అనుమానాస్పదస్థితిలో విద్యార్థిని మృతి | student commit suicide in srikakulam district | Sakshi
Sakshi News home page

అనుమానాస్పదస్థితిలో విద్యార్థిని మృతి

Mar 22 2017 5:39 PM | Updated on Nov 9 2018 4:36 PM

అనుమానాస్పదస్థితిలో విద్యార్థిని మృతి - Sakshi

అనుమానాస్పదస్థితిలో విద్యార్థిని మృతి

కుశాలపురం పంచాయతీ నవభారత్‌కు చెందిన తొమ్మిదవ తరగతి విద్యార్థిని పైడి హారతి(15) ఉరివేసుకొని మృతి చెందింది.

► హత్యచేశారంటున్న మృతురాలి తల్లిదండ్రులు
►  కేసు నమోదు చేసిన పోలీసులు
►  వివాహేతర సంబంధమే కారణమా?
ఎచ్చెర్ల క్యాంపస్‌: కుశాలపురం పంచాయతీ నవభారత్‌కు చెందిన తొమ్మిదవ తరగతి విద్యార్థిని పైడి హారతి(15) ఉరివేసుకొని మృతి చెందింది. మృతురాలి తల్లిదండ్రులు శ్రీరామూర్తి, లక్ష్మి మాత్రం తమ కుమార్తె హత్యకు గురైందని ఆరోపిస్తున్నారు. ఈ మేరకు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఎచ్చెర్ల పోలీసులు మాత్రం అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.
పొందూరు మండలం ధర్మపురం గ్రామానికి చెందిన పైడి శ్రీరాంమూర్తి నవభారత్‌లో సొంతంగా ఇల్లు నిర్మించుకొని గత 20 ఏళ్లగా ఇక్కడే నివాసం ఉంటున్నాడు. స్థానికంగా ఉన్న పరిశ్రమలో ఈయన పనిచేస్తుండగా, ఇతని భార్య స్థానికంగా ఉన్న హోటల్‌లో పనిచేస్తుంది. వీరికి హారతి అనే కుమార్తె, ఆరువ తరగతి చదువుతున్న కుమారుడు భరత్‌ ఉన్నారు. శ్రీకాకుళంలోని వరం మున్సిపల్‌ ఉన్నత పాఠశాలలో హారతి తొమ్మిదవ తరగతి చదువుతోంది.
మంగళవారం మధ్యాహ్నం గణితం వార్షిక పరీక్ష సైతం రాయవల్సి ఉంది. ఈలోగా ఆమె ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. శ్రీరాంమూర్తి ఇంటి ఎదురుగా నివాసం ఉంటున్న కోరాడ గోవిందరావు అనే వివాహితుడు టాటా ఏస్‌ నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఇతడు హారతితో గత ఏడాది నుంచి వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నట్టు ప్రచారం ఉంది. విజయనగరానికి చెందిన 35 ఏళ్లు ఉన్న గోవిందరావు గత కొన్నేళ్ల నుంచి ఈ ప్రాంతంలో అద్దెకు ఉంటూ జీవనం సాగిస్తున్నారు.
తొమ్మిదవ తరగతి విద్యార్థినితో వివాహేతర సంబంధం కొనసాగించటంతో తరచూ శ్రీరాంమూర్తి, గోవిందరావు కుటుంబాల మధ్య వివాదాలు జరిగేవి. గోవిందరావు అతని భార్య జ్యోతి సైతం తరచూ ఈ విషయంపై గొడవలు పడేవారు. భార్యకు విడాకులు ఇచ్చి మైనర్‌ బాలిక హారతిని వివాహం చేసుకునేందుకు గోవిందరావు సిద్ధపడ్డాడన్న ఆరోపణలు స్థానికంగా ఉన్నాయి. అయితే హారతి మంగళవారం మధ్యాహ్నం 9వ తరగతి గణితం పరీక్ష రాయవల్సి ఉంది. పరీక్షకు వెళతానని తల్లిదండ్రులకు ఉదయం చెప్పింది.
తల్లిద్రండులు పనికి వెళ్లిపోయిన తర్వాత వరండాలో శ్లాబు హుక్‌కు ఉరివేసుకొంది. మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో ఇంటికి చేరుకున్న బాలిక తల్లిదండ్రులు వేలాడివున్న హారతిని కిందకు దించారు. అప్పటికే మృతి చెంది ఉంది. గోవిందరావు లేదా ఆయన భార్య హత్య చేసి ఉరివేసుకున్నట్టు వేలాడదీసి ఉంటారని మృతురాలి తల్లిదండ్రులు, బంధువులు ఆరోపిస్తున్నారు. 
మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు క్లూస్‌ టీం, ఫింగర్‌ ప్రింట్స్‌ నిర్థారణ విభాగం, జేఆర్‌ పురం సీఐ రామకృష్ణ, ఎచ్చెర్ల ఎస్సై సందీప్‌కుమార్‌ సంఘటన స్థలానికి చేరుకున్నారు. శ్రీరాంమూర్తి ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కోరాడ గోవిందరావును విచారణ నిమిత్తం అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఈ అంశం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు.
సంఘటన స్థలంలో సేకరించిన ఆధారాలను ఫోరెన్సిక్‌ ల్యాబరేటరీకి పంపించారు. పోస్టుమార్టం, ఫోరెన్సిక్‌ నివేదిక ఆధారంగా మృతిపై స్పష్టత వస్తుందని ఎస్‌ఐ సందీప్‌కుమార్‌ చెప్పారు. విద్యార్థిని మృతిపై తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement