నిమిషం నిబంధన గ్రామ రెవెన్యూ అధికారులు (వీఆర్వో), గ్రామ రెవెన్యూ సహాయకుల (వీఆర్‌ఏ) అభ్యర్థులను వెంటాడింది. ఉరుకులు పరుగులు తీసినా అభ్యర్థులు సకాలంలో పరీక్ష కేంద్రాల వద్దకు చేరకపోవడంతో.. నిమిషం ఆలస్యమైందని చాలా మందిని అనుమతించలేదు.
నిమిషం నిబంధనతో పలువురు గైర్హాజరు
వీఆర్వో పరీక్షకు 62,752 మంది..
వీఆర్‌ఏకు 2,728 మంది హాజరు
తనికెళ్ల సంఘటన మినహా అంతా ప్రశాంతం
నిమిషం నిబంధన అభ్యర్థులను ఆందోళనకు గురిచేసింది. ఉరుకులు పరుగులతో పరీక్ష కేంద్రాలకు చేరుకోవాల్సి వచ్చింది.
ఖమ్మం, న్యూస్‌లైన్:
నిమిషం నిబంధన గ్రామ రెవెన్యూ అధికారులు (వీఆర్వో), గ్రామ రెవెన్యూ సహాయకుల (వీఆర్‌ఏ) అభ్యర్థులను వెంటాడింది. ఉరుకులు పరుగులు తీసినా అభ్యర్థులు సకాలంలో పరీక్ష కేంద్రాల వద్దకు చేరకపోవడంతో.. నిమిషం ఆలస్యమైందని చాలా మందిని అనుమతించలేదు. ఎంతో దూరం నుంచి వచ్చినా అధికారులు అనుమతించకపోవడంతో వారు నిరాశతో వెనుదిరిగారు. జిల్లాలో ఆదివారం నిర్వహించిన వీఆర్వో పరీక్షకు 62,752 మంది హాజరు కాగా 7,196 మంది అభ్యర్థులు గైర్హాజరయ్యారు. వీఆర్‌ఏ పరీక్షకు 2,728 మంది అభ్యర్థులు హాజరు కాగా 291 మంది గైర్హాజరయ్యారు. తనికెళ్లలోని బ్రౌన్స్ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రానికి తక్కువ ప్రశ్నపత్రాలు రావడంతో అభ్యర్థులు ఆందోళన చెందారు. ఈ సంఘటన మినహా పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి.
జిల్లాలో 161 పరీక్ష కేంద్రాల్లో వీఆర్వో, ఆరు కేంద్రాల్లో వీఆర్‌ఏ పరీక్షలు నిర్వహించారు. ఖమ్మం డివిజన్‌కు చెందిన చాలా మంది అభ్యర్థులకు కొత్తగూడెం, పాల్వంచ, భద్రాచలంలో కూడా పరీక్ష కేంద్రాన్ని కేటాయించారు. దీంతో ఖమ్మం నుంచి భద్రాచలం, పాల్వంచ వచ్చే అభ్యర్థులు బస్సులు సకాలంలో అందక ఇబ్బంది పడ్డారు. కొంతమంది అభ్యర్థులు గంట ముందుగానే పరీక్ష కేంద్రాల వద్దకు చేరుకున్నారు. భద్రాచలం, పాల్వంచకు ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సులు ఏర్పాట్లు చేసినట్లు అధికారులు ప్రకటించినా.. కొంతమంది అభ్యర్థులు బస్సులు అందక ఖమ్మంలోనే వెనుదిరిగిపోయారు. అభ్యుర్థుల సందడితో ఖమ్మం, కొత్తగూడెం, భద్రాచలం, పాల్వంచ బస్టాండ్లు ఉదయం 5 గంటల నుంచే కిటకిటలాడాయి. పరీక్షల కేంద్రానికి నిమిషం ఆలస్యమైన చాలా మంది అభ్యర్థులు చివరి ప్రయత్నంగా హెల్ప్‌లైన్ నంబర్‌కు ఫోన్ చేసి అనుమతించేలా అధికారులు ఆదేశాలు ఇవ్వాలని విన్నవించినా, వారి కోరిక నెరలేదు.
ఖమ్మంలో 91 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం నుంచే అభ్యర్థులు ఆయా కేంద్రాల వద్ద కోలాహలంగా కనిపించారు. జేసీ సురేంద్రమోహన్ ప్రియదర్శిని, కవితా మెమోరియల్ డిగ్రీ, ఎస్‌ఆర్‌అండ్‌బీజీఎన్‌ఆర్ కళాశాలల్లో పరీక్షలు జరుగుతున్న తీరును పరిశీలించారు. పలు కేంద్రాల్లో ఆలస్యంగా వచ్చిన కొంతమందిని పరీక్ష కేంద్రంలోకి అనుమతించలేదు. ఫ్లయింగ్ స్క్వాడ్స్‌కు వాహనాలు ఏర్పాటు చేయడంలో ఆలస్యం కావడంతో పరీక్ష ముగిసే సమయానికి వచ్చి తనిఖీలు చేశారు.
కొత్తగూడెం పట్టణంలో 13,190 మంది అభ్యర్థులకు గాను 35 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందులో 10,664 అభ్యర్థులు పరీక్షకు హాజరు కాగా, 2,526 మంది గైర్హాజరయ్యారు. గౌతమ్ మోడల్ స్కూల్ కేంద్రం వద్దకు ఆలస్యంగా వచ్చిన ఐదుగురిని లోనికి అనుమతించలేదు. పాల్వంచలో 21 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందులో మొత్తం 9,310 మంది అభ్యర్థులకు గాను 8,028 మంది హాజరయ్యారు. 1,282 మంది అభ్యర్థులు గైర్హాజరయ్యారు. కేంద్రాల అడ్రస్‌లు సక్రమంగా తెలియకపోవడంతో అభ్యర్థులు పరుగులు తీశారు. పాల్వంచ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, కేఎల్‌ఆర్ కిడ్స్ పాఠశాల కేంద్రాల వద్దకు ఆలస్యంగా వచ్చిన అభ్యర్థులను అనుమతించలేదు.
భద్రాచలంలో ఏర్పాటు చేసిన 13 పరీక్షా కేంద్రాల్లో 6,146 మందికి గాను 4,888 మంది అభ్యర్థులు హాజరయ్యారు. 1,258 మంది గైర్హాజరయ్యారు. ఇక్కడి పరీక్షా కేంద్రాలను ఆర్డీఓ కాస వెంకటేశ్వర్లు పరిశీలించారు. పోలీసులు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. పరీక్ష సమయం ప్రారంభం తర్వాత ఆలస్యంగా రావడంతో నన్నపనేని మోహన పాఠశాల వద్ద ఇద్దరిని, ఏపీఆర్ పాఠశాల వద్ద ఐదుగురు అభ్యర్థులను అధికారులు అనుమతించలేదు. దీంతో వారు నిరాశతో వెనుదిరిగారు.
వీఆర్‌ఏ పరీక్షల కోసం జిల్లా కేంద్రంలో 6 కేంద్రాలను ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం నుంచి ఈ పరీక్ష ఉండడంతో అభ్యర్థులు ముందుగానే కేంద్రాల వద్దకు చేరుకున్నారు. మొత్తం ఈ పరీక్షకు 3,019 మంది దరఖాస్తు చేసుకోగా 2,728 హాజరయ్యారు. 291 మంది గైర్హాజరయ్యారు.