Telangana: Recruitment Process Of Anganwadi Supervisor Posts - Sakshi
Sakshi News home page

Telangana: అంగన్‌వాడీ పోస్టుల భర్తీలో గోల్‌మాల్‌.. ఈ ప్రశ్నలకు బదులేది?

Dec 3 2022 2:23 AM | Updated on Dec 3 2022 12:58 PM

Telangana: Recruitment Process Of Anganwadi Supervisor Posts - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ పరిధిలోని అంగన్‌వాడీ సూపర్‌వైజర్‌ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. అభ్యర్థుల ఎంపిక విషయంలో నిబంధనలు పాటించకుండా అధికారులు ఇష్టానుసారంగా వ్యవహరించారంటూ అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

రోస్టర్‌ పాటింపులో గందరగోళం తలెత్తిందని, మరోవైపు ఇన్‌స్ట్రక్టర్లకు రిజర్వ్‌ చేసిన పోస్టులను ఇతరులతో భర్తీ చేశారని, దివ్యాంగుల కోటాలోనూ అనర్హులను ఎంపిక చేశారంటూ అభ్యర్థులు రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కమిషనరేట్‌ ఎదుట నిరసనలకు దిగుతున్నారు. ఈ నేపథ్యంలో ఇతరుల ప్రవేశానికి అనుమతి ఇవ్వకుండా కమిషనరేట్‌ అధికారులు సెక్యూరిటీని కట్టుదిట్టం చేశారు. 

434 పోస్టులకి వేలల్లో దరఖాస్తులు 
రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ పరిధిలో 434 గ్రేడ్‌–2 సూపర్‌వైజర్‌(ఎక్స్‌టెన్షన్‌ ఆఫీసర్‌) పోస్టులకు గతేడాది సెప్టెంబర్‌ 30న ఆ శాఖ నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ పోస్టులను కొత్త వారితో కాకుండా ఇప్పటికే అంగన్‌వాడీల్లో టీచర్లుగా పనిచేస్తూ పదేళ్ల అనుభవం ఉండి పదోతరగతి ఉత్తీర్ణులైన వారికి అవకాశం కల్పించింది. ఈ పోస్టుల్లో 5 శాతం కోటాను అంగన్‌వాడీ ట్రైనింగ్‌ సెంటర్లు, మిడిల్‌ లెవల్‌ ట్రైనింగ్‌ సెంటర్లో పనిచేస్తున్న కోఆర్డినేటర్లు/ఇన్‌స్ట్రక్టర్లకు రిజర్వ్‌ చేయగా... మరో 15 శాతం మార్కులను ఇప్పటికే కాంట్రాక్టు ప్రాతిపదికన పనిచేస్తున్న సూపర్‌వైజర్లకు కేటాయించింది.

కానీ కాంట్రా క్టు సూపర్‌వైజర్‌ ఉద్యోగాలను రాష్ట్ర ప్రభుత్వం క్రమబద్ధీకరించడంతో వారంతా ఈ నోటిఫికేషన్‌ పరిధిలోకి రాకుండానే ప్రభుత్వ కొలువుల్లో చేరిపోయారు. ఇక నోటిఫికేషన్‌ వెలువడిన క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 23వేల మంది అంగన్‌వాడీ టీచర్లు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తు చేసుకున్న వారికి ఈ ఏడాది జనవరి రెండో తేదీన అర్హత పరీక్ష నిర్వహించిన మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ... ఫిబ్రవరిలో ఫలితాలను ప్రకటించింది.

ఆ తర్వాత మార్కుల ఆధారంగా మెరిట్‌ జాబితాలను రూపొందించి ప్రాథమిక అర్హుల జాబితా అనంతరం... ఇటీవల తుది జాబితాను విడుదల చేసి వారికి పోస్టింగ్‌ ఉత్తర్వులు ఇచ్చింది. అయితే తుది జాబితాలో నిబంధనలు పాటించకుండా అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరించిన తీరుపై విమర్శలు చెలరేగుతున్నాయి. 

మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ పరిధిలో మొత్తం 434 పోస్టులకు హైదరాబాద్, వరంగల్‌ రీజియన్లు వేరువేరుగా నోటిఫికేషన్లు జారీ చేశాయి. మొత్తం పోస్టుల్లో 427 పోస్టులు భర్తీ అయ్యాయి. 7 పోస్టులకు అభ్యర్థులు లేకపోవడంతో ఖాళీగా ఉంచినట్లు అధికారులు చెబుతున్నారు. భర్తీ చేసిన 427 పోస్టుల్లో 15 మంది ఇన్‌స్ట్రక్టర్లకు అవకాశం కల్పించారు. 

5 శాతం పోస్టులను ఇన్‌స్ట్రక్టర్లు/కోఆర్డినేటర్లకు అవకాశం కల్పిస్తున్నట్లు నోటిఫికేషన్‌లో ప్రకటించారు. ఈ క్రమంలో సగటున 22 పోస్టులు ఇన్‌స్ట్రక్టర్లు/కోఆర్డినేటర్లకు దక్కాల్సి ఉండగా... కేవలం 15 పోస్టులతోనే సరిపెట్టారు. అయితే రిజర్వ్‌ చేసిన పోస్టులను కమ్యూనిటీ రిజర్వేషన్లతో భర్తీ చేయడం.. పలు అనుమానాలకు తావిచ్చినట్లయింది. 

కొన్నిచోట్ల కమ్యూనిటీ రిజర్వేషన్ల వారీగా మెరిట్‌ను పరిశీలిస్తే తక్కువ మార్కులు వచ్చిన అభ్యర్థి అర్హత సాధించగా... అదే కేటగిరీకి చెందిన మరో అభ్యర్థికి ఎక్కువ మార్కులు వచ్చినా ఉద్యోగం రాలేదు. ఉదాహరణకు జోన్‌–7 పరిధిలో ఎస్సీ కేటగిరీకి చెందిన అభ్యర్థికి 10.125 మార్కులు వచ్చినప్పటికీ ఉద్యోగం వచ్చింది. కానీ అదే ఎస్సీ కేటగిరీకి చెందిన అభ్యర్థికి 13.125 మార్కులు వచ్చినా కొలువు దక్కలేదు. 

ఇక ఖమ్మం జిల్లాలోని ఓ అభ్యర్థి దరఖాస్తులో వైకల్యం లేదని స్పష్టంగా పేర్కొన్నప్పటికీ సదరు అభ్యర్థికి దివ్యాంగుల కోటాలో ఉద్యోగం దక్కింది. వాస్తవానికి వైకల్యం ఉన్న అభ్యర్థికి కొలువు రాలేదు. మహబూబ్‌నగర్, వికారాబాద్‌ తదితర జిల్లాల్లో కూడా దివ్యాంగులైన అభ్యర్థులకు అవకాశం రాలేదంటూ లబోదిబోమంటున్నారు. 

కాగా నోటిఫికేషన్‌లో పేర్కొన్న నిబంధనలకు అనుగుణంగానే పోస్టుల భర్తీ జరిగిందని రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement