మాకు ఆత్మహత్యలే శరణ్యం

Suicide is the refuge for us

నిరసన దీక్షలో ఫాతిమా కళాశాల విద్యార్థులు, తల్లిదండ్రులు 

గాంధీనగర్‌ (విజయవాడ సెంట్రల్‌): ఫాతిమా కళాశాల యాజమాన్యం విద్యార్థులను మోసగించిందని, ప్రభుత్వం చొరవ తీసుకొని న్యాయం చేయకపోతే తమకు ఆత్మహత్యలే శరణ్యమని బాధిత విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. ఏడాదిన్నరగా ప్రభుత్వ మాయమాటలు నమ్మి మోసపోయామంటూ అలంకార్‌ సెంటర్‌లోని ధర్నాచౌక్‌లో మంగళవారం వారు నిరసన దీక్ష చేపట్టారు. దీక్షకు వైఎస్సార్‌సీపీతోపాటు కాంగ్రెస్, సీపీఐ, విద్యార్థి సంఘాలు వైఎస్సార్‌ ఎస్‌యూ, పీడీఎస్‌యూ, ఏఐఎస్‌ఎఫ్‌ మద్దతు ప్రకటించాయి. విద్యార్థులు మాట్లాడుతూ నంద్యాల ఉపఎన్నిక సమయంలో సీఎం చంద్రబాబు తమకు వేరే కళాశాలల్లో ప్రవేశం కల్పిస్తామని ఇచ్చిన హామీ అమలు కాలేదన్నారు.

మంత్రి కామినేని శ్రీనివాస్‌ ఫాతిమా కాలేజీ యాజమాన్యానికి అనుకూలంగా వ్యవహరిస్తూ కోర్టులో తప్పుడు అఫిడవిట్‌ సమర్పించినందునే తాము రోడ్డున పడాల్సి వచ్చిందన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఆర్‌.అర్షాద్, అజ్మతుల్లా, రహీంబాషా మాట్లాడుతూ కళాశాల యాజమాన్యం తమ వద్ద రూ.లక్షల రూపాయలు వసూలు చేసి, అనుమతుల్లేకుండా అడ్మిషన్లు ఇచ్చిందన్నారు. ప్రభుత్వం ఎంసీఐతో సంప్రదింపులు జరిపి పిల్లల భవిష్యత్‌ను కాపాడాలని కోరారు. కళాశాల యాజమాన్యంపై చర్యలు తీసుకుని వారిని శిక్షించాలని కోరారు.  

ప్రతిపక్ష నేత దృష్టికి తీసుకెళ్తాం.. 
దీక్షలో వైఎస్సార్‌సీపీ నగర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మల్లాది విష్ణు మాట్లాడుతూ నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి కామినేని శ్రీనివాస్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. టీడీపీ ప్రభుత్వంలో విద్యార్థులు రోడ్డెక్కాల్సిన పరిస్థితి దాపురించిందన్నారు. ఈ విషయాన్ని ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్తామన్నారు. విద్యార్థులకు వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుందన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top