వసతిగృహాలు ఆశ్రమ పాఠశాలలుగా మారితే తమ కష్టాలు తొలగిపోతాయని భావించిన విద్యార్థుల ఆశలపై ప్రభుత్వం నీళ్లు చల్లింది.
కుక్కునూరు, న్యూస్‌లైన్: వసతిగృహాలు ఆశ్రమ పాఠశాలలుగా మారితే తమ కష్టాలు తొలగిపోతాయని భావించిన విద్యార్థుల ఆశలపై ప్రభుత్వం నీళ్లు చల్లింది. దీంతో జిల్లాలో ఆశ్రమ పాఠశాలలుగా మారాల్సిన 13 వసతిగృహాలకు చెందిన మూడు వేల మంది విద్యార్థుల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. జిల్లాలోని 45 గిరిజన సంక్షేమ వసతి గృహాల్లో పదమూడింటిని ఆశ్రమపాఠశాలలుగా ఆధునికీకరిస్తున్నట్లు గత నెలలో ప్రభుత్వం ప్రకటించింది. మిగిలిన 32 వసతి గృహాలకు మొండిచేయి చూపింది. అయితే ఇటీవల రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా వసతిగృహాల ఆధునికీకరణ ప్రశ్నార్థకంగా మారింది.
తొమ్మిది సూత్రాల పథకంలో భాగంగా....
గిరిజన ప్రాంతాల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న తొమ్మిది సూత్రాల పథకంలో భాగంగా జిల్లాలోని వసతి గృహాలను ఆశ్రమపాఠశాలలుగా ఆధునికీకరిస్తున్నట్లు గత నెలలో ప్రకటించిన సంగతి విదితమే. ఈ ఆశ్రమపాఠశాలల్లో 2013 - 14 విద్యాసంవత్సరంలో 3 నుంచి 5వ తరగతి వరకు ఒక్కో తరగతిలో 40 మంది పిల్లలకు మాత్రమే అవకాశం కల్పిసామంటున్న ప్రభుత్వం నాలుగు ఎస్జీటీ పోస్టులను కూడా మంజూరు చేస్తామని ప్రకటించింది. కానీ ప్రభుత్వం ఎంపిక చేసిన వసతిగృహాల్లో భద్రాచలంలోని గిరిజన బాలికల వసతిగృహంలో 300 మంది, బాలుర వసతిగృహంలో 200 మంది, బూర్గంపాడులో 300 మంది, మణుగూరులో 250 మంది, కుక్కునూరులో 170 మంది విద్యార్థులు ఉన్నారు. ఖమ్మం, సత్తుపల్లి, కల్లూరు, ఇల్లెందు, అశ్వారావుపేటలోని బాలికల వసతిగృహాలతో పాటు ఖమ్మంలోని రెండు బాలుర వసతిగృహాల్లో మొత్తం మూడువేల మంది విద్యార్థులు ఉన్నట్లు సమాచారం.
సౌకర్యాలు కరువు..
జిల్లాలోని 13 వసతిగృహాల్లో 1 నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న మూడువేల మంది విద్యార్థులు చదువుకునేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. సౌకర్యాలు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కుక్కునూరు గిరిజన బాలికల వసతి గృహంలో ఉన్న 170 మంది విద్యార్థుల్లో వంద మంది వరకు కిలో మీటర్ దూరంలో ఉన్న ఉన్నత పాఠశాలకు వెళ్లి చదువుకుంటున్నారు. ప్రతీరోజు వీరు పాఠశాలకు వెళ్లి వచ్చేందుకు నాలుగు కిలోమీటర్ల మేర నడవాల్సి వస్తోంది. ఇంత దూరం నడవలేక పలువురు విద్యార్థినులు సాయంత్రం ఆశ్రమ పాఠశాలకు వచ్చిన తర్వాత కళ్లు తిరిగి పడిపోతున్నారు. ఈ నేపథ్యంలో ఈ వసతిగృహాన్ని ఆశ్రమ పాఠశాలగా మారుస్తున్నామని ప్రభుత్వం ప్రకటించడంతో విద్యార్థులు ఎంతో ఆనందపడ్డారు. కానీ వారి ఆశలపై తెలంగాణ ప్రకటన నీళ్లు చల్లినట్లయింది.
ఆశ్రమపాఠశాలలో వసతులు కరువు :
ఇప్పటికే జిల్లాలో ఉన్న 74 ఆశ్రమపాఠశాలల్లో కరువైన వసతులపై పలుమార్లు విద్యార్థి సంఘాలు ఆంధోళనలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఏళ్ల తరబడి ఆ పాఠశాలల్లో నెలకొని ఉన్న సమస్యలను పరిష్కరించలేని ప్రభుత్వం ప్రకటన ‘ఉట్టికెక్కలేనమ్మ, ఆకాశానికి నిచ్చెనేసినట్లు ఉంది’అన్న చందంగా తయారైందని గిరిజన విద్యార్థి సంఘాలు ఎద్దేవా చేస్తున్నారు.