ఆడం'బరి'మే!

TDP Leaders All Set For Hen Fights in West Godavari - Sakshi

కోడిపందేలకు సిద్ధం భారీ హంగులతో బరులు

అక్కడక్కడ పోలీసుల యాక్షన్‌

పెద్దఎత్తున బైండోవర్‌ కేసులు

అనుమతులు వస్తాయన్న ధీమాతో ఏర్పాట్లు

పందేలకు అధికార టీడీపీ నేతల మద్దతు

సాక్షి ప్రతినిధి, పశ్చిమగోదావరి, ఏలూరు/భీమవరం: సంక్రాంతికి రెండు రోజులే ఉండటంతో జూదరులు, నిర్వాహకులు జోరు పెంచారు. పోలీసుల హెచ్చరికలనూ బేఖాతరు చేస్తున్నారు. కోడిపందేలకు భారీగా సిద్ధపడుతున్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని ప్రజలంతా పండగ నిమిత్తం తమ స్వగ్రామాలకు చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలోకోడిపందేలకు ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. పెద్ద సంఖ్యలో నిర్వాహకులు బరులు సిద్ధం చేస్తున్నారు. కొన్నిచోట్ల కోడిపందేల బరులను పోలీసులు ధ్వంసం చేస్తుండటంతో కబడ్డీ, ఇతర క్రీడాపోటీలు నిర్వహిస్తామని చెబుతూ.. బరులు సిద్ధం చేస్తున్నారు.

ఇప్పటికే ఆరంభం
ఇప్పటికే జిల్లాలో అక్కడక్కడ కోడిపందేలు మొదలైపోయాయి. పోలీసుల కళ్లుగప్పి నిర్వాహకులు రూ.లక్షల్లో పందేలు వేస్తున్నారు. బెట్టింగ్‌తో కూడిన కోడిపందేలు నిర్వహిస్తే కేసులు నమోదు చేస్తామని, కోర్టులో హాజరుపరుస్తామని  పోలీసులు హెచ్చరిస్తున్నా.. బేఖాతరు చేస్తున్నారు. ఇప్పటికే పోలీసులు పెద్ద ఎత్తున బైండోవర్‌ కేసులను నమోదు చేశారు.

భీమవరం సమీపంలో భారీగా..
కోడిపందేలకు ప్రసిద్ధి చెందిన  భీమవరం నియోజకవర్గంలో భారీగా కోడిపందేల బరులు సిద్ధమవుతున్నాయి. భీమవరం, వీరవాసరం మండలాల్లోని కొణితివాడు, నవుడూరు, వడ్డిగూడెం, పెదగరువు, యనమదుర్రు, తుందుర్రు, గొల్లవానితిప్ప తదితర గ్రామాల్లో పందేలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.  కొణితివాడ గ్రామంలో సిద్ధం చేసిన పందేల బరిని పోలీసులు ట్రాక్టర్‌తో ధ్వంసం చేయించారు. చుట్టూ వేసిన ఫెన్సింగ్‌ రాళ్లను పీకి వేశారు. కబడ్డీ పోటీల పేరుతో కొన్నిచోట్ల ప్రచారం చేయడంతో అధికారయంత్రాంగం ఆ ప్రాంతాల్లోకి వెళ్లలేకపోతోంది.   అయితే గతంలో పందేలు జరిగిన గ్రామాల్లో పోలీసులు హెచ్చరికల బోర్డులు ఏర్పాటు చేశారు.   పందేలు, జూదాల్లో పాల్గొంటే కఠిన చర్యలు తప్పవంటూ గ్రామసభల ద్వారా ప్రచారం చేస్తున్నారు.

రెండేళ్ల నుంచీ నరసాపురంలోనూ..
నరసాపురంలో గతంలో కోడిపందేలు పెద్దగా జరిగేవి కాదు. రెండేళ్ల నుంచి తెలుగుదేశం నాయకులు ఆ ప్రాంతానికీ పందేలు అలవాటు చేశారు. ఈ ఏడాది మరింత భారీగా నిర్వహించాలని  యత్నాలు చేస్తున్నారు. ఒక్కో ప్రాంతాన్ని టీడీపీ నాయకులు పంచుకుని బరులు సిద్ధం చేస్తున్నారు. నరసాపురం ఎంపీపీ వాతాడి కనకరాజు, మరికొంత మంది టీడీపీ నాయకులు సీతారామపురం స్వర్ణాం«ధ్ర కళాశాల వద్ద బరి సిద్ధం చేస్తున్నారు. లక్ష్మణేశ్వరంతోపాటు నరసాపురం పట్టణంలోని పీచుపాలెంలో పెద్ద బరులు సిద్ధం చేస్తున్నారు. వేములదీవి, సారవ గ్రామాల్లోనూ పందేలకు సిద్ధమవుతున్నారు.  మొగల్తూరు మండలం మొగల్తూరు, కేపీపాలెం రామన్నపాలెం గ్రామాల్లో బరులు సిద్ధం చేస్తున్నారు. ఈ బరుల వద్ద పోలీసులు హెచ్చరికల బోర్డులు పెడుతున్నారు. ఎవరి పని వారిది అన్నట్టుగా ఉంది ఇక్కడి వ్యవహారం.

పాలకొల్లులో టీడీపీ నేతల కనుసన్నల్లో..!
పాలకొల్లు నియోజకవర్గంలో టీడీపీ నేతల కనుసన్నల్లోనే పందేలకు సన్నాహాలు జరుగుతున్నాయి.  పాలకొల్లు పట్టణంలోని పూలపల్లి బైపాస్‌ రోడ్డులో, అలాగే వడ్లవానిపాలెం, వేడంగి, పూలపల్లి, యలమంచిలి మండలంలో కొంతేరు, చించినాడ, పోడూరు పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున కోడి పందేలు, గుండాటలకు టీడీపీ నాయకులు తెరలేపారు. ఇందుకు సంబంధించి కొన్ని ప్రాంతాల్లో కోడిపందేల నిర్వహణకు బరులు సిద్ధం చేస్తున్నారు.  వాలమర్రులో సిద్ధం చేస్తున్న బరిని పోలీసులు ధ్వంసం చేశారు. భగ్గేశ్వరం, పూలపల్లి ప్రాంతాల్లో వేసే బరులను గుర్తించి హెచ్చరిక బోర్డులు ఏర్పాటుచేశారు.

చింతలపూడిలో బేఖాతర్‌
చింతలపూడి నియోజకవర్గంలో జూదరులు పోలీ సుల హెచ్చరికలను బేఖాతర్‌ చేస్తున్నారు. చింతలపూడి, లింగపాలెం, కామవరపుకోట, జంగారెడ్డిగూడెం మండలాల్లోని పలు గ్రామాల్లో పందేలు నిర్వహించేందుకు బరులు సిద్ధం చేస్తున్నారు. జంగారెడ్డిగూడెం  మండలంలో సిద్ధం చేసిన బరులను పోలీసులు ధ్వంసం చేశారు. ఇప్పటివరకు జంగారెడ్డిగూడెం పోలీసు సబ్‌ డివిజన్‌లో 154 మందిపై బైండోవర్‌  కేసులు నమోదు చేశారు.

ఇంకా చాలాచోట్ల
ఉండి నియోజకవర్గం ఐ.భీమవరంలో ఏటా భారీగా పందేలు జరుగుతాయి. ఈ ఏడాది కూడా ఇక్కడ బరిని సిద్ధం చేస్తున్నారు. తణుకు నియోజకవర్గంలో  దువ్వ, తేతలి, అత్తిలి ప్రాంతాల్లో ఇప్పటికే బరులు సిద్ధం చేశారు. కొన్నిచోట్ల పోలీసులు అడ్డుకుంటున్నారు. 

స్నేహపూర్వక పందేలు ప్రారంభం
వీరవాసరం మండలం నందమూరుగరువు గ్రామంలో శుక్రవారం నిర్వహించిన జన్మభూమి–మావూరు కార్యక్రమం సందర్భంగా అధికార తెలుగుదేశం పార్టీ నాయకుడు కనుమూరి రఘురామకృష్ణంరాజు కోడి పందేలను స్నేహపూర్వకంగా పుంజులను వదిలి ప్రారంభించారు. దీంతో జూదరుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. పండగకు పందేలు తప్పకుండా ఉంటాయనే భరోసా కలిగింది. ప్రభుత్వం సానుకూలంగా  చూసీచూడనట్టు వ్యవహరిస్తోందని, ఈ నాలుగు రోజులూ పందేల వైపు అధికారులు కన్నెత్తి చూడరనే భావన సర్వత్రా వ్యక్తమవుతోంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top