బాబు చరిత్రహీనుడు: తమ్మినేని
తెలుగుజాతి విచ్ఛిన్నానికి మద్దతివ్వటం ద్వారా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు చరిత్రహీనుడిగా మిగిలిపోనున్నారని ఆ పార్టీ నేత, మాజీ మంత్రి తమ్మినేని సీతారాం తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
సాక్షి, హైదరాబాద్: తెలుగుజాతి విచ్ఛిన్నానికి మద్దతివ్వటం ద్వారా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు చరిత్రహీనుడిగా మిగిలిపోనున్నారని ఆ పార్టీ నేత, మాజీ మంత్రి తమ్మినేని సీతారాం తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్ర విభజనకు మద్దతిచ్చి, టీడీపీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్న చంద్రబాబు నాయకత్వంలో తాను పనిచేయలేనన్నారు. అందుకే టీడీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఆదివారం తన రాజీనామాను ఫ్యాక్స్ ద్వారా టీడీపీ కార్యాలయానికి పంపించినట్లు చెప్పారు.
తాను ఇక సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొంటానని వెల్లడించారు. తమ్మినేని ఆదివారం హైదరాబాద్‌లో విలేకరుల సమావేశంలో తన రాజీనామాను పత్రాలను విడుదల చేశారు. ‘‘చంద్రబాబుకు అధికార దాహం, పదవీ లాలసత్వం తప్ప, రాష్ట్రాన్ని కాపాడాలన్న ఆలోచన ఏ కోశానా లేవు. గతంలో టీఆర్‌ఎస్‌తో పొత్తుపెట్టుకున్నది కూడా అధికారం కోసమే. కాంగ్రెస్ పార్టీ స్వార్థ రాజకీయాల్లో భాగంగా రాహుల్‌గాంధీకి పట్టం కట్టటం కోసం రాష్ట్రాన్ని విడదీస్తోంది. చంద్రబాబు తన కుమారుడు నారా లోకేష్‌ను మెదక్ లేదా రంగారెడ్డి జిల్లా నుంచి ఎంపీ స్థానానికి నిలబెట్టేందుకు విభజనకు మద్దతిస్తున్నారు. కొడుకు కోసం ఇంత నీచానికి దిగజారాలా?’’ అంటూ తమ్మినేని నిప్పులు కురిపించారు. విశ్వసనీయత కోల్పోయిన బాబు లక్ష పాదయాత్రలు, కోటి పొర్లుదండాలు చేసినా ప్రజలు నమ్మబోరని వ్యాఖ్యానించారు.
జగన్ వంటి సమర్థ నాయకత్వాన్ని రాష్ట్రం కోరుకుంటోంది
జనం నుంచి వచ్చిన నేత అయితే ప్రజల అభీష్టాన్ని స్పష్టంగా వివరించగలుగుతాడని, కాని సీల్డ్ కవర్‌లో ముఖ్యమంత్రి అయిన కిరణ్‌కు ప్రజల సమస్యలు ఏం తెలుస్తాయని ఎద్దేవా చేశారు. ఎన్‌టీఆర్ తరువాత వై.ఎస్.రాజశేఖరరెడ్డి ప్రజల నుంచి వచ్చిన నాయకుడని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రం మొత్తం వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి లాంటి ప్రజానాయకుడిని కోరుకుంటోందని చెప్పారు. జైల్లో ఉన్నా రాష్ట్ర ప్రజల సమస్యల కోసం జగన్ దీక్ష చేస్తున్నారని కొనియాడారు. ప్రపంచంలోనే తొలిసారిగా మన దేశంలో, మన రాష్ట్రంలో ఒక మహిళ 3,200 కిలోమీటర్లు పాదయాత్ర చేసి, రాష్ట్రం మొత్తం అన్ని స్థాయి ప్రజలతో కలిసి వారి సమస్యలను తెలుసుకున్నారంటూ.. జగన్ సోదరి షర్మిల పాదయాత్ర గురించి చెప్పారు.
‘‘ఆమెకు ప్రజలు కూడా బ్రహ్మరథం పట్టారని, అదే చంద్రబాబు పాదయాత్రను ఎవరైనా నమ్మారా?’’ అని వ్యాఖ్యానించారు. వై.ఎస్.విజయమ్మ సైతం ప్రజల పక్షాన దీక్ష చేయటం అభినందనీయమన్నారు. తెలుగు భాషకు ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అనే పేరు ఉందని.. కానీ తెలుగు జాతిని ఇటాలియన్ మహిళ వచ్చి రోస్ట్ చేస్తోందని తమ్మినేని విమర్శించారు. దేశానికి ఇట లీ మహిళ శాపం ఉందేమోనని వ్యాఖ్యానించారు. విభజనపై రాష్ట్ర శాసనసభలో తీర్మానం అవసరం లేదని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్‌సింగ్ చెప్తున్నారని.. రాష్ట్ర ప్రజల ఆమోదం లేకుండా రాష్ట్రాన్ని ఎలా విభజిస్తారని ప్రశ్నించారు. వైఎస్సార్ కాంగ్రెస్ నుంచి తనకు ఆహ్వానం వచ్చిన తర్వాత.. ఆ పార్టీలో చేరటంపై నిర్ణయం తీసుకుంటానని చెప్పారు.


