టీడీపీ నేతల బరితెగింపు

TDP Leaders And Activists Attacked YSRCP Activists In Santhakaviti Srikakulam - Sakshi

వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై దాడి

ఇళ్లలో చొరబడి ఫర్నిచర్‌ ధ్వంసం

పదిమందికి గాయాలు

కృష్ణంవలసలో ఉద్రిక్తత

సాక్షి, రాజాం (శ్రీకాకుళం): సంతకవిటి మండలం కృష్ణంవలస గ్రామం టీడీపీకి కంచుకోట. ఈ పంచాయతీకి నాయకత్వం వహిస్తున్న గండ్రేటి కేసరి ప్రస్తుతం వైస్‌ ఎంపీపీ(టీడీపీ)గా ఉంటున్నారు. ఇటీవల ఈ గ్రామంలో టీడీపీలో చీలికలు వచ్చాయి. గ్రామానికి చెందిన ముద్దాడ రాములు, ముద్దాడ జోగులు, దాసరి సూర్యారావు, సింహాచలం, కిక్కర సూర్యారావు, ముద్దాడ దుక్కన్న, ముద్దాడ బాలకృష్ణ ముద్దాడ వీరన్న తదితరులుతోపాటు మరో 20 కుటుంబాలు ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలు ముందు వైఎస్సార్‌సీపీలోకి చేరేందుకు సిద్ధమయ్యారు. ఆ చేరికలను గ్రామానికి చెందిన టీడీపీ నేతలు గట్టిగానే అడ్డుకున్నారు.

సీఎం జగన్‌మోహన్‌రెడ్డి పాలనకు ఆకర్షితులై వీరంతా ఈ నెల 24న వైఎస్సార్‌సీపీ రాష్ట్ర యువజన కార్యదర్శి సిరిపురపు జగన్‌మోహన్‌రావు సమక్షంలో పార్టీలో చేరారు. అప్పటి నుంచి గ్రామంలో వీరిపై టీడీపీ వాళ్లు కక్షకట్టారు. రెండురోజుల క్రితం గ్రామంలో చిన్నపాటి అలజడి కూడా రేగింది. ఈ గ్రామానికి చెందిన దాసరి సూర్యారావు వైఎస్సార్‌సీపీలో చేరగా.. అతని సోదరుడు రాంబాబు టీడీపీలో ఉన్నాడు. పోలీసుల కథనం ప్రకారం శనివారం ఉదయం వైఎస్సార్‌సీపీకి చెందిన దాసరి రాములమ్మ ఇంటి వద్ద మిగిలిన అన్నం పారబోసిన విషయంలో రాములమ్మకు, రాంబాబు భార్య లక్ష్మికి మధ్య వివాదం చెలరేగింది.

రాములమ్మ సోదరుడు బాలకృష్ణ అక్కడకు చేరుకుని వివాదాన్ని సద్దుమణిగించే ప్రయత్నం చేస్తుండగా అదునుకోసం కాచుకుని ఉన్న గండ్రేటి కేసరి, పాలిన చిన్నారావు, వంకల తవుడు, ఇలిస వీరన్న, అలబోయిన రామకృష్ణ, పాలిన చినపాపారావు, పాలిన అప్పన్న, పాలిన సింహాద్రి, వంకల రామకృష్ణ, ముద్దాడ తవుడు, ముద్దాడ సురేష్, వంజరాపు అర్జునరావు, వంజరాపు చినవెంకటరావు, ఎల్లంకి సూర్యారావు, ఇలిసి పండోడు తదితరులు ముద్దాడ బాలకృష్ణపై దాడికి పాల్పడ్డారు. అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నం చేయగా ఇంటివరకూ వెళ్లి దాడిచేశారు. గ్రామంలో ఉంటున్న వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు ముద్దాడ జోగులు, ముద్దాడ రాములు, కిక్కర సూర్యారావు ఇళ్లపై కూడా దాడిచేసి తలుపులు, పర్నిచర్‌ను ధ్వంసం చేశారు. ఈ ఘటనలో ముద్దాడ బాలకృష్ణ భుజానికి బలమైన గాయమైంది. దాసరి సింహాచలం, ముద్దాడ దుక్కన్న, ముద్దాడ వీరన్నలు కూడా తీవ్రంగా గాయపడ్డారు.

మరో ఆరుగురికి స్వల్పగాయాలు అయ్యాయి. దాడి నుంచి తప్పించుకున్న దుక్కన్న గాయాలతో బయటపడి పక్కనే ఉన్న కొండగూడేం పంచాయతీకి చేరుకుని అక్కడి సర్పంచ్‌ కెంబూరు సూర్యారావు ఇంటి వద్ద తలదాచుకున్నాడు. అక్కడి నుంచి సంతకవిటి పోలీసులకు సమాచారం ఇవ్వగా విషయం తెలుసుకున్న సంతకవిటి పోలీసులతో పాటు రాజాం రూరల్‌ సీఐ పి.శ్రీనివాసరావు కృష్ణంవలస చేరుకున్నారు. ఘటన జరిగిన ప్రాంతాలను పరిశీలించడంతో పాటు దాడికి పాల్పడినవారి వివరాలు సేకరించారు. బాధతులు వద్ద ఫిర్యాదు తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. విషయం తెలిసిన జిల్లా ఎస్పీ అమ్మిరెడ్డి ఫోన్‌ ద్వారా మరిన్ని వివరాలు సేకరించడమే కాకుండా గ్రామంలో పోలీస్‌ పహారా ఏర్పాటు చేశారు. పాలకొండ డీఎస్పీ జి.ప్రేమ్‌కాజల్‌ కృష్ణంవలస గ్రామానికి చేరుకుని ఘటనకు సంబంధించిన వివరాలు సేకరించారు. దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షిస్తామని రాజాం రూరల్‌ సీఐ తెలిపారు.

పక్కా ప్లాన్‌తోనే...
తీవ్ర గాయాలుపాలైన ముద్దాడ బాలకృష్ణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తనపై 15 మంది దాడి చేసినట్లు పేర్కొన్నాడు. సంతకవిటి వైస్‌ ఎంపీపీ(టీడీపీ) గండ్రేటి కేసరి ప్రధాన పాత్ర ఉందని ఫిర్యాదులో ఆరోపించాడు.  గ్రామంలో తమకు ప్రాణహాని ఉందని వాపోయాడు.

వైఎస్సార్‌సీపీ శ్రేణుల నిరసన 
వైఎస్సార్‌సీపీ కార్యకర్తలుపై దాడిచేయడాన్ని ఆ పార్టీ సంతకవిటి మండల నాయకులు, రాష్ట్ర యువజన కార్యదర్శి సిరిపురపు జగన్‌మోహన్‌రావుతో పాటు పలువురు సంతకవిటి పోలీస్‌ స్టేషన్‌కు చేరుకున్నారు. దాడికి పాల్పడిన వారిని అదుపులోకి తీసుకుని కఠినంగా శిక్షించాలని పోలీసులను కోరారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top