అక్షరాల... టైమ్‌ ట్రావెల్‌!

vaaavailala sahitya vikasam book release - Sakshi

ఒక జాతి, ఒక భాష, ఒక సంస్కృతి... చిరంతనంగా నిలవాలంటే సాహిత్యం సుసంపన్నంగా వెలగాలి. ముద్రణ లేని రోజుల్లో మౌఖికం, తాళపత్ర బంధితంగానే మిగిలిన అపార మైన, అపురూప సాహిత్యాన్ని ఆ తర్వాత పుస్తక రూపంలో అందరికీ దగ్గర చేసి, అక్షరాస్యతా ఉద్యమంలో భాగమైన పుణ్యమూర్తులైన ప్రచురణకర్తలు ఎందరెందరో! ఆధ్యాత్మిక సాహిత్యానికి సంబంధించి ఇవాళ వందేళ్ళ గోరఖ్‌పూర్‌ గీతాప్రెస్‌ గురించి ఎంతో వింటుంటాం, చూస్తుంటాం.

కానీ, అంత కన్నా కొన్ని దశాబ్దాల ముందే ఒక తెలుగు ప్రచురణ సంస్థ అంతకు మించిన భాషా, సాహిత్య, సాంస్కృతిక, ఆధ్యాత్మిక సేవ చేసిందని ఈ తరంలో ఎంత మందికి తెలుసు? తెలుగు ప్రచురణల ద్వారా అక్షర యాగం చేసి, మన జాతి సాహితీ సంస్కృతులకు ఎనలేని సేవ చేసినసంస్థ – వావిళ్ళ సంస్థ. ఇప్పటికి దాదాపు 170 ఏళ్ళ క్రితం... 1854లోనే పుస్తక ప్రచురణ రంగంలో ప్రవేశించి, అఖండ విజయం సాధించిన మహనీయులు వావిళ్ళ వారు. పురాణాలు, ప్రబంధాలు, స్తోత్రాలు, వేదాంత శాస్త్రాలు, శతకాలు, వ్రతకల్పాలు, వ్యాకరణాలు, నిఘంటువులు... ఇలా వారు  ప్రచురించనిది లేదు.

అనేక తాళపత్ర గ్రంథా లనూ, చేతిరాతలనూ, ప్రాచీన కావ్యాలనూ  పండితులతో పరిష్కరింపజేసి, సవివరమైన పీఠికలతో సప్రామాణికంగా అందించిన ప్రచురణకర్తలు, కవిపండిత పోషకులు, దేశభక్తులు వారు.  సంస్థాపకులు వావిళ్ళ రామస్వామి శాస్త్రి సంస్కృతాంధ్ర భాషా సాహిత్యాలకు చేసిన సేవ అనుపమానం. ఆరు పదులైనా నిండక ముందే ఆయన పరమపదిస్తే, అనంతరం ఆయన కుమారుడు వావిళ్ళ వేంకటేశ్వర శాస్త్రులు ఆ కృషిని కొనసాగించారు. తండ్రి నాటిన మొక్కను మహావృక్షంగా పెంచారు. తెలుగుకే కాదు... సంస్కృత, తమిళ, కన్నడ భాషా రచనల్ని కూడా ప్రచురించి, ఆ సాహిత్యాలకు విశేష సేవలందించారు. తెలుగులో ‘త్రిలిఙ్గ’, ఇంగ్లీషులో ‘ఫెడరేటెడ్‌ ఇండియా’, తమిళంలో మహాకవి సుబ్రహ్మణ్య భారతి సహ కారంతో ‘బాల వినోదిని’ మాసపత్రిక... ఇలా పలు పత్రి కలూ నడిపారు.

ఇవాళ్టికీ వావిళ్ళ వారి ప్రచురణ అంటే ప్రామాణికతకూ, సాధికారికతకూ, సాహితీ విలువలకూ ఐఎస్‌ఐ మార్క్‌. ముద్రణ దశలోని ప్రూఫ్‌ గ్యాలీలను తమ ప్రెస్‌ బయట అంటించి, ప్రచురిస్తున్న పుస్తకంలో అక్షర దోషం పట్టుకుంటే తప్పుకు ఇంత చొప్పున డబ్బులిస్తామని వావిళ్ళ వారు ధైర్యంగా ప్రకటించేవారని పాత తరంవారు చెప్పేవారు. అందుకే, ప్రస్తుతం పలు సంస్థలు చలామణీలోకి తెస్తున్న అనేక పాత పుస్తకాల కొత్త ప్రింట్లు వావిళ్ళ ప్రతులకు సింపుల్‌ జిరాక్స్‌ కాపీలే! ఈ తరం పాఠకులకు వావిళ్ళ సంస్థ కృషిని పరిచయం చేయాల్సిన పరిస్థితుల్లో, అదే లక్ష్యంగా వచ్చిన పుస్తకం–‘వావిళ్ళ సాహితీ వికాసం.’  సాంకేతిక విద్యానైపుణ్యం పుష్కలంగా ఉండి, కేంద్ర ప్రభుత్వ అధికారిగా సేవలందించి పదవీ విరమణ చేసిన డాక్టర్‌ వి.వి. వేంకటరమణ ఈ పుస్తక రచయిత.

కంప్యూటర్‌ విజ్ఞానం నుంచి కావ్యకంఠ వాశిష్ఠ గణపతిముని రచనల దాకా వివిధ అంశాలపై ఇప్పటికే 15 ప్రామా ణిక రచనలు చేసిన నిరంతర జిజ్ఞాసి. ఆయన పుష్కర కాలం శ్రమించి, పరిశోధించి మరీ చేసిన రచన ఇది. దాదాపు 700 పేజీల పుస్తకంలో ఎన్నో తెలియని విషయాలనూ, ఇంతకు ముందెన్నడూ చూడని చిత్రాలనూ అందించారు. వెయ్యికి పైగా వావిళ్ళ ప్రచురణల్ని పట్టికలు, తేదీలతో సహా పాఠక లోకం ముందుంచారు. ప్రపంచంలో ముద్రణారంభం, బ్రిటీషు కాలంలో మన దేశంలో ముద్రణ, మద్రాసులో ముద్రణ తొలినాళ్ళు, పుదూరు ద్రావిడులైన వావిళ్ళవారు ముద్రణా రంగం లోకొచ్చిన తీరు, వారు నడిపిన పత్రికలు, చేసిన సాహిత్య సేవ, అప్పట్లో జరిగిన వాదవివాదాలు, వావిళ్ళపై వచ్చిన ప్రత్యేక సంపుటాల విశేషాలు... ఇలా ఈ పుస్తకం ఓ సమా చార గని.

‘కన్యాశుల్కం’ రచన గురజాడదా? గోమఠం శ్రీని వాసాచార్యులదా? అంటూ అప్పట్లో వావిళ్ళ చుట్టూ నడిచిన వివాదం ఆసక్తిగా చదివిస్తుంది. తండ్రి ఆరంభించిన ‘ఆది సరస్వతీ నిలయం’ నుంచి కుమారుడు నడిపిన వావిళ్ళ ప్రెస్‌ దాకా, ఆ తర్వాత జరిగిన చరిత్రకు అద్దం ఈ రచన. అలా ఇది వావిళ్ళ వారు చేసిన బృహత్తర యజ్ఞంపై ఓ అరుదైన లో చూపు. బోలెడుశ్రమతో ఈ రచనలో పునర్ముద్రించిన వావిళ్ళ వారి ప్రచురణల ముఖచిత్రాలు, ఫోటోలు, వార్తల్ని చూస్తూ పేజీలు తిప్పినా ఇది అక్షరాలా 170 ఏళ్ళ టైమ్‌ ట్రావెల్‌!
– రెంటాల జయదేవ(నేడు నెల్లూరులో ‘వావిళ్ళ సాహితీ వికాసం’ ఆవిష్కరణ) 

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top