కళాశాలపై నిర్లక్ష్యం నీడ..

TDP Government Negligence in Government College - Sakshi

మౌలిక వసతులు కరువు

అధ్యాపకుల జీతాల మంజూరులో జాప్యం

ఆందోళనలో విద్యార్థులు

అధికారులు, పాలకుల నిర్లక్ష్యంతో పల్లె ప్రజలు ఉన్నత విద్యకు దూరమవుతున్నారు. అరకొర విద్యనందిస్తున్న ప్రభుత్వ సంస్థలను పట్టించుకోవడం లేదు. జూనియర్‌ కళాశాల ఉన్నా వసతులు లేక విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. డిగ్రీ కళాశాలగా మార్పు చేయాలని కోరుతున్నా పట్టించుకునే నాథుడే లేకుండా పోయారు.

కృష్ణాజిల్లా, కలిదిండి(కైకలూరు): స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో 160 మంది విద్యార్థులు చదువుతున్నారు. 4 తరగతి గదులు మాత్రమే ఉన్నాయి. మరుగుదొడ్ల సౌకర్యం, సైకిల్‌ స్టాండ్, ప్రహరీ నిర్మాణం లేదు. దీంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు.

కోఆపరేటివ్‌ కళాశాల నుంచి..
కోఆపరేటివ్‌ జూనియర్‌ కళాశాలను నంబూరు వెంకటనరసింహరాజు 1989లో ప్రారంభించారు.  ఈప్రాంతంలో ప్రభుత్వ కళాశాల లేకపోవడంతో ప్రభుత్వ కళాశాలగా మార్పు చేయాలని ప్రజల నుంచి డిమాండ్‌ పెరిగింది.  దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రభుత్వ కళాశాలగా మార్పు చేస్తూ ఉత్తర్వులిచ్చారు. కోఆరేటివ్‌ కళాశాలకు చెందిన రూ.50 కోట్ల ఆస్తిని స్వాధీనం చేసుకున్నారు.

కాంట్రాక్టు పద్ధతిలోనే సిబ్బంది..
కళాశాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నప్పటికీ సిబ్బంది విషయంలో నిర్లక్ష్యం ప్రదర్శించారు. సిబ్బందిని శాశ్వత ఉద్యోగులుగా గుర్తించలేదు. 2011లో తాత్కాలిక ఉద్యోగులుగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కంగుతిన్న ఉద్యోగులు కోర్టుకు వెళ్లారు.

అనుకూలంగా తీర్పు వచ్చినా..
ఉద్యోగులు న్యాయం పోరాటం చేశారు. 2017లో ట్రిబ్యునల్‌ తీర్పు ఉద్యోగులకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ఆ తీర్పును ప్రస్తుత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. ‘సాక్షి’ కథనాలు ప్రచురించింది. జూనియర్‌ కళాశాల ఉద్యోగుల జీతాల సమస్యపై శాసన సభ్యుడు కామినేని శ్రీనివాస్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సంప్రదించి రూ.4.50 కోట్లు మంజూరుకు కృషి చేశారు. కేబినెట్‌ ఆమోదం అనంతరం పరిష్కారం కాబోతుందని గత డిసెంబరులో వార్తలు వచ్చాయి.

అదనపు గదులకు ప్రతిపాదనలు
స్థానిక జూనియర్‌ కళాశాలను ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకుని ఏడు సంవత్సరాలు తరువాత కూడా ఎటువంటి అభివృద్ధి పనులు చేపట్టలేదు. 2016–17లో అదనపు గదుల నిర్మాణానికి రూ.60 లక్షలు మంజూరయ్యాయని, వాటిని వినియోగించక పోవడంతో మళ్లీ 2017–18లో సర్వశిక్ష అభియాన్‌ ఏఈ ప్రేమ్‌చంద్‌ రూ.1.25 కోట్లకు ప్రతిపాదనలు పంపారు.

డిగ్రీ కోర్సులు మంజూరు చేయాలి
ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో డిగ్రీ కోర్సులు మంజూరు చేయాలి. ఇంటర్మీడియెట్‌ అనంతరం డిగ్రీ కోర్సులకు కైకలూరు, గుడివాడ, భీమవరం వంటి పట్టణాలకు వెళ్లాల్సి వస్తోంది. జూనియర్‌ కళాశాలలు కలిదిండి, కోరుకొల్లు ఏరియాల్లో మేనేజిమెంట్‌ ఆధీనంలో ప్రైవేటు బస్సులు ఏర్పాటు చేస్తే విద్యార్థుల సంఖ్య పెరుగుతుంది. బాల బాలికలకు భద్రత ఉంటుంది.    –యాళ్ల జీవరత్నం, వైద్య విభాగం మండల కన్వీనర్‌ వైఎస్సార్‌ సీపీ కలిదిండి

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top