చిన్న సినిమా చేసిన పెద్ద మ్యాజిక్‌... ‘పెళ్ళి సందడి’ | ‘Pelli Sandadi’: The musical blockbuster that rewrote Telugu box-office history | Sakshi
Sakshi News home page

చిన్న సినిమా చేసిన పెద్ద మ్యాజిక్‌... ‘పెళ్ళి సందడి’

Feb 1 2026 8:09 AM | Updated on Feb 1 2026 8:09 AM

‘Pelli Sandadi’: The musical blockbuster that rewrote Telugu box-office history

చిన్న పాత్రలతో పేరు తెచ్చుకున్న ఓ నటుడు సినిమాలో హీరో. ఆయన కథానాయకుడిగా చేస్తున్న ప్రయత్నాల్లో అక్షరాలా అది రెండో సినిమానే! ఉత్తరాది నుంచి ఒక హీరోయిన్‌కు తెలుగులో అదే తొలి సినిమా. మరో హీరోయినేమో అప్పడప్పుడే పైకొస్తున్న వర్ధమాన నటి. ఈ కాంబినేషన్‌లో ఓ టాప్‌ మోస్ట్‌ డైరెక్టర్‌ సినిమా చేస్తే? ఆ డైరెక్టర్‌తో సినిమా చేసేందుకు అగ్రతారలు ఉవ్విళ్ళూరే సమయంలో... అలాంటి చిరు ప్రయోగానికి ముగ్గురు అగ్ర నిర్మాతలు సిద్ధపడితే..? అదే... శ్రీకాంత్, దీప్తీ భట్నాగర్, రవళి తారాగణంగా దర్శకుడు కె. రాఘవేంద్రరావు రూపొందించిన ఆనాటి ‘‘తెలుగు ఫిల్మ్‌ ఇండస్ట్రీ బాక్సాఫీస్‌ రికార్డ్‌’’ అయిన ‘పెళ్ళి సందడి’ చిత్రం. 1996 జనవరి 12న రిలీజైన ఆ ఆల్‌టైమ్‌ మ్యూజికల్‌ హిట్‌కు 30 వసంతాలు దాటినా... జనం మర్చిపోలేదు. ‘కాఫీలు తాగారా? టిఫినీలు చేశారా?’ అన్న అందులోని విచిత్ర సంభాషణను ప్రజల భాష నేటికీ వదులుకోలేదు. 

ఒక చిన్న పంతం... ఓ పెద్ద ఇండస్ట్రీ హిట్‌ సినిమాకు దారి తీసిందంటే నమ్ముతారా? అవును... మూడు దశాబ్దాల క్రితం తెలుగు సినీ పరిశ్రమను వసూళ్ళ వర్షంతో తడిసి ముద్ద చేసిన ‘పెళ్ళిసందడి’ (1996) అక్షరాలా అలానే పుట్టింది.

మాటల యుద్ధంలో పుట్టిన కుటుంబ కథ
దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు అంటే... అప్పట్లో టాప్‌ స్టార్లతో, భారీ చిత్రాలతో బ్రహ్మాండ విజయాల సృష్టికర్త. ఆయన పేరు చెప్పగానే సాధారణంగా అందరికీ అవే గుర్తొస్తాయి. ‘టాప్‌ హీరోలు లేకుండా మీరు సినిమాలు తీయలేరండీ’ అని నిర్మాత అల్లు అరవింద్‌ ఒకరోజు ఏదో చర్చల్లో... కాస్తంత ఉడికిస్తున్నట్టుగా రాఘవేంద్రరావుతో అన్నారు. అంతే... కెరీర్‌ ఆరంభంలోనే ‘జ్యోతి’ (1976) లాంటి చిన్న చిత్రాలతో సాహసం చేసి, హిట్లందుకున్న దర్శకేంద్రుడికి సహజంగానే కోపం వచ్చింది. ‘మీ నిర్మాతలందరూ అగ్రహీరోల డేట్ల కోసం వెంటపడుతున్నారు కాబట్టే, ఈ పరిస్థితి. నిర్మాతలు ముందుకొస్తే చిన్న హీరోతో, మంచి కథతో సినిమా తీసేందుకు నేను రెడీ’ అన్నది రాఘవేంద్రుడి జవాబు. ‘మంచి కథ చెబితే మేమూ రెడీ’ అన్నది అరవింద్‌ సవాలు. ‘రెండు రోజుల్లో రండి. కథ చెబుతా’ అని దర్శకేంద్రుడు ఛాలెంజ్‌ స్వీకరించారు.

అప్పటికే రాఘవేంద్రరావు మనసులో ఓ ఆలోచన మెదులుతోంది. అంతకు ఏడాది క్రితం రిలీజైన హిందీ చిత్రం ‘హమ్‌ ఆప్కే హై కౌన్‌’(1994) దేశమంతటినీ ఊపేసింది. కుటుంబకథా నేపథ్యంలో అలాంటి మాంచి మ్యూజికల్‌ లవ్‌స్టోరీని తెలుగులో తీస్తే? అంతకు ముందే ‘అల్లరి ప్రియుడు’ (1993)ను పాపులర్‌ పాటలతో, సిల్వర్‌ జూబ్లీ హిట్‌ చేసిన ఘనత ఆయనది. ఈసారి సినిమా ఉండాల్సింది... అంతకు మించి! అదే శ్వాస, అదే ధ్యాస!! రచయిత సత్యానంద్‌ను పిలిచారు. శ్రీధర్‌ దర్శకత్వంలో వచ్చిన బ్లాక్‌ అండ్‌ వైట్‌ కాలపు అక్కినేని ‘పెళ్ళి కానుక’ (1960 – తమిళ ‘కల్యాణ పరిసు’కు రీమేక్‌) ఫక్కీలో అక్కాచెల్లెళ్ళ సెంటిమెంటల్‌ ప్రేమకథ ఎప్పుడూ మంచి పేయింగ్‌ ఎలిమెంట్‌ అని సత్యానంద్‌ ప్రగాఢ నమ్మకం. అదే స్ఫూర్తితో అంతకు ముందు రాఘవేంద్రరావు దర్శకత్వంలోనే డి. రామానాయుడు నిర్మించిన శోభన్‌బాబు ‘దేవత’ (1982) లాంటి కొన్ని చిత్రాలు వచ్చాయి. ‘దేవత’కు సత్యానందే మాటల రచయిత. అయినా, ఇంకా ఏదో అసంతృప్తి. దాన్ని తీర్చేలా... ఈసారి మరింత పక్కాగా కుటుంబ నేపథ్యం, అక్కాచెల్లెళ్ళ సెంటిమెంట్, ప్రేమ – త్యాగం నిండిన మంచి మ్యూజికల్‌ ముక్కోణపు ప్రేమకథ సిద్ధమైపోయింది. కథ విని, అరవింద్‌ ఎగిరి గంతేశారు. ఆ కథే... ఆ తరువాత తెరకెక్కిన ‘పెళ్ళి సందడి’.

అగ్రశ్రేణి పంపిణీదారులే... నిర్మాతలుగా!
‘పెళ్ళిసందడి’ నిర్మాణం గమ్మత్తుగా జరిగింది. దర్శకుడు రాఘవేంద్రరావు ఒకటే షరతు పెట్టారు. ‘వీలైనంత తక్కువ ఖర్చులో సినిమా తీద్దాం. తీసిన సినిమాను వేరొకరి అమ్మేయకుండా, సొంతంగా రిలీజ్‌ చేయాలి. లాభమైనా, నష్టమైనా భరించాలి’ అన్నారు. అరవింద్‌ ఓకే అన్నారు. దాని ఫలితంగా... ‘పెళ్ళి సందడి’ ఒకరికి నలుగురు నిర్మాతల సమష్టి ప్రయత్నంగా రూపొందింది. దర్శకుడు రాఘవేంద్రరావును సైతం నిర్మాణ భాగస్వామిగా చేసుకొని, మూడు ప్రముఖ పంపిణీ సంస్థలు... ‘గీతా ఫిలిమ్‌ డిస్ట్రిబ్యూటర్స్‌’ (అల్లు అరవింద్‌), ‘వైజయంతీ ఎంటర్‌ప్రైజెస్‌’ (సి. అశ్వినీదత్‌), ‘లక్ష్మీ ఫిలిమ్స్‌’ (కె. జగదీశ్‌ ప్రసాద్‌) కలసి ‘శ్రీరాఘవేంద్ర మూవీ కార్పొరేషన్‌’ అనే కొత్త బ్యానర్‌పై నిర్మించారు. అసలు అల్లు అరవింద్, అశ్వినీదత్‌లు అప్పటికి పూర్తిగా క్రేజీ ప్రాజెక్టులే నిర్మిస్తున్నారు. జగదీశ్‌ప్రసాద్‌ యాజమాన్యంలో పంపిణీ సంస్థగా పేరున్న లక్ష్మీ ఫిలిమ్స్‌ అయితే అంతకు ముందు రాఘవేంద్రరావు – హీరో కృష్ణల కాంబినేషన్‌లో ‘వజ్రాయుధం’ (1985), దర్శకుడు కోదండరామిరెడ్డి – హీరో చిరంజీవితో ‘కిరాతకుడు’ (1986) లాంటి భారీ చిత్రాలే నిర్మించింది. అలాంటి ఆ ముగ్గురు బడా నిర్మాతలూ కలసి ‘పెళ్ళి సందడి’ లాంటి చిన్న ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రావడం విచిత్రమే!

నిజానికి, అంతకు అయిదేళ్ళ ముందు దర్శకుడు దాసరి నారాయణరావు ఇలాంటి చిరు ప్రయత్నమే చేశారు. అగ్ర నిర్మాతలు కె. దేవీవరప్రసాద్, టి. త్రివిక్రమరావు, అశ్వినీదత్‌లు ముగ్గురి సమష్టి నిర్మాణంలో, శారద ప్రధాన పాత్రధారిణిగా ‘అమ్మ రాజీనామా’ (1991 డిసెంబర్‌ 27) అనే చిన్న బడ్జెట్‌ లేడీ ఓరియంటెడ్‌ కుటుంబ కథాచిత్రాన్ని రూపొందించి, వార్తల్లో నిలిచారు. జీవితాంతం కుటుంబం కోసం కష్టపడే తల్లి... తన విలువను గుర్తించని ఆ కుటుంబసభ్యులతో వేసారి, తన బాధ్యతలు మానేస్తే ఏమవుతుందన్న పాయింట్‌ చుట్టూ అల్లుకున్న ఆ చిన్న సినిమా అప్పట్లో మధ్యతరగతి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. ఆ తర్వాత మళ్ళీ ఆ తరహాలో పెద్ద నిర్మాతలు చేసిన చిన్న బడ్జెట్‌ ప్రయత్నం... ఈ ‘పెళ్ళి సందడి’.

లక్షలు ఖర్చు పెడితే... కోట్లు వచ్చాయ్‌!
కేవలం కోటి రూపాయల పరిమిత బడ్జెట్‌లో తీయాలని టార్గెట్‌. రాఘవేంద్రరావు పారితోషికంగా రూ. 15 లక్షలు కూడా అందులోనే లెక్క. అయితే, అన్ని విధాలా సంతృప్తికరంగా సినిమాను పూర్తి చేసేసరికి అనుకున్నదాని కన్నా రూ. 5 లక్షలు ఎక్కువైంది. ఆ పెరిగిన కొద్దిపాటి వ్యయాన్ని తన పారితోషికపు మొత్తం నుంచి రాఘవేంద్రరావే భరించారు. మరో గమ్మత్తు జరిగింది. సెన్సార్‌ నిబంధనల ప్రకారం ఫీచర్‌ ఫిల్మ్‌ అంటే 11 వేల అడుగుల పైనే నిడివి ఉండాలి. ‘పెళ్ళి సందడి’ చిత్రీకరణ అంతా పూర్తయ్యాక సెన్సార్‌కు ముందు చూసుకుంటే, నిబంధనల కన్నా తక్కువ నిడివి ఉంది. దాంతో, రాఘవేంద్రరావు బృందం తెలివిగా అప్పటికప్పుడు వినోదాత్మకమైన కోడిపుంజు ఎపిసోడ్‌ సృష్టించి, నటులు ఏవీఎస్, శ్రీలక్ష్మి, బ్రహ్మానందం తదితరులపై చిత్రీకరించి, ఇంటర్వెల్‌ తర్వాత జత చేశారు.

ముందుగా అనుకున్నట్టే... సినిమాను అమ్ముకోకుండా, సొంతంగానే రిలీజ్‌ చేశారు. ఆంధ్రా, నైజామ్‌ లాంటి మిగతా ప్రధాన ఏరియాల్లో సొంతంగా రిలీజ్‌ చేసుకుంటూ, సీడెడ్‌ ఏరియాలో మాత్రం నిర్మాత – పంపిణీదారు వి. దొరస్వామిరాజు సంస్థ ‘వి.ఎం.సి’ ద్వారా విడుదల చేశారు. అలా నలుగురు నిర్మాతలుగా కలసి, సరదాగా చేసిన ఈ ప్రయోగాత్మక ప్రయత్నం గురించి మొదట్లో ఎవరికీ ఏమంత అంచనాలు లేవు. సినిమా రిలీజ్‌ కన్నా ముందే ఆడియో సూపర్‌హిట్‌తో సంచలనం మొదలైంది. చివరకు ఆ ఏటి సంక్రాంతి చిత్రాలన్నిటిలోకీ మేటిగా... ‘పెళ్ళి సందడి’ నిలిచింది. కోటి రూపాయల్లో తీసిన చిన్న సినిమా కనివిని ఎరుగని రీతిలో రూ. 14 – 15 కోట్ల షేర్‌ వసూలు చేసింది. కమిషన్లు పోగా, దాదాపు రూ. 10 కోట్ల లాభం వచ్చింది. వెరసి, కలెక్షన్లలో అప్పటికి తెలుగు ఫిల్మ్‌ ఇండస్ట్రీ ఆల్‌టైమ్‌ రికార్డ్‌ సృష్టించింది.

వసూళ్ళలో అసలు సిసలు ‘ఇండస్ట్రీ రికార్డ్‌’ చిత్రాలు ఇవీ..!
 ‘పెళ్ళి సందడి’ లాంటి ఒక చిన్న సినిమా అలా వసూళ్ళలో ‘ఇండస్ట్రీ రికార్డ్‌’ నెలకొల్పడం అదే ప్రప్రథమం. అంతకు మునుపటి ఇండస్ట్రీ రికార్డ్‌ సినిమాలన్నీ దాదాపు పెద్ద హీరోలు, పేరున్న హీరోయిన్లతో రూపొందినవే! బాక్సాఫీస్‌ చరిత్ర పూర్వాపరాలు గమనిస్తే... ఎన్టీఆర్‌ ముఖ్యమంత్రి అయ్యాక, 1984లో తెలుగునాట సినిమా టికెట్లపై వినోదపు పన్నులో మార్పులు తెచ్చి, అమ్ముడైన టికెట్లతో సంబంధం లేకుండా థియేటర్‌లోని సీటింగ్‌ కెపాసిటీ మొత్తానికీ పన్ను విధించే ‘శ్లాబ్‌ సిస్టమ్‌’ను ప్రవేశపెట్టారు. ఫలితంగా 1984 నాటి నాన్‌ ఏసీ థియేటర్లలో బాల్కనీ టికెట్‌ రేటు రూ. 2.60 నుంచి అమాంతం రూ. 4.50కి ఎగబాకింది. అలా పెరిగిన టికెట్‌ రేట్ల పుణ్యమా అని ఆ వెంటనే కృష్ణంరాజు ‘బొబ్బిలి బ్రహ్మన్న’ (1984 మే 25 రిలీజ్‌) కళ్ళు తిరిగే కలెక్షన్లు రాబట్టింది. వసూళ్ళలో ఆనాటి ‘ఇండస్ట్రీ రికార్డ్‌ సినిమా‘ అయింది. ఆ వెనువెంటనే, ఎన్టీఆర్‌ ‘శ్రీమద్విరాట్‌ వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర’ (1984 నవంబర్‌ 29) కనివిని ఎరుగని ప్రేక్షకాదరణతో దిమ్మతిరిగేలా కలెక్షన్లు కొల్లగొట్టింది. అలా ఆ చిత్రం కొత్త ‘ఇండస్ట్రీ రికార్డ్‌’ అయింది. ఆ తర్వాత విజయశాంతి ‘ప్రతిఘటన’ (1985) దాన్ని దాటి, ఆ స్థానాన్ని అందుకుంది. అటు తర్వాత వెంకటేశ్‌ ‘చంటి’ (1992), దాన్ని దాటి ‘పెదరాయుడు’ (1995), దాన్ని కూడా అధిగమించి అటుపైన ‘పెళ్ళి సందడి’ (1996) తిరుగులేని బాక్సాఫీస్‌ ఇండస్ట్రీ రికార్డయ్యాయి.

‘పెళ్ళి సందడి’ ఇండస్ట్రీ రికార్డ్‌ను విజయశాంతి ‘ఒసేయ్‌ రాములమ్మా’ (1997), ఆ తర్వాత బాలకృష్ణ ‘సమరసింహారెడ్డి’ (1999), ఆ తర్వాత ‘నరసింహ నాయుడు’ (2001)... వరుసగా ఒకదానినొకటి వసూళ్ళలో అధిగమిస్తూ పోయాయి. ఇక, కొత్త మిలీనియమ్‌లోకి వచ్చాక వరుసగా చిరంజీవి ‘ఇంద్ర’ (2002), మహేశ్‌ బాబు ‘పోకిరి’ (2006), అటుపైన రామ్‌చరణ్‌ ‘మగధీర’ (2009 జూలై 31), ఆ తర్వాత త్రివిక్రమ్‌ – పవన్‌ కల్యాణ్‌ల ‘అత్తారింటికి దారేది’ (2013 సెప్టెంబర్‌ 27) వసూళ్ళలో మునుపటి చిత్రాన్ని దాటి, కలెక్షన్లలో ఇండస్ట్రీ రికార్డులయ్యాయి. ఆ తర్వాత రాజమౌళి ‘బాహుబలి–1’ (2015 జూలై 10), అటుపైన ‘బాహుబలి–2’ (2017) చిత్రాలు ఆల్‌టైమ్‌ ఇండస్ట్రీ రికార్డులయ్యాయి. విచిత్రంగా ఆ తర్వాత దాన్ని అధిగమించిన సినిమా ఏదీ రాలేదు. అలా ఇప్పటికి దాదాపు తొమ్మిదేళ్ళుగా తెలుగు సినిమాకు ఇండస్ట్రీ రికార్డ్‌ అక్కడే స్తంభించి పోయి ఉండడం గమనార్హం. 
    
అచ్చమైన తెలుగింటి అక్కాచెల్లెళ్ళ పెళ్ళికళ
‘పెళ్ళి సందడి’ పూర్తి సంగీతాత్మక, వినోదభరిత, సకుటుంబ చిత్రం. బొడ్డు పక్కన అందమైన పుట్టుమచ్చ, ఆ పక్కనే దోపుకున్న వెండి తాళాల గుత్తితో ఉన్న ఓ స్వప్నసుందరిని హీరో (శ్రీకాంత్‌) ప్రేమిస్తుంటాడు. ఊరు, పేరు, ముక్కూ ముఖం తెలియని ఆ అమ్మాయిని కలల్లో ప్రేమిస్తున్నా... అనుకోకుండా మరో అమ్మాయి (రవళి)తో పెళ్ళికి ఒప్పుకోవాల్సి వస్తుంది. తీరా తన స్వప్నసుందరి (దీప్తీ భట్నాగర్‌) నిజజీవితంలో ఎదురయ్యేసరికి, ఆమెతో ప్రేమముడి వేసుకొని, ఖరారైన పెళ్ళిని కాదనే దాకా వస్తాడు. అక్కను చేసుకోవాల్సిన వాడే తనను గాఢంగా ప్రేమిస్తున్న ప్రియుడని తెలిశాక ఆ స్వప్న సుందరి త్యాగానికి సిద్ధపడుతుంది. అక్క కోసం చెల్లెలు... చెల్లెలి కోసం అక్క... త్యాగాల పరిణామం మిగతా కథ. అక్క కల్యాణి పాత్రలో రవళి, చెల్లెలు స్వప్న పాత్రలో దీప్తీ భట్నాగర్‌ నటించిన ఈ సినిమా నిండా కమెడియన్లు, క్యారెక్టర్‌ ఆర్టిస్టులే. గోదావరి జిల్లా తాలూకు గౌరవాలు, పెళ్ళి వారింటి సరదాలు, సరసాలు, మర్యాదలు, కుటుంబ ఆప్యాయతలతో ప్రతి సీనూ అచ్చమైన వివాహ భోజనమే! సినిమాటోగ్రాఫర్‌ వి. జయరామ్‌ కెమెరా పనితనంలో పశ్చిమ గోదావరి జిల్లా అల్లంపురం, కోసూరి నగర్, తొర్రేడు, తణుకు తదితర ప్రాంతాల్లో చిత్రీకరించిన ఆ సీన్లు, వాటికి ప్రాణం పోసిన నటీనటుల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే!

సంక్రాంతి రేసులో... ఊహించని సూపర్‌విన్నర్‌!
ఆ ఏడాది సంక్రాంతికి వచ్చిన చిత్రాల్లో బాలకృష్ణ ‘వంశానికొక్కడు’ (1996 జనవరి 5) మంచి హిట్టయితే, అదే రోజున మలయాళ హిట్‌కు తెలుగు రీమేక్‌గా వచ్చిన నాగార్జున ‘వజ్రం’ బొత్తిగా సానబెట్టని రాయిగా మిగిలిపోయింది. అప్పట్లో వరుస విజయాలతో దూకుడు మీదున్న దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి జోరుకు ‘వజ్రం’ ఠక్కున బ్రేకులు వేసింది. ఇక, ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలోనే హీరో కృష్ణ ‘సంప్రదాయం’ (జనవరి 11), సురేశ్‌ కృష్ణ నిర్దేశకత్వంలో సొంత సంస్థ సురేష్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై వెంకటేశ్‌ ‘ధర్మచక్రం’ (జనవరి 13) కూడా ఆ ఏటి సంక్రాంతి బాక్సాఫీస్‌ బరిలో కోడిపుంజులే. ఇక, అంతకు ముందు ఏడాదే ‘పెదరాయుడు’తో కలెక్షన్లలో ఇండస్ట్రీ రికార్డ్‌ హిట్‌ సాధించిన మోహన్‌బాబు కాస్త ఆలస్యంగా ఆ సంక్రాంతి రేసులోకి వచ్చారు. పండగ వెళుతూనే 1996 జనవరి 20న ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో, రమ్యకృష్ణ జోడీగా ‘సోగ్గాడి పెళ్ళాం’తో పలకరించారు. కానీ, ఆ పోటాపోటీ సంక్రాంతి సినిమాల బరిలో అనూహ్యంగా అన్నింటినీ ఓడించి పందెం గెలిచింది మాత్రం ‘పెళ్ళి సందడే’!

మనసును తాకిన సంగీతం... మెప్పించిన సాహిత్యం  
‘పెళ్ళి సందడి’లో ఏ పాటకు ఆ పాటే గొప్ప. అన్నీ కథకు నప్పినవే... జనం మెచ్చినవే! ప్రేమను నిర్వచిస్తూ, పతాక సన్నివేశ గీతంగా వచ్చే ‘హృదయమనే కోవెల తలుపులు తెరిచే తాళం... ప్రేమ ప్రేమ ప్రేమ...’ అన్న సిరివెన్నెల సీతారామశాస్త్రి రచన సినిమా క్లైమాక్స్‌కు ఆయువుపట్టయింది. ఇక, సిరివెన్నెలే రాసిన మరో గీతం ‘సౌందర్యలహరి స్వప్నసుందరి నువ్వే నా ఊపిరి...’ ఆల్‌టైమ్‌ హిట్‌. అలాగే, అక్కాచెల్లెళ్ళు ప్రియుణ్ణి గురించి చెప్పుకొంటున్నట్టు సామవేదం షణ్ముఖశర్మ రచించగా, చిత్ర పాడిన ‘నవ మన్మథుడా అతి సుందరుడా... నిను వలచిన ఆ ఘనుడు...’ పాట ఆడపిల్లల నోట మారుమోగింది.

ఇక, ‘నీ ఊహల్లోని స్వప్న సుందరి ఎలా ఉంటుం’దంటూ హీరోను అతని బావలు ప్రశ్నించే సందర్భంలో ముందుగా పాట అనుకోలేదు. హీరో నోట నాలుగైదు డైలాగులతో సరిపెడదామని భావించారు. కానీ, చివరి క్షణంలో మనసు మార్చుకొని, జొన్నవిత్తులతో పాట రాయించారు. అదే... పాపులర్‌ సినిమా హీరోయిన్ల పేర్లతో జనరంజకమైన హాస్యరసస్ఫోరక గీతం – ‘రమ్యకృష్ణ లాగ ఉంటదా... రంభ లాగ రంజుగుంటందా... అరె చెప్పర కన్నా...’ ఇవి కాక ‘మా పెరటి జాంచెట్టు పళ్ళన్ని కుశలం అడిగె...’, ‘చెమ్మచెక్క చెమ్మచెక్క చేరడేసి మొగ్గ...’, అలాగే స్వర – పద సంయోజనంగా సాగే ‘కిల కిల కిల కిల కిల... పడుచు కోకిల – పలికె ప్రియగీతిక పెళ్ళికిలా...’ వేటూరి మాత్రమే చేయగల పదాల గారడీలు.

వర్ధమాన చంద్రబోస్‌కు విలువైన ఛాన్స్‌
ఇవాళ సుప్రసిద్ధ సినీ గీత రచయిత అయిన చంద్రబోస్‌కు ‘పెళ్ళి సందడి’ ఓ కెరీర్‌ టర్నింగ్‌ పాయింట్‌. అప్పటికి ఆయన అప్పుడప్పుడే సినిమాల్లో నిలదొక్కుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. శ్రీకాంతే హీరోగా నటించిన ‘తాజ్‌మహల్‌’లో, అలాగే వెంకటేశ్‌ ‘ధర్మచక్రం’లో... ఇలా ఒకట్రెండు సినిమాలకే పాటలు రాశారు. ఆయనను పిలిచి, రాఘవేంద్రరావు అవకాశమిచ్చారు. అలా అప్పట్లో తిరుపతిలో మ్యూజికల్‌ సిట్టింగ్స్‌కు పిలిస్తే వెళ్ళిన చంద్రబోస్‌ ‘పెళ్ళి సందడి’కి ‘సరిగమ పదనిస రాగం – త్వరపడుతున్నది మాఘం...’, అలాగే ‘అయినా చిక్కలేదు చిన్నదాని ఆచూకీ – చెప్పరాని ఆశలన్ని హుష్‌కాకి...’ పాటలు రాశారు. అప్పుడు అలా కీరవాణి, రాఘవేంద్రరావులతో పరిచయం జరిగి, అప్పటికప్పుడు కీరవాణి మాటతో అటునుంచి అటే వారితో కలసి మద్రాసు వెళ్ళిన చంద్రబోస్‌ ఇక కెరీర్‌లో వెనక్కి తిరిగిచూసుకోలేదు. ‘పెళ్ళి సందడి’ మ్యూజికల్‌ హిట్‌తో రాఘవేంద్రరావు, కీరవాణి బృందంలో ఆయనా ఒకరయ్యారు. సినీ రంగంలో శాశ్వత స్థానం సంపాదించుకున్నారు. నాడు కేవలం రూ. 8 వేల పారితోషికం అందుకున్న ఆ వరంగల్‌ కుర్రాడు ఇవాళ అక్షర లక్షలు గడిస్తూ, ‘ఆస్కార్‌’ విజేతగా ఎదగడం అసాధారణ విజయం.  

మ్యూజికల్‌ మాయాజాలం
అప్పట్లో ఊరూవాడా ఎక్కడ విన్నా... ‘పెళ్ళి సందడి’ పాటలే! మ్యూజికల్‌ లవ్‌స్టోరీగా తీర్చిదిద్దిన ఈ ఫిల్మ్‌లో మొత్తం 9 పాటలు. ఫస్టాఫ్‌లో 6 పాటలు, సెకండాఫ్‌లో 3 పాటలు. సంగీత దర్శకుడు కీరవాణి అప్పటికే మంచి రేజ్‌లో ఉన్నారు. కీరవాణి – రాఘవేంద్రరావుల కాంబినేషన్‌ క్రేజు మీదుంది. అంతకు కొన్నేళ్ళ ముందే వారి కలయికలోనే వచ్చిన ‘అల్లరి ప్రియుడు’ (1993 మార్చి 5) సూపర్‌హిట్‌. ఆ పాటలు ఊరూరా మారుమోగాయి. ఆ నేపథ్యంలో వారిద్దరి కాంబినేషన్‌లోనే సిద్ధమైంది ‘పెళ్ళి సందడి’. ఆ సినిమా రిలీజుకు ముందే పాటలన్నీ సూపర్‌ డూపర్‌ హిట్‌.

‘లహరి’ సంస్థ రిలీజ్‌ చేసిన ఆడియోకు పిచ్చ క్రేజొచ్చింది. ఎంతగా అంటే... అప్పట్లోనే ‘పెళ్ళి సందడి’ ఏకంగా 3 లక్షల క్యాసెట్లు అమ్ముడుపోయాయి. అలా ఆ చిత్ర ఆడియో ‘ప్లాటినమ్‌ డిస్క్‌’ సాధించింది. దాంతో దర్శక, నిర్మాతలు మద్రాస్‌లోని ‘చోళా హోటల్‌’లో దాసరి, కె. విశ్వనాథ్, దేవీవరప్రసాద్, ఏడిద నాగేశ్వరరావు లాంటి సినీ పరిశ్రమలోని పలువురు ప్రముఖ దర్శక, నిర్మాతల సమక్షంలో ప్రత్యేకంగా ప్లాటినమ్‌ డిస్క్‌ వేడుకలు నిర్వహించారు. క్యాసెట్లకున్న క్రేజ్‌ను చూశాక, ఇక తెరపై పాటల చిత్రీకరణ కూడా తోడయ్యాక సినిమా పెద్ద మ్యూజికల్‌ హిట్టవడం ఖాయమని దర్శక, నిర్మాతలు ముందుగానే అభిప్రాయపడ్డారు. అక్షరాలా అదే నిజమైంది. పాటలు బంపర్‌ హిట్‌. సినిమా సూపర్‌హిట్‌. బాక్సాఫీస్‌ కలెక్షన్లలో సినిమా ఇండస్ట్రీ హిట్‌.

నృత్య దర్శకుడిగా... రాఘవేంద్రరావుకు ‘నంది’!
సౌందర్య పిపాసిగా పూలు, పండ్లు, గ్లామర్‌ దుస్తులతో తన ప్రతి సినిమాలో పాటల చిత్రీకరణలో ప్రత్యేకత చాటుకోవడం దర్శకుడు కె. రాఘవేంద్రరావు మార్కు శైలి. అలాంటిది... ఈ ‘పెళ్ళి సందడి’లో పాటలన్నిటికీ ఆయనే స్వయంగా నృత్యదర్శకత్వం కూడా వహించడం విశేషం. వేరే డ్యాన్స్‌ మాస్టర్‌ ఎవరూ లేకుండా అలా ఆయనే పాటలు తీసి, ఏకంగా ప్రేక్షకులందరితో డ్యాన్స్‌ చేయించారు. అంతకన్నా విశేషం ఏమిటంటే, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వమిచ్చే ప్రతిష్ఠాత్మక నంది అవార్డుల్లో ఆ ఏడాది బెస్ట్‌ కొరియోగ్రాఫర్‌గా గుర్తింపు ఆయనకే దక్కింది. ‘పెళ్ళి సందడి’ పాటలు వినడానికే కాదు... చూడడానికీ అంతే బాగుంటాయనడానికి అదో నిదర్శనం. ‘పెళ్ళి సందడి’ బాణీల్లో తన స్వర విశ్వరూపం చూపిన కీరవాణే ఆ ఏడాది బెస్ట్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ అంటూ ‘నంది’ పురస్కారం నిర్ద్వంద్వంగా వరించింది.

ఈ సినిమా కోసం ఊటీ, బెంగుళూరు, శివసముద్రం తదితర అందమైన లొకేషన్లలో పాటలను చిత్రీకరించారు. ఓ పాట కోసం రాఘవేంద్రరావు దాదాపు 40 రోజుల పాటు రోజూ షూటింగ్‌ జరిగే ప్రతి అందమైన లొకేషన్‌లో షాట్లు తీసుకుంటూ, చివరకు దాన్ని అందంగా కూర్చి, అబ్బురపరిచారు. రాఘవేంద్రరావు కెరీర్‌పై ఈ సినిమా, ఈ పాటలు ఎంత ప్రభావం చూపాయంటే... తరువాత 2010 దశకంలో రాఘవేంద్రరావు తొలిసారిగా పెదవి విప్పి, కెమెరా ముందు తన సినీజీవితానుభవాలను సహచరులతో కలసి పంచుకుంటున్నప్పుడు ఆ టీవీ షోకు కూడా ‘పెళ్ళి సందడి’లోని హిట్‌ పాట ప్రేరణతో ‘సౌందర్యలహరి’ అనే పేరే పెట్టారు. ఆ హిట్‌ పాట ట్యూన్‌నే తమ కార్యక్రమానికి థీమ్‌ మ్యూజిక్‌గా ఎంచుకున్నారు.

ఊరూరా... విజయయాత్ర
‘పెళ్ళి సందడి’కి ముందు ఎప్పుడో బ్లాక్‌ అండ్‌ వైట్‌ సినిమాల రోజుల నుంచే సినీ వాణిజ్య రాజధాని విజయవాడలో కొత్త సినిమాల యూనిట్‌కు అభినందన సభలు, పాత్రికేయులతో ఇష్టాగోష్ఠి సమావేశాలు జరపడం ఆనవాయితీగా ఉండేది. పత్రికలన్నీ ప్రధానంగా విజయవాడలో కేంద్రీకృతమై, పంపిణీదారులు ప్రధాన పాత్ర పోషించే ఆ రోజుల్లో అదొక మంచి పబ్లిసిటీ మార్గంగా కూడా ఉపకరించేది. అలాగే, 1950లు – 1970ల మధ్యలో అక్కినేని ‘రోజులు మారాయి’ లాంటి సినిమాల మొదలు పలు సినీ విజయయాత్రలు జరిగేవి. క్రమంగా అవి తగ్గుముఖం పట్టాయి. పాతికేళ్ళ తర్వాత మళ్ళీ ‘పెళ్ళి సందడి’ ఆ ట్రెండ్‌ను పునరుద్ధరించింది. సక్సెస్‌ టూర్ల పేరిట చిత్ర ప్రధాన తారాగణం, దర్శక – నిర్మాతలు ప్రధాన కేంద్రాల్లో థియేటర్లను సందర్శిస్తూ, నేరుగా ప్రేక్షకులను కలుసుకొనే సంప్రదాయం నెలకొంది. అలా 1996 ఏప్రిల్‌లో ‘పెళ్ళి సందడి’ యూనిట్‌ గూడూరు, నెల్లూరు సహా అనేక కేంద్రాల్లో పర్యటించి, సక్సెస్‌ టూర్లను మళ్ళీ పాపులర్‌ చేసింది. అప్పటి నుంచి మూడు దశాబ్దాల తర్వాత తాజా 2026 సంక్రాంతికి సైతం పలు చిత్రాల యూనిట్లు తెలుగు నేలపైనే కాక, అమెరికా గడ్డ మీదా విజయయాత్రలు చేసి, ప్రేక్షకులతో మమేకమయ్యే మార్కెటింగ్‌ వైఖరిని అవలంబించడం విశేషం. ఆ రకంగా 1990ల నుంచి ఆ ట్రెండ్‌ను మళ్ళీ సెట్‌ చేసింది ‘పెళ్ళి సందడే’!

తొలిసారిగా అమెరికాలోనూ సినీ ప్రదర్శనలు!
ఇవాళంటే, మన సినిమాలు ఓవర్సీస్‌లో ప్రదర్శితం కావడం, ఇండియాలో రిలీజయ్యే టైమ్‌కే అక్కడా రిలీజ్‌ కావడం లాంటివి సర్వసాధారణమైపోయాయి. కానీ, ఒకప్పుడు పరిస్థితి అలా ఉండేది కాదు. 1996 నాటికి ఓవర్సీస్‌ రిలీజ్‌ అనే మాట తెలుగు సినిమాకు కొత్త. అలాంటి సమయంలో... అమెరికాలో తొలిసారిగా ఎగ్జిబిషన్‌ షోలు ప్రదర్శితమైంది కూడా ‘పెళ్ళి సందడే’! అప్పట్లో గుంటూరుకు చెందిన ‘పద్మావతీ’ సుబ్బారావు అమెరికాలో ఈ ‘పెళ్ళి సందడి’ ప్రదర్శనలు జరిపారు.

సినిమాను అక్కడ ప్రదర్శించడానికని నిర్మాత అల్లు అరవింద్‌ను అభ్యర్థించి, సినిమా ప్రింట్లు తీసుకున్నారు. ఆ ప్రింట్లు తీసుకువెళ్ళి, అమెరికాలో శుభ్రంగా ప్రత్యేక రుసుము వసూలు చేసి మరీ, ‘పెళ్ళి సందడి’ ఎగ్జిబిషన్‌ షోలు వేయడం విశేషం. అలా ‘పెళ్ళి సందడి’ బాగానే వసూళ్ళు సాధించింది. ఆ సినిమా ఇచ్చిన ఉత్సాహంతో, ఆ తర్వాత రాఘవేంద్రరావు దర్శకత్వంలోనే నాగార్జున హీరోగా వచ్చిన ‘అన్నమయ్య’ (1997) తొలిసారిగా కొంత పెద్దస్థాయిలో కమర్షియల్‌గా థియేటర్లలో ప్రదర్శితమైంది. అదిగో... అలా తెలుగు సినిమా ఓవర్సీస్‌ రిలీజులకూ ఒక రకంగా రాఘవేంద్రరావు సినిమాలే శ్రీకారం చుట్టాయన్న మాట!

సరికొత్త ‘ఇండస్ట్రీ రికార్డ్‌’ల సందడి...
అప్పట్లో ఊరూరా... థియేటర్లలో ‘పెళ్ళి సందడే’! కోటి రూపాయల బడ్జెట్‌లో తీసిన సినిమా అందుకు అనేక రెట్లు సంపాదించడమే గొప్ప అనుకుంటే, కేవలం కలెక్షన్లలోనే కాదు రన్‌లోనూ ఆ సినిమా ఓ ఊపు ఊపేసింది. ఫస్ట్‌ బ్యాచ్‌లో 40 ప్రింట్లతో రిలీజ్‌ చేస్తే... ఏకంగా 34 కేంద్రాల్లో వంద రోజులాడింది. లేట్‌గా రిలీజైన మరో 10 కేంద్రాల్లోనూ శతదినోత్సవం జరుపుకొంది. ఇంకా విశేషమేమంటే, అంతకు ముందు అప్పటి పెద్ద హీరోల్లో ఒకరైన మోహన్‌బాబు ‘పెదరాయుడు’ చిత్రం 7 సెంటర్లలో సిల్వర్‌ జూబ్లీతో ఇండస్ట్రీ రికార్డ్‌. కానీ, ఏ పెద్ద హీరో లేని సోకాల్డ్‌ స్మాల్‌ ఫిల్మ్‌ ‘పెళ్ళి సందడి’... అంతకు మునుపెన్నడూ ఏ తెలుగు సినిమాకూ సాధ్యం కాని రీతిలో 27 కేంద్రాల్లో నేరుగా సిల్వర్‌ జూబ్లీ (175 రోజులు) జరుపుకొంది. కొత్త ‘ఇండస్ట్రీ రికార్డ్‌’ సృష్టించింది. అంతేకాదు... 28వ కేంద్రంగా షిఫ్టులతో నెల్లూరులోనూ ‘పెళ్ళి సందడి’ పాతిక వారాల పండగ చేసుకుంది. (ఆ తర్వాత రోజుల్లో బాలకృష్ణ ‘సమరసింహారెడ్డి’ 30 కేంద్రాల్లో డైరెక్ట్‌గా, ఒక కేంద్రంలో షిఫ్టులతో... మొత్తం 31 కేంద్రాల్లో సిల్వర్‌ జూబ్లీ చేసుకొని, ఆ రికార్డ్‌ను తిరగరాసింది. సరికొత్త ఇండస్ట్రీ రికార్డ్‌ను నెలకొల్పింది).

ఒక్క సిల్వర్‌జూబ్లీ కేంద్రాల సంఖ్యలోనే కాదు... ద్విశత దినోత్సవ సెంటర్ల సంఖ్యలోనూ అప్పట్లో ‘పెళ్ళి సందడి’ సరికొత్త ఇండస్ట్రీ రికార్డే. మొత్తం 15 కేంద్రాల్లో ఆ చిత్రం 200 రోజులు విజయవంతంగా ప్రదర్శితమవడం ఆనాటికి తెలుగు సినీసీమ కనివిని ఎరుగని విషయం. (ఆ తర్వాత రోజుల్లో తరుణ్‌ నటించిన ‘నువ్వే కావాలి’ చిత్రం 18 సెంటర్లలో ఆ ఫీట్‌ సాధించి, పాత ఇండస్ట్రీ రికార్డును తిరగరాసింది).

డైలీ ‘హౌస్‌ఫుల్‌’ సందడి! సంవత్సర కాలం గారడీ!!  
ఒక్క విజయవాడ కేంద్రమే తీసుకుంటే... ప్రేక్షకులపై ‘పెళ్ళి సందడి’ చేసిన మాయాజాలం అంతా ఇంతా కాదు. విజయవాడలోని ‘స్వర్ణా ప్యాలెస్‌’లో ఆ సినిమా 301 రోజులు ఆడింది. రోజుకు 4 ఆటల చొప్పున అలా ఒక సింగిల్‌ స్క్రీన్‌లో 1200 ఆటలకు పైగా ఒక చిత్రాన్ని ప్రదర్శించడం కోస్తా ఆంధ్రలో అప్పటికీ, ఇప్పటికీ హయ్యస్ట్‌ రికార్డ్‌. చెప్పుకోవాల్సినదేమిటంటే... విజయవాడ ‘స్వర్ణ ప్యాలెస్‌’లో ‘పెళ్ళి సందడి’ ప్రదర్శితమైన ఆ 301 రోజుల్లోనూ... రోజుకు 4 ఆటల వంతున 200 రోజులూ థియేటర్‌ హౌస్‌ఫుల్లే! అలాగే, గుంటూరులోని బాలభాస్కర్‌ థియేటర్‌లోనూ డైలీ 4 షోస్‌ చొప్పున 150 రోజుల పాటు ప్రతిరోజూ థియేటర్‌ బయట హాలు నిండినది బోర్డే!! విజయవాడలో భారీయెత్తున బహిరంగంగా సినిమా సిల్వర్‌జూబ్లీ ఫంక్షన్‌ చేస్తే, ప్రముఖ హీరో చిరంజీవి దానికి ముఖ్య అతిథిగా విచ్చేసి, యూనిట్‌ను అభినందించారు. తర్వాత అదే విజయవాడ, హైదరాబాద్‌లలో ‘పెళ్ళి సందడి’ చిత్రం షిఫ్టులతో 365 రోజుల పాటు ఆడింది. అలా సంవత్సరం రన్‌తో ‘గోల్డెన్‌ జూబ్లీ’ చేసుకుంది.

రెండు దశాబ్దాలు... రెండు సినిమాలు... రాఘవేంద్రజాలం
హైదరాబాద్‌ కేంద్రమే తీసుకుంటే, సంధ్య 35 ఎం.ఎం. థియేటర్‌లో ‘పెళ్ళి సందడి’ 233 రోజులు ఆడి, కనివిని ఎరుగని రీతిలో కోటి రూపాయల గ్రాస్‌ సాధించింది. ఒక సింగిల్‌ స్క్రీన్‌ థియేటర్‌లో ఒక తెలుగు సినిమా కోటి రూపాయల మొత్తం వసూలు చేయడం చరిత్రలో అదే తొలిసారి. తెలుగు సినీచరిత్ర పరికిస్తే... సింగిల్‌ స్క్రీన్‌ థియేటర్‌లో తొలిసారిగా రూ. 10 లక్షల గ్రాస్‌ సాధించిన చిత్రం... హైదరాబాద్‌లోని ‘వెంకటేశ థియేటర్‌’లో ఎన్టీఆర్‌ ‘అడవిరాముడు’ (1977). దాదాపు ఇరవై ఏళ్ళ తర్వాత మళ్ళీ ‘పెళ్ళి సందడి’ (1996)తో ఓ తెలుగు సినిమా తొలిసారిగా కోటి రూపాయల గ్రాస్‌ వసూళ్ళు సాధించిన ఘనత దక్కించుకుంది. రెండు దశాబ్దాల వ్యవధిలో తెలుగు సినిమా బాక్సాఫీస్‌కు అలాంటి కీర్తి కిరీటం కట్టబెట్టిన ఆ రెండు సినిమాలూ... మెగాఫోన్‌ మెజీషియన్‌ కె. రాఘవేంద్రరావు అందించినవే! అదీ దర్శకేంద్రుడి కమర్షియల్‌ స్టామినా! (మల్టీప్లెక్సులు వచ్చాక, హైదరాబాద్‌ ‘ప్రసాద్‌– ఐమ్యాక్స్‌’లో హాలీవుడ్‌ చిత్రం ‘అవతార్‌–పార్ట్‌1’ (2009 డిసెంబర్‌ 18న ఇండియా రిలీజ్‌) ఏకంగా ఏడాది పాటు ఆడి, దాదాపు రూ. 6 కోట్ల గ్రాస్‌ సాధించి, బాక్సాఫీస్‌ రికార్డులకెక్కింది). 
    
ఎందరికో... కెరీర్‌లో కొత్త మలుపు
‘పెళ్ళి సందడి’ ఎంతో మంది కెరీర్లను మార్చేసింది. అంతకు ముందు అనేక చిన్న పాత్రలు, ప్రతినాయక ఛాయలున్న పాత్రలు కూడా చేసిన శ్రీకాంత్‌కు హీరోగా అది రెండో సినిమా. హీరోగా తొలి చిత్రం ‘తాజ్‌మహల్‌’ విజయవంతమైనా, కథానాయక పాత్రలతో ప్రమోషన్‌ కోసం తండ్లాటలో ఉన్న శ్రీకాంత్‌ ‘పెళ్ళి సందడి’తో ఒక్కసారిగా హీరోగా స్థిరపడ్డారు. అలా చిన్న నిర్మాతలకు అందుబాటులో ఉండే మరో మంచి హీరో ఇండస్ట్రీకి దొరికారు. 
    
ఈ సినిమాలో చెల్లెలు పాత్ర ధరించిన దీప్తీ భట్నాగర్‌కు తెలుగులో ఇదే మొదటి సినిమా. ఆమె అందరినీ ఆకర్షించారు. ఇక, అక్క పాత్రకు ముందుగా అనుకున్నది హీరోయిన్‌ రవళిని కాదు... సంఘవిని! ఆమెకు డేట్లు కుదరకపోవడంతో ఆ అదృష్టం రవళిని వరించింది. అటుపైన రవళికి కె. విశ్వనాథ్‌ దర్శకత్వంలో వెంకటేశ్‌ సరసన ‘చిన్నబ్బాయి’ (1997 జనవరి 10) సహా ఎన్నో ఊహించని ఆఫర్లు వెల్లువెత్తాయి. అలాగే, ఈ సినిమాతో గీత రచయితగా చంద్రబోస్‌ పరిశ్రమలో నిలబడ్డారు.

అప్పటికే జోరు మీదున్న రాఘవేంద్రరావు – కీరవాణి జోడీ అప్పటి నుంచి విడదీయరానిదైంది. సాక్షాత్తూ రాఘవేంద్రరావు కెరీర్‌ సైతం మారిపోయింది. ‘పెళ్ళి సందడి’ లాంటి అందమైన ప్రేమకథతో సెల్యులాయిడ్‌పై శృంగారాన్ని బంగారంగా పండించిన దర్శకేంద్రుడి ప్రస్థానం ఆ వెంటనే అదే 1996లో మరో కొత్త మలుపు తిరిగింది. నాగార్జునతో ‘అన్నమయ్య’ చిత్రీకరణ మొదలైంది. అలా సెల్యులాయిడ్‌ కామి కాస్తా మోక్షగామి అయి, రక్తిరస లాహిరి నుంచి భక్తిరస భావన వైపు మళ్ళి, ఆ జానర్‌లో తనదైన ముద్ర వేయడం మరో అసాధారణ విషయం.

అదే బ్యానర్‌పై రిపీట్‌ అవని సక్సెస్‌!
‘పెళ్ళి సందడి’ సాధించిన విజయంతో రాఘవేంద్రరావు తమ సొంత ఆర్‌.కె. ఫిల్మ్‌ అసోసియేట్స్‌ బ్యానర్‌పై ఆ వెంటనే అదే ఏడాది జె.డి. చక్రవర్తి హీరోగా ‘బొంబాయి ప్రియుడు’ (1996 సెప్టెంబర్‌ 5) తీశారు. మునుపటి చిత్రం అంత పెద్ద హిట్టయినా, ఈ సినిమా మాత్రం ఆ మ్యాజిక్‌ చేయలేకపోయింది. సక్సెస్‌ఫుల్‌ సినిమాగా పెట్టిన పెట్టుబడులు వెనక్కి తీసుకొచ్చింది. ఇక, ఆ వెంటనే ‘పెళ్ళి సందడి’ నిర్మాతలు తమ చిత్రాన్ని రాఘవేంద్రరావు దర్శకత్వంలోనే ‘మేరే సప్నోం కీ రాణీ’ (1997) పేరిట ఊర్మిళా మాతోండ్కర్, మధుబాల హీరోయిన్లుగా, సంజయ్‌ కపూర్‌ హీరోగా నిర్మించారు. విచిత్రమేమిటంటే, ఆనంద్‌ – మిళింద్‌ సంగీతంలో వచ్చిన ఆ రీమేక్‌ తెలుగులోని మ్యాజిక్‌ను రీక్రియేట్‌ చేయలేకపోయింది. ఉత్తరాది జనానికి పట్టకపోవడంతో తెలుగు ఇండస్ట్రీ హిట్‌... హిందీలో అట్టర్‌ఫ్లాపైంది. ‘పెళ్ళి సందడి’ వచ్చిన సరిగ్గా రెండేళ్ళ తర్వాత 1998 సంక్రాంతికి ఆ దర్శక, నిర్మాతల టీమ్, అదే బ్యానర్‌పై నూతన తారలతో ‘పరదేశి’ (1998 జనవరి 14) ప్రయత్నం చేసింది. కానీ, అదీ ఘోరంగా ఫ్లాపైంది. దాంతో ‘పెళ్ళి సందడి’ చేసిన బ్యానర్‌కు పూర్తిగా తెరపడింది. ఆ తరువాత అయిదేళ్ళకు దర్శకుడు రాఘవేంద్రరావు తన 100వ సినిమాగా అల్లు అర్జున్‌ను హీరోగా పరిచయం చేస్తూ, ‘గంగోత్రి’ (2003) రూపొందించారు. లక్ష్మీ ఫిలిమ్స్‌ జగదీశ్‌ ప్రసాద్‌ను మినహాయించి, మళ్ళీ అల్లు అరవిందే సమర్పకుడిగా, అశ్వినీదత్‌ నిర్మాతగా, వారితో కలసి, రాఘవేంద్రరావు ‘యునైటెడ్‌ ప్రొడ్యూసర్స్‌’ అనే వేరొక కొత్త బ్యానర్‌పై ఆ చిత్రాన్ని అందించడం గమనార్హం.

ఆ ముగ్గురి కెరీర్‌కీ స్వర్ణోత్సవం!
దర్శక, నిర్మాతలుగా రాఘవేంద్రరావు, అశ్వినీదత్, అల్లు అరవింద్‌ల మధ్య అప్పటికీ ఇప్పటికీ మంచి అనుబంధం, స్నేహం. గమ్మత్తేమిటంటే, ఈ ముగ్గురూ ఇప్పటికి 50 ఏళ్ళ పైగా సినీ రంగ ప్రస్థానం సాగిస్తూనే ఉన్నారు. 1965లో సహాయ దర్శకుడైన రాఘవేంద్రరావు సినీ రంగానికి వచ్చి 60 ఏళ్ళు నిండింది. శోభన్‌బాబు ‘బాబు’ (1975)తో తొలిసారి స్వతంత్ర దర్శకుడై, 50 ఏళ్ళు పూర్తయింది. ఇక, ‘వైజయంతీ’ పతాకంపై ఎన్టీఆర్‌ ‘ఎదురులేని మనిషి’ (1975)తో అశ్వినీదత్‌ స్వతంత్ర నిర్మాతై 50 ఏళ్ళు నిండాయి. అలాగే, వేరొకరితో కలిసే అయినప్పటికీ ‘గీతా ఆర్ట్‌ ప్రొడక్షన్స్‌’ పతాకంపై ‘బంట్రోతు భార్య’ (1974 జూన్‌ 7)తో నిర్మాత అయిన అల్లు అరవింద్‌ సైతం చిత్రనిర్మాణంలో యాభై వసంతాలు పూర్తి చేసేసుకున్నారు. ఆ రకంగా ‘పెళ్ళి సందడి’తో పరిశ్రమ రికార్డు సృష్టించిన ఆ ముగ్గురు మిత్రుల కెరీర్‌కీ ఇది ‘గోల్డెన్‌జూబ్లీ’ సెలబ్రేషన్స్‌ ఇయర్‌.

ఏమైనా... సినిమా రిలీజ్‌కు ముందే... ఓ వేడుకలో దర్శకుడు దాసరి అన్నట్టు... ‘పెళ్ళి సందడి’ ఫక్తు వాణిజ్య ఘనవిజయాల దర్శకేంద్రుడి సినిమా కాదు... కసికొద్దీ ‘జ్యోతి’ (1976), ‘ఆమె కథ’ (1977) లాంటి సిసలైన చిన్న బడ్జెట్‌ సాహస ప్రయోగాలు  చేసిన దర్శకుడి సినిమా. ఇంకా చెప్పాలంటే... స్టార్‌ హీరోల, భారీ చిత్రాల రాఘవేంద్రరావు తనను తాను స్వయంగా సవాలు చేసుకొని, కథ, కథనం, సాంకేతిక నైపుణ్యాలను నమ్ముకొని చేసిన సినిమా. సృజనాత్మకత ఉంటే చిన్న బడ్జెట్‌లోనూ అద్భుతాలు చేయవచ్చని నిరూపించిన సినిమా. అప్పట్లో అందరినీ అవాక్కయ్యేలా చేసిన బాక్సాఫీస్‌ ఇండస్ట్రీ రికార్డ్‌ సినిమా. నేటికీ జనం మర్చిపోలేని మ్యూజికల్, ఫ్యామిలీ సినిమా... ‘పెళ్ళి సందడి’.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement