సూపర్‌వైజర్ పోస్టులు.. సర్కస్ ఫీట్లు | Sakshi
Sakshi News home page

సూపర్‌వైజర్ పోస్టులు.. సర్కస్ ఫీట్లు

Published Wed, Oct 30 2013 3:42 AM

Supervisor posts like Circus feet

ఒంగోలు కలెక్టరేట్, న్యూస్‌లైన్: మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఐసీడీఎస్ గ్రేడ్-2 సూపర్‌వైజర్ రెగ్యులర్ పోస్టుల నియామకాల వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. నోటిఫికేషన్ వెలువడిన నాటి నుంచి వివాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. డెరైక్టరేట్ స్థాయిలోనే అక్రమాలకు బీజం పడటంతో సమస్యలు తలెత్తుతున్నాయి. నిబంధనలకు పాతరేశారంటూ ఇప్పటికే గుంటూరు జిల్లా పత్తిపాడు ప్రాజెక్టుకు చెందిన అంగన్‌వాడీ కార్యకర్త హైకోర్టును ఆశ్రయించారు. తాజాగా లోకాయుక్త కూడా జోక్యం చేసుకుంది. సమాచార హక్కు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు టీ గంగాధర్ ఫిర్యాదుతో జస్టిస్ సుభాషణ్‌రెడ్డి స్పందించారు. రాష్ట్రంలోని పది మంది ఐఏఎస్ ఆఫీసర్లు, ఒక ఐఎఫ్‌ఎస్ అధికారి, మహిళా శిశు సంక్షేమ శాఖకు చెందిన ఆరుగురు రీజనల్ డిప్యూటీ డెరైక్టర్లకు నోటీసులు జారీ చేశారు. డిసెంబర్ 12వ తేదీలోగా సూపర్‌వైజర్ పోస్టులకు సంబంధించి సమగ్రమైన నివేదికలు అందించాలని ఆదేశించారు.
 
 మహిళా శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా 1741 గ్రేడ్-2 సూపర్‌వైజర్ పోస్టులకు ఈ ఏడాది జూలై  రెండో తేదీ నోటిఫికేషన్ జారీ చేశారు. అభ్యర్థుల వయసు దగ్గర నుంచి అర్హత వరకు నిబంధనలను పక్కన పెట్టేశారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జారీ చేసిన ఉత్తర్వులను సైతం పక్కన పెట్టేశారు. అంగన్‌వాడీ  ట్రైనింగ్ సెంటర్ కోఆర్డినేటర్ అండ్ ఇన్‌స్ట్రక్టర్లకు 5 శాతం రిజర్వేషన్ ఇవ్వడం వివాదానికి దారితీసింది. కాంట్రాక్టు సూపర్‌వైజర్లుగా విధులు నిర్వర్తిస్తున్న వారికి కంటిన్యూషన్ ఆర్డర్ ఇవ్వకపోవడం, వారు యథావిధిగా రెగ్యులర్ సూపర్‌వైజర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడం, వారికి హాల్‌టికెట్లు పంపించడం కూడా వివాదాస్పదమైంది.
 
 గుంటూరు జిల్లా పత్తిపాడు ప్రాజెక్టు పరిధిలోని పెదనందిపాడు అంగన్‌వాడీ కార్యకర్త ఎం రమాదేవి హైకోర్టును ఆశ్రయించగా, సూపర్‌వైజర్ల పోస్టులకు సంబంధించి కౌంటర్ (డబ్ల్యూఏ 1746) ఇవ్వాలంటూ మహిళా శిశు సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి, కమీషనర్, సాధారణ పరిపాలన శాఖ కమిషనర్‌లతోపాటు ఆయా జిల్లాల కలెక్టర్లు, రీజనల్ డిప్యూటీ డెరైక్టర్లకు ఆదేశాలు జారీచేశారు. తాజాగా లోకాయుక్త జస్టిస్ సుభాషణ్‌రెడ్డి జోక్యం చేసుకొని మహిళా శిశు సంక్షేమశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, కమీషనర్‌లతోపాటు ప్రకాశం, పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి, కర్నూలు, విశాఖపట్నం, వరంగల్, హైదరాబాద్ కలెక్టర్లతోపాటు సంబంధిత రీజనల్ డిప్యూటీ డెరైక్టర్లకు నోటీసులు జారీ చేశారు. నోటీసులు అందుకున్నవారు లోకాయుక్తకు అందించే సమాధానాన్ని బట్టి రాత పరీక్ష రాసిన అభ్యర్థుల భవితవ్యం ఆధారపడి ఉంది. ‘దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకున్న’ చందంగా కొంతమంది మహిళా శిశు సంక్షేమశాఖ ఉన్నతాధికారులు తీసుకున్న నిర్ణయం అభ్యర్థులకు శాపంగా పరిణమించింది. ఏ రోజు ఏం జరుగుతుందోనని అభ్యర్థులు ఉత్కంఠకు గురవుతున్నారు.
 

Advertisement
Advertisement