ఎస్‌ఈసీపై తప్పుడు ప్రచారం

TDP False propaganda on SEC - Sakshi

టీడీపీ అనుకూల సోషల్‌ మీడియా గ్రూపుల బరితెగింపు

మతం రంగు పులుముతూ తప్పుడు ఫొటోలను వైరల్‌ చేస్తున్న వైనం

సాక్షి, అమరావతి: రాష్ట్ర కొత్త ఎన్నికల కమిషనర్‌ జస్టిస్‌ వి.కనగరాజ్‌పై టీడీపీ తన అనుకూల సోషల్‌ మీడియా గ్రూపుల్లో నీచ రాజకీయాలకు పాల్పడుతూ తప్పుడు ప్రచారం మొదలుపెట్టింది. ఎస్సీ సామాజికవర్గానికి చెందిన రిటైర్డ్‌ జడ్జి కనగరాజ్‌కు మతం రంగు పులుముతూ తప్పుడు ఫోటోలను వైరల్‌ చేస్తోంది. ఓ చర్చి పాస్టర్‌ ఫొటోను.. ఎన్నికల కమిషనర్‌ కనగరాజ్‌ ఫొటోగా పేర్కొంటూ దుష్ప్రచారానికి దిగింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నియమితులైంది జస్టిస్‌ వి.కనగరాజ్‌ అయితే ఆయన స్థానంలో క్రిస్టియన్‌ పాస్టర్‌ జె.కనకరాజ్‌ అనే వ్యక్తిని చూపించి మతం పేరుతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ గౌరవాన్ని దెబ్బతీసేలా ప్రవర్తిస్తోంది. గత రెండు రోజులుగా టీడీపీ అనుకూల సోషల్‌ మీడియా గ్రూపుల ద్వారా ఈ తప్పుడు ప్రచారం యథేచ్ఛగా కొనసాగుతుండటం గమనార్హం.

తెలుగుదేశం పార్టీ కీలక నేతల ఆధ్వర్యంలోనే..
టీడీపీ కీలక నేతల ఆధ్వర్యంలోనే ఈ దుష్ప్రచారం కొనసాగుతోందని తెలుస్తోంది. మతం పేరుతో జరుగుతున్న ఈ తప్పుడు ప్రచారంపై పోలీస్‌ శాఖ ప్రత్యేక దృష్టి సారించినట్టు సమాచారం. 

ఆదివారమూ విధులకు హాజరైన కనగరాజ్‌
రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా శనివారం బాధ్యతలు చేపట్టిన జస్టిస్‌ కనగరాజ్‌ ఆదివారం కూడా విధులకు హాజరయ్యారు. ఉదయం కార్యాలయానికి వచ్చిన ఆయన తన ఛాంబర్‌కే పరిమితమయ్యారు. సోమవారం కార్యాలయ అధికారులు, అన్ని స్థాయిల ఉద్యోగులతో కమిషనర్‌ సమావేశమవుతారని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ కార్యాలయ వర్గాలు తెలిపాయి. లాక్‌డౌన్‌ కారణంగా మార్చి 23వ తేదీ నుంచి కార్యాలయ అధికారులు, ఉద్యోగులలో ఎక్కువ మంది ఇంటి నుంచి పనిచేస్తున్నారు. ఇలాంటి వారందరూ సోమవారం కార్యాలయంలో తమ విధులకు హాజరుకానున్నారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top