పచ్చ నేతల దాష్టీకం

TDP Activists Have Been Attacked by YSRCP Activists For a Plan - Sakshi

సాక్షి, ద్వారకాతిరుమల : కుల అహంకారంతో కొందరు టీడీపీ నేతలు పేట్రేగిపోతున్నారు. ఓ పక్క వారికి ఓటమి భయం వెంటాడుతుండగా మరో పక్క వైఎస్సార్‌ సీపీకి పెరుగుతున్న ప్రజాదరణ వారికి కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. దీంతో తమకు అడ్డొచ్చిన ప్రతి ఒక్కరిపై టీడీపీ కార్యకర్తలు ఒక పథకం ప్రకారం దాడులకు దిగుతున్నారు. దళితుల ఓట్లు ఎలాగో తమకు పడవని తెలుసుకున్న టీడీపీ నేతలు వారిని నోటికొచ్చినట్లు దూషిస్తున్నారు. గ్రామాల్లో కుల చిచ్చు పెడుతున్నారు. ఎలాగైనా గెలవాలన్న ఉద్దేశంతో వీధి రౌడీల్లా ప్రవర్తిస్తున్నారు. ద్వారకాతిరుమల మండలం ఎం.నాగులపల్లిలో బుధవారం రాత్రి జరిగిన ఘటన ఇందుకు దర్పణంగా నిలుస్తోంది. 
 

ప్రజాదరణ చూసి ఓర్వలేక తలారి కారు ధ్వంసం
టీడీపీకి కంచుకోటగా ఉన్న గోపాలపురం నియోజకవర్గానికి బీటలు వారాయి. వైఎస్సార్‌ సీపీ ఫ్యాన్‌ గాలి ఇక్కడ విపరీతంగా వీస్తోంది. ఎన్నికల ప్రచారం నిమిత్తం గ్రామాల్లోకి వెళుతున్న వైఎస్సార్‌ సీపీ అభ్యర్థి తలారి వెంకట్రావుకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ క్రమంలోనే టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ముప్పిడి వెంకటేశ్వరరావును ప్రజలు అడుగడుగునా నిలదీస్తున్నారు. ఇదిలా ఉంటే నిన్న మొన్నటి వరకు టీడీపీలో కీలకంగా ఉన్న నేతలు సైతం వైఎస్సార్‌ సీపీలో చేరుతున్నారు.

ఇవన్నీ చూస్తూ సహించలేని ఒక సామాజిక వర్గానికి చెందిన టీడీపీ నేతలు ఎం.నాగులపల్లిలో తలారి ప్రచారాన్ని అడ్డుకున్నారు. న్యూస్‌ కవరేజ్‌ కోసం అక్కడకొచ్చిన ‘సాక్షి’ దినపత్రిక, మీడియా విలేకరులపై దౌర్జన్యం చేశారు. తలారి కారును ధ్వంసం చేశారు. ఇదంతా ఒక పథకం ప్రకారం జరిగినట్టు స్పష్టంగా కనిపిస్తోంది. ఎం.నాగులపల్లి, మారంపల్లి, సూర్యచంద్రరావు పేట, తిరుమలంపాలెం, పంగిడిగూడెం, తిమ్మాపురం, భీమడోలు తదితర పంచాయతీలకు చెందిన చంద్రబాబు సామాజికవర్గ పచ్చ నేతలు ఈ దాష్టికంలో పాల్గొన్నారు. సభ్యత, సంస్కారాలను మరచి తలారిని నోటికి రాని బూతులు తిడుతూ రోడ్డుపై రెచ్చిపోయారు. మా గ్రామానికి రావద్దంటూ వైఎస్సార్‌ సీపీ నేతలను బెదిరించారు. చివరకు పోలీస్‌ ఉన్నతాధికారుల చొరవతో వివాదం సద్దుమణిగింది. 
 

గత చరిత్ర హీనం
ఎం.నాగులపల్లిలో టీడీపీ కార్యకర్తలు రెచ్చిపోవడం కొత్తేమి కాదని పలువురు అంటున్నారు. 2006 ఆగస్టు నెలలో జరిగిన పంచాయతీ ఎన్నికల ఓట్లు లెక్కింపు సమయంలో కొందరు టీడీపీ నేతలు విధ్వంసాలను సృష్టించారు. ఆ సమయంలో అక్కడున్న పోలీసులను కొట్టడంతో పాటు, ఒక ఎన్నికల అధికారి కారును తిరగబెట్టి, నిప్పంటించే ప్రయత్నం చేశారు. ఈ ఘటనకు సంబంధించి అప్పట్లో పోలీసులు 40 మంది టీడీపీ నాయకులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

అయితే కొద్ది రోజుల తరువాత కొన్ని సెక్షన్‌లను తొలగించి, ఆ కేసును దొమ్మీ కేసుగా మార్చినట్టు చెబుతున్నారు. ఇప్పటికీ ఆ 40 మందిపై బైండోవర్‌ కేసులున్నట్టు తెలుస్తోంది. అలాగే ఇందిలోని కొందరు నేతలు నాలుగేళ్ల క్రితం గుళ్లపాడు గ్రామంలో, ఎస్సీలపై కోళ్ల దొంగతనం మోపీ వారిని తల్లకిందులుగా వేలాడదీసి కొట్టారు. దీనిపై నమోదైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు ఇప్పటికీ కోర్టులో నడుస్తోంది. ఇలాంటి నేతలు తలారిపై విషం కక్కడం టీడీపీ పరువును మరింత దిగజార్చింది. 

ఎమ్మెల్యే ముప్పిడికి చుక్కెదురు
గోపాలపురం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ముప్పిడి వెంకటేశ్వరరావు, ఎంపీపీ వడ్లపూడి ఈశ్వర భానువరప్రసాద్, ఎం.నాగులపల్లికి చెందిన పలువురు నేతలతో కలిసి ప్రచారం నిమిత్తం గురువారం మత్తేవారిగూడెంకు వెళ్లారు. అయితే అక్కడ ఎస్సీలు వారిని అడ్డుకున్నారు. ఎం.నాగులపల్లిలో దళితులను అవమానించినందుకు ముందు క్షమాపణ చెప్పాలంటూ వారిని నిలదీశారు. దీంతో టీడీపీ నేతలకు, ఎస్సీలకు మధ్య ఘర్షణ జరిగింది. ఆ సమయంలో పోలీసుల ఇరువర్గాలను బుజ్జగించారు. దీంతో టీడీపీ నేతలు తమ ప్రచారాన్ని విరమించుకుని అక్కడి నుంచి వెనుతిరిగారు.

ఎన్నికలు ప్రశాంతంగా జరగనివ్వరు 
టీడీపీ నాయకులు వైఎస్సార్‌ సీపీ నేతలను ఎన్నికల ప్రచారం కూడా చేసుకోనివ్వడం లేదు. వారు ప్రవర్తిస్తున్న తీరు సభ్యసమాజం తలదించుకునేలా ఉంది. దళిత ఎమ్మెల్యే అభ్యర్థి అని కూడా చూడకుండా, తలారిని వైఎస్సార్‌ సీపీ నేతలను నిర్భందించి నోటికొచ్చినట్లు దూషించారు. ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే టీడీపీ నేతలు పోలింగ్‌ను ప్రశాంతంగా జరగనిస్తారన్న నమ్మకం మాకు లేదు. 2014లో ఇదే మండలంలోని మారంపల్లిలో టీడీపీ నేతలు వైఎస్సార్‌ సీపీ నేతలపై గొడవకు దిగారు. ఈసారి పారా మిలటరీ సిబ్బందిని, ప్రత్యేక బలగాలను పోలింగ్‌ కేంద్రాల వద్ద ఏర్పాటు చేసి, ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చూడాలి. లేకపోతే పచ్చ నేతలు రెగ్గింగులు చేయడానికి కూడా వెనుకాడరు. 
– పిల్లంగోళ్ల శ్రీలక్ష్మి, వైఎస్సార్‌ సీపీ గోపాలపురం నియోజకవర్గ ఎన్నికల పరిశీలకురాలు

బెదిరింపులకు భయపడేది లేదు
టీడీపీ వారు నన్ను బెదిరించాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా వాటిని స్వాగతిస్తానే గానీ భయపడను. అడుగడుగునా వైఎస్సార్‌ సీపీకి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ క్రమంలోనే టీడీపీపై తిరగబడుతున్నారు. దీన్ని చూసి సహించలేని తెలుగు తమ్ముళ్లు నన్ను అవమానించాలని, నాపై బురదచిమ్మాలని ప్రయత్నం చేస్తున్నారు. అయినా వారు నన్నేమీ చేయలేరు. ఎం.నాగులపల్లిలో టీడీపీ నేతలు చేసిన గొడవ ఆ పార్టీ పరువు ప్రతిష్టలను మరింత బజారుకీడ్చింది. వైఎస్సార్‌ సీపీ శ్రేణులు టీడీపీ ప్రచారాలను ఎక్కడా అడ్డుకోవద్దు. ఎందుకంటే ప్రజలే వారికి బుద్ధి చెబుతారు. 
– తలారి వెంకట్రావు, వైఎస్సార్‌ సీపీ గోపాలపురం నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top