చిగురించిన ఆశలు సూపర్ వైద్యం | Super Specialty Hospital services | Sakshi
Sakshi News home page

చిగురించిన ఆశలు సూపర్ వైద్యం

Apr 2 2014 2:03 AM | Updated on Jul 25 2018 4:09 PM

వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఇటీవల నర్సీపట్నంలో సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలపై ఇచ్చిన మాట జిల్లాలోని పేద రోగుల్లో ఆశలు చిగురింపజేసింది.

విశాఖపట్నం-మెడికల్, న్యూస్‌లైన్: వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఇటీవల నర్సీపట్నంలో సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలపై ఇచ్చిన మాట జిల్లాలోని పేద రోగుల్లో ఆశలు చిగురింపజేసింది. పేదలకు మెరుగైన వైద్య సేవలందుతాయన్న భావన ఆ యన మాటల్లో బలీయంగా వినిపిం చింది. కొండంత భరోసా నింపింది. జగన్‌మోహన్‌రెడ్డి వ్యాఖ్యలు వైద్య వర్గాల్లోనూ చర్చనీయాంశమయ్యాయి.
 
ఈ సందర్భం గా కేజీహెచ్‌లోని సూపర్‌స్పెషాలిటీ వైద్య సేవలపై ఒకసారి సాక్షి ఫోకస్..కేజీహెచ్‌లో 10 సూపర్ స్పెషాలిటీ వైద్య విభాగాలున్నాయి. నేటికీ అవి సింగిల్ యూనిట్లుగా నీరసించిపోతున్నాయి. ఉత్తరాం ధ్ర జిల్లాల రోగులకు స్పెషాలిటీ వైద్య అవసరాలకు తగ్గా వైద్యులు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది లేరు. సదుపాయాలు, పరికరాలు లేవు. దీంతో సూపర్ స్పెషాలిటీ వైద్య లక్ష్యం నెరవేరలేదు. కార్డియాలజీ విభాగంలోని మూడుయూనిట్లలోనూ కార్డియాలజిస్టుల కొరత వెంటాడుతోంది. ఫలితంగా రె ండే పనిచేస్తున్నాయి.
 
గతంలో ఉన్న ఐదుగురు వైద్యులను తొలగించడంతో ఈ పరిస్థితి నెలకొంది. కీలకమైన ఓపెన్ హార్ట్ సర్జరీలు నిర్వహించే కార్డియో థొరాసిక్ విభాగంలో విభాగాధిపతి మాత్రమే ఉన్నారు. అర్హులైన సర్జన్లు, ఇతర సిబ్బంది లేకపోవడంతో ఈ విభాగం మిస్‌మ్యాచ్‌లకు నిలయమైంది. న్యూరోసర్జరీ విభాగం కూడా సింగిల్ యూనిట్‌తో నడుస్తోంది. తల, వెన్నుగాయాలపాలైన క్షతగాత్రులకు సరైన చికిత్సలు అందించలేని స్థితిలో నడుస్తోంది. నిత్యం ఇక్కడ పడకలకు డిమాండ్ ఉంటోంది.
 
పడకలు చాలక ఫ్లోర్‌బెడ్‌పై రోగులను ఉంచి చికిత్సలు చేస్తున్న దుస్థితి కనిపిస్తోంది. నెఫ్రాలజీ ఇన్‌చార్జి అధిపతి పాలనలో నడుస్తోంది. ఉస్మానియా, కేజీహెచ్‌లకు ఒకే అధిపతిని నియమించడం వల్ల కిడ్నీ రోగుల వైద్యానికి తీవ్ర అసౌకర్యం జరుగుతోందన్న ఆరోపణలు ఉన్నాయి. కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్సలు ఏడాదిన్నర కాలంగా నిలిచిపోయాయి. బర్న్స్ వార్డులో సదుపాయాలు, పరికరాల పరిస్థితి దయనీయంగా ఉంది. ఆరోగ్యశ్రీ పథకం కింద చేర్చుకున్న కేసులకు సైతం ఉన్న సదుపాయాలతోనే చికిత్సలు అందించడం దయనీయంగా ఉందని రోగులు వాపోతున్నారు.
 
 వైఎస్ చొరవతో..
టీడీపీ వ్యవస్థాపకుడు, అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ తొలుత కేజీహెచ్‌లో సూపర్ స్పెషాలిటీ బ్లాక్ నిర్మాణానికి శంకుస్థాపన చేయగా, మరుసటి రోజే సీఎం పదవి కోల్పోయారు. ఆయన స్థానంలో అధికారాన్ని చేపట్టిన చంద్రబాబు నాయుడు స్పెషాలిటీ బ్లాక్ నిర్మాణం వైపు కన్నెత్తి చూడలేదు. అనంతరం అధికారంలోకి వచ్చిన వైఎస్.రాజశేఖరరెడ్డి చొరవ తీసుకుని సూపర్ స్పెషాలిటీ బ్లాక్ నిర్మాణానికి తొలి విడతగా రూ.10 కోట్లు మంజూరు చేశారు.
 
అప్పటి ఆరోగ్యశాఖ మంత్రి రోశయ్యతో శంకుస్థాపన చేయించి స్పెషాలిటీ వైద్యానికి పునాది వేశారు. రెండు ఫ్లోర్ల నిర్మాణం పూర్తయింది. మరో రెండు ఫ్లోర్లు నిర్మాణ దశలో ఉన్నాయి. మహానేత వైఎస్ మరణం తర్వాత దీని అభివృద్ధిని పట్టించుకొనే వారే కరువయ్యారు. దీంతో భవనాలున్నా ఇక్కడ పరికరాల లేమి, అరకొర వైద్య సిబ్బందితో కేజీహెచ్‌లో సూపర్ స్పెషాలిటీ సేవలు అందుబాటులోకి రావడం అంత సులభం కాదనే భావన వ్యక్తమవుతోంది.
 
ఈ నేపథ్యంలో జిల్లా కేంద్రంలో సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలపై వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ ఉత్తరాంధ్ర రోగుల్లో కొత్త ఆశలను చిగురింపజేసింది. జగన్ అధికారంలోకి రాగానే తమకు వైద్య సేవలందుతాయని నిరుపేద రోగులు ముక్త కంఠంతో చెబుతున్నారు. కేజీహెచ్‌లో సూపర్‌స్పెషాలిటీ బ్లాకులకు మంచిరోజులొస్తున్నాయనే సంతోషం అందరిలోనూ వ్యక్తమవుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement