్‌ వద్దకు చేరుకున్నారు. గుండె వేగంగా కొట్టుకుంటోందని బీఎల్‌ఓలు ఆయనకు వివరించారు. ఈ క్రమంలో అక్కడే విధులు నిర్వహిస్తున్న ఇతర బీఎల్‌వోలతో ఆర్‌డీవో పెంచల కిశోర్‌ మాట్లాడారు. ప్రాథమిక చికిత్స అనంతనం తహసీల్దార్‌ బ్రహ్మయ్య తన కారులో జయశ్రీని రిమ్స్‌కు తరలించేందుకు యత్నిస్తుండగా 108 చేరుకుంది. 108లో ఆమెకు రిమ్స్‌కు తరలించారు. తన కుమార్తె ఇటీవలే ప్రాణాపాయం నుంచి బయటపడిందని జయశ్రీ తల్లి కోటమ్మ తెలపడంతో ఆమెకు గతంలో చేసిన వైద్యం తాలూకా రిపోర్టులు ఉంటేగానీ తాము అడుగు ముందుకు వేయలేమంటూ వైద్యులు చెప్పుకొచ్చారు. రెండున్నర గంటల సమయంలో ఆమె కోలుకొని చిన్నగా మాట్లాడుతుండటంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతానికి ఆమె పరిస్థితి మెరుగైందని, ఆమె ఎటువంటి ఒత్తిడికి గురికారాదంటూ కుటుంబ సభ్యులు, అధికారులకు వైద్యులు సూచించారు.

వైఎస్సార్‌ సీపీ నాయకుల అసంతృప్తి
జయశ్రీ మాటాపలుకు లేకుండా పడిపోయి ఉండడాన్ని చూసిన వైఎస్సార్‌ సీపీ నాయకులు తహసీల్దార్‌ బ్రహ్మయ్యపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులకు రక్షణ కల్పించడంలో విఫలమయ్యారన్నారు. గత వారం ఫిర్యాదు చేసినా కనీసం సమస్యాత్మక కేంద్రం వద్ద పోలీసులను ఎందుకు మోహరింపజేయలేకపోయారంటూ మండిపడ్డారు. కట్టలు కట్టలుగా కనీస ఆధారాలు కూడా లేకుండా దరఖాస్తులు తీసుకొస్తుంటే భవిష్యత్తులో జరిగే చర్యలకు బీఎల్‌ఓలు బాధ్యులు కావాలా..అంటూ నిలదీశారు. బాధ్యతాయుతంగా పనిచేసే వారికి రాజకీయాలు అంటగట్టడం సరికాదని, కనీసం పడిపోయినప్పుడు కూడా ఆమెను ఆస్పత్రికి తరలించాలనే ఆలోచన అధికార పార్టీ నాయకులకు రాకపోవడం శోచనీయమని విమర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement