
భద్రత పూజ్యం... ఇష్టారాజ్యం...
సెల్‌ఫోన్‌ల వినియోగం పెరిగిపోవడంతో సెల్ కంపెనీలు టవర్ నిర్మాణాలను కూడా అదే స్థాయిలో పెంచేశాయి.
సాక్షి, గుంటూరు: సెల్‌ఫోన్‌ల వినియోగం పెరిగిపోవడంతో సెల్ కంపెనీలు టవర్ నిర్మాణాలను కూడా అదే స్థాయిలో పెంచేశాయి. అయితే నిబంధనల ప్రకారం సెల్‌టవర్‌లను ఏర్పాటు చేయకుండా ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినవస్తున్నాయి. సెల్ టవర్‌ల వద్దకు ఎవరూ వెళ్లకుండా చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసి, సెక్యూరిటీ సిబ్బందిని నియమించాల్సి ఉంది. పెద్ద కంపెనీలకు చెందిన సెల్ టవర్ల వద్ద సైతం భద్రతా చర్యలు తీసుకోకపోవడంతో ఆకతాయిలు చీటికీమాటికీ సెల్ టవర్‌లు ఎక్కి ఆత్మహత్య చేసుకుంటామంటూ హల్‌చల్ చేస్తున్నారు.
తమకున్న సమస్యలతో ఏదో ఒక రాష్ట్ర సమస్యకు ముడిపెట్టి అటు కుటుంబ సభ్యులను, ఇటు అధికార యంత్రాగాన్ని ఉలికిపాటుకు గురిచేస్తున్నారు. పిల్లికి చెలగాటం... ఎలుకకు ప్రాణసంకటం అన్నట్టు వారు ఆందోళన విరమించి కిందకు దిగే వరకూ పోలీసులు నిద్రాహారాలు మాని సెల్ టవర్ కింద పడిగాపులు కాయాల్సిన పరిస్థితి దాపురిస్తోది. ఇలాంటి సందర్భాల్లో సెల్ టవర్ ఎక్కిన వారిని రక్షించేందుకు కావాల్సిన ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు గానీ, అగ్నిమాపక శాఖ అధికారులు గానీ పట్టించుకోకపోవడంతో ఒత్తిడి మొత్తం పోలీస్‌శాఖపై పడుతోంది. ఇక భద్రత లేకుండా సెల్ టవర్ నిర్మించిన కంపెనీ అధికారులు తమకేమీ పట్టనట్లు కనీసం అటువైపు తిరిగి చూడకపోవడం దారుణమైన విషయం.
సెల్ టవర్ల రేడియేషన్‌పై ఆందోళన
సెల్‌టవర్లను వివిధ కంపెనీల వారు నివాస ప్రాంతాల్లో నిర్మించడం వలన రేడియేషన్ ప్రభావంతో పరిసర ప్రాంతాల్లో నివసించే ప్రజలకు తీవ్ర ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని ప్రజల్లో అనుమానాలు ఉన్నాయి. సెల్ టవర్ నిర్వాహకులు వీటిపై ప్రజలకు అవగాహన కల్పించకుండా తమకు హైకోర్టు అనుమతి ఉందంటూ పోలీస్ అధికారులపై ఒత్తిడి తెచ్చి బందోబస్తుతో నిర్మాణాలు చేస్తున్నారు. సెల్ టవర్ నిర్మాణాన్ని అడ్డుకునేందుకు వచ్చిన స్థానికులపై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు.
సెల్ టవర్ల వద్ద భద్రతా చర్యలు చేపట్టండి
సెల్ టవర్ల వద్ద నిబంధనలకు అనుగుణంగా ఫెన్సింగ్, భద్రతా సిబ్బందిని నియమించి సెల్ టవర్ ఎక్కేందుకు వీలు లేకుండా చర్యలు తీసుకోవాలని సెల్ టవర్ నిర్వాహకులకు అర్బన్ ఎస్పీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఆదేశాలు జారీ చేశారు. అలా చెయ్యని సెల్ టవర్ల వద్ద ఎటువంటి ఆందోళనలు జరిగినా సెల్‌టవర్ నిర్వాహకులపై సుమోటోగా కేసులు నమోదు చేసేందుకు సైతం వెనకాడమని హెచ్చరించారు.
-అర్బన్ ఎస్పీ సర్వశ్రేష్ట త్రిపాఠి