ఎన్‌సీఎస్ షుగర్ ఫ్యాక్టరీపై ఆర్‌ఆర్‌యాక్ట్ | Sugar Factory ensies RR act | Sakshi
Sakshi News home page

ఎన్‌సీఎస్ షుగర్ ఫ్యాక్టరీపై ఆర్‌ఆర్‌యాక్ట్

Jan 6 2014 5:48 AM | Updated on Oct 20 2018 6:17 PM

జిల్లాలోని పొదలకూరు మండలం ప్రభగిరిపట్నం వద్ద ఉన్న ఎన్‌సీఎస్ చెక్కర ఫ్యాక్టరీ 2012-13 సంవత్సరానికి సంబంధించి రైతులకు చెల్లించాల్సిన సుమారు రూ.14 కోట్ల బకాయిలు చెల్లించకపోవడంతో ప్రభుత్వం రెవెన్యూ రికవరీ చట్టం (ఆర్‌ఆర్ యాక్ట్) 9వ సెక్షన్ ప్రయోగించింది.

సాక్షి, నెల్లూరు : జిల్లాలోని పొదలకూరు మండలం ప్రభగిరిపట్నం వద్ద ఉన్న ఎన్‌సీఎస్ చెక్కర ఫ్యాక్టరీ 2012-13 సంవత్సరానికి సంబంధించి  రైతులకు చెల్లించాల్సిన సుమారు రూ.14 కోట్ల బకాయిలు చెల్లించకపోవడంతో ప్రభుత్వం రెవెన్యూ రికవరీ చట్టం (ఆర్‌ఆర్ యాక్ట్) 9వ సెక్షన్ ప్రయోగించింది. ఇందులో భాగంగా మొదటి విడతలో ఫ్యాక్టరీకి చెందిన వాహనాలు, మొలాసిస్‌ను వేలం వేయాలని నిర్ణయించింది. ఈ నెల 21న ఫ్యాక్టరీలోనే వేలంపాట నిర్వహించనున్నారు. తొలి వేలం పాటలో రెండు బొలేరో జీపులు, ఒక బొలేరో క్యాంపర్ జీపు, ఒక మారుతి ఎస్టీమ్‌తో పాటు 194.230 మెట్రిక్ టన్నుల మొలాసిస్‌ను వేలం వేయనున్నట్లు అధికారులు ప్రకటించారు. చెరకు కమిషన్ ఆధ్వర్యంలో ఈ వేలం పాటలు జరగనున్నాయి.
 
 అప్పటికీ బకాయిలు చెల్లించేందుకు యాజమాన్యం ముందుకు రాకపోతే రెండో విడతలో ఫ్యాక్టరీ మిషనరీని స్వాధీనం చేసుకోనున్నట్లు సమాచారం. రైతులకు చెల్లించాల్సిన బకాయిలు రూ.13 కోట్ల 80 లక్షల 55 వేలను ఫ్యాక్టరీ సామగ్రిని వేలం వేసి చెల్లిస్తారు. రైతు బకాయిల రికవరీకి గత నెల 15న వేలం పాట జరగాల్సి ఉన్నా ఫ్యాక్టరీ యాజమాన్యం హైకోర్టుకు వెళ్లి మూడు విడతల్లో బకాయిలు చెల్లిస్తామని ఒప్పుకుని అనుమతి పొందింది. దీంతో వేలం పాట వాయిదా పడింది. అయితే కోర్టు ఉత్తర్వులను ఫ్యాక్టరీ యాజమాన్యం పాటించక పోవడంతో ఆర్‌ఆర్ యాక్ట్ అమలుకు అధికారులు శ్రీకారం చుట్టారు. నెల్లూరు షుగర్ కేన్ అసిస్టెంట్ కార్యాలయం అధికారులు ఈ నెల 21న తొలుత ఫ్యాక్టరీ సామగ్రి వేలానికి సిద్ధమయ్యారు.
 
 కోవూరు ఫ్యాక్టరీ బకాయిల సంగతేంది?
  ప్రైవేటు ఫ్యాక్టరీ అయిన ఎన్‌సీఎస్ ఫ్యాక్టరీ బకాయిల చెల్లింపు విషయం సీరియస్‌గా తీసుకున్న అధికారులు మరి ప్రభుత్వ అనుబంధమైన సహకార రంగానికి చెందిన కోవూరు షుగర్ ఫ్యాక్టరీ రైతులకు చెల్లించాల్సిన బకాయిల విషయంలో మాత్రం స్పందించడం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కోవూరు షుగర్ ఫ్యాక్టరీ 2012-13 ఏడాదికి సంబంధించి రైతులకు రూ.7 కోట్ల రూపాయల బకాయిలు చెల్లించాల్సి ఉంది. కోవూరు షుగర్ ఫ్యాక్టరీకి నాలుగేళ్లుగా పాలకవర్గం ఎన్నికలు జరగేదు. దీంతో ఫ్యాక్టరీకి జిల్లా కలెక్టరే చైర్మన్‌గా ఉంటున్నారు.  రైతులకు మాత్రం  బకాయిలు  ఇప్పటికీ అందలేదు. కలెక్టర్ స్పందించాలని రైతులు కోరుతున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement