దేశంలో ప్రభుత్వ ఆస్పత్రుల పనితీరు ఎంతో మెరుగుపడాల్సి ఉందని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు.
వెంకటాచలం (నెల్లూరు) : దేశంలో ప్రభుత్వ ఆస్పత్రుల పనితీరు ఎంతో మెరుగుపడాల్సి ఉందని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. ఓ ప్రభుత్వ ఆస్పత్రిలో ఎలుకలు కొరకడం వల్ల శిశువు మృతి చెందడం బాధాకరమని వ్యాఖ్యానించారు. ఆదివారం నెల్లూరు జిల్లా వెంకటాచలంలో స్వర్ణ భారతి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని వెంకయ్యనాయుడు ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... దేశంలో వైద్యం వెనుకబడి ఉందన్నారు. ఆస్పత్రుల అభివృద్ధికి ప్రభుత్వాలు ముందుకు రావాలని కోరారు. కింది నుంచి పై స్థాయి వరకూ సమూలంగా మార్చాల్సి ఉందన్నారు. దేశంలో వైద్యుల కొరతను తీర్చేందుకు వైద్య కళాశాలల ఏర్పాటు నిబంధనలను సడలించినట్టు చెప్పారు. ముఖ్యంగా రైతుల ఆత్మహత్యలకు వైద్యం, విద్యా ఖర్చులు పెరిగిపోవడం కూడా ఒక కారణంగా పేర్కొన్నారు.