అమ్మ ఒడి.. నిండిన బడి

Student Respond on Amma Vodi Scheme in Guntur - Sakshi

ప్రభుత్వ.. ప్రైవేట్‌ పాఠశాలలకుపిల్లలను చదివించడానికి ఆర్థికంగా ఇబ్బంది పడి.. ఏ తల్లి తన పిల్లలను చదువు మాన్పించకూడదన్న ఉద్దేశంతో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అమ్మ ఒడి పథకాన్ని ప్రవేశపెట్టారు. ఇందులో భాగంగా ప్రభుత్వ పాఠశాలలతో పాటు ప్రైవేట్, కార్పొరేట్‌ పాఠశాలలకు పిల్లలను పంపుతున్న తల్లులకు కూడా ఈ పథకాన్ని వర్తింపజేస్తున్నారు. ఈ క్రమంలోనే జిల్లాలో తొలి విడత జాబితాలో అర్హత సాధించిన 3,77,376 మందిలో దాదాపు 1.80 లక్షల మందికి పైగా ప్రైవేట్‌ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల తల్లులు ఉన్నారు.

సాక్షి, అమరావతి బ్యూరో: జగనన్న అమ్మఒడి పథకం విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తోంది. ఆర్థిక ఇబ్బందులతో అక్షరానికి దూరమైన చిన్నారులను బడిబాట పట్టిస్తోంది. అర్హతగల ప్రతి కుటుంబానికి ఆర్థిక ప్రోత్సాహం లభిస్తుండటం, ప్రభుత్వ బడులపై నమ్మకం పెరగటంతో చాలా మంది తల్లిదండ్రులుప్రైవేట్‌ పాఠశాలల నుంచి తమ పిల్లలను సర్కార్‌ బడుల్లో చేర్పించారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఆంధ్రప్రదేశ్‌లో విద్యారంగం కొత్తపుంతలు తొక్కుతుండటంతో యావత్తూ దేశం అమ్మ ఒడి వైపు చూస్తోంది. 

కొత్త ఒరవడి..
జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది ఏకంగా 25,730 మంది విద్యార్థులు ప్రైవేట్‌ పాఠశాలల నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లు పొందారు. ముఖ్యంగా పట్టణాల్లోని మున్సిపల్‌ స్కూళ్లలో విద్యార్థుల చేరికలు ఎక్కువగా ఉన్నాయి. గుంటూరు రవీంద్రనగర్‌లోని పట్టాభిపురం మున్సిపల్‌ కార్పొరేషన్‌ హైస్కూల్‌లో 160 మంది విద్యార్థులు ప్రైవేట్‌ పాఠశాలల నుంచి వచ్చి చేరారు. ఇలా విద్యార్థులు గత చరిత్రకు భిన్నంగా ప్రైవేట్‌ పాఠశాలల నుంచి ప్రభుత్వ బడుల్లోకి చేరిన మండలాల్లో చిలకలూరిపేట, గుంటూరు, మాచర్ల, నరసరావుపేట, సత్తెనపల్లి, తెనాలి మొదటి స్థానంలో ఉన్నాయి. 

టార్గెట్‌కు మించి అడ్మిషన్లు..  
మామూలుగా విద్యా సంవత్సరం ప్రారంభంలో గతేడాది అన్ని ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలల్లో జరిగిన అడ్మిషన్ల సంఖ్యను ప్రస్తుత ఏడాదికి టార్గెట్‌గా పెట్టుకుంటారు. అలా గతేడాది గుంటూరు జిల్లాలో 6.83 లక్షల మంది అడ్మిషన్లు పొందారు. 2019–20 విద్యా సంవత్సరంలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి రావటం, జగనన్న అమ్మ ఒడి పథకం ప్రవేశపెట్టడంతో విద్యాశాఖ పెట్టుకున్న టార్గెట్‌కు మించి అడ్మిషన్లు నమోదయ్యాయి. ఈ ఏడాది డిసెంబర్‌ నాటి లెక్కలప్రకారం 6.98 లక్షల అడ్మిషన్లు జరిగాయి. అంటే గతం కంటే 15వేలకు పైగా అడ్మిషన్లు పెరిగాయి. ప్రస్తుత లెక్కల ప్రకారం ఈ సంఖ్య మరో రెండు, మూడు వేలు పెరిగే అవకాశముందని అధికారులు చెబుతున్నారు.

శ్రద్ధగా పిల్లలను బడికి పంపుతున్నారు
సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అమ్మ ఒడి పథకాన్ని ప్రవేశ పెట్టడంతో ఎంతో మంది బడికి రాని పిల్లలు కూడా ప్రస్తుత పరిస్థితుల్లో చదువు కోవడానికి వస్తున్నారు. తురకపాలెం గ్రామంలో పిల్లలను తమ తల్లిదండ్రులు బడికి పంపకుండా పనికి తీసుకెళ్లేవారు. కానీ, ఇప్పుడు ప్రతి విద్యార్థిని తల్లిదండ్రులు శ్రద్ధగా బడికి పంపిస్తున్నారు. – షేక్‌ కరీం, హెచ్‌ఎం, ఉర్దూ ప్రాథమికోన్నత పాఠశాల 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top