అమ్మ ఒడి చేరిన సిక్కోలు సిసింద్రీ

The Story Of Jasits Kidnapping Which Has Created A State Wide Sensation Is A Happy Ending - Sakshi

క్షేమంగా ఇంటికి చేరిన జసిత్‌

అర్ధరాత్రి సమయంలో జసిత్‌ను విడిచిపెట్టిన కిడ్నాపర్లు 

పోలీసులకు సమాచారం ఇచ్చిన బట్టీ యజమాని 

ప్రత్యేక శ్రద్ధ తీసుకున్న సీఎం వైఎస్‌ జగన్‌కు కుటుంబం కృతజ్ఞతలు

ముద్దులొలికే చిన్నారి.. మురిపాల పొన్నారి.. కిడ్నాపర్ల బారిన పడి ఎలా ఉన్నాడోనని ఆంధ్ర దేశమంతా తల్లిడిల్లింది.. ప్రాణాలతో తిరిగి రావాలని వేయి దేవుళ్లకు మొక్కుకుంది.. మూడు రోజుల తర్వాత గురువారం ఉదయం క్షేమంగా ఇంటికి చేరడంతో అందరూ హాయిగా ఊపిరి పీల్చుకున్నారు. బయటివారికే అంత ఆనందం కలిగితే మరి కన్న తల్లిదండ్రుల సంతోషానికి హద్దేముంది. ఆనందబాష్పాలు రాలుతున్న ఆ మాతృమూర్తి ముఖంలో కోటి కాంతులు విరబూశాయి. తూర్పుగోదావరి జిల్లా మండపేటలో బ్యాంకు అధికారులుగా పనిచేస్తున్న శ్రీకాకుళం జిల్లావాసులు నాగావళి, వెంకటరమణల ముద్దుల బిడ్డ జసిత్‌ అదృశ్యం కావడంతో రాష్ట్రమంతా కలకలం రేగింది. చివరకు క్షేమంగా తిరిగిరావడంతో అందరూ ఆనందించారు. 

చెల్లి కావాలా? తమ్ముడు కావాలా? అని తనయుడిని అడుగుతూ మురిసిపోవాల్సిన తరుణంలో.. మూడు రోజులుగా ఆ అమ్మ పడిన వేదన అందరి హృదయాలనూ కలచివేసింది. ఎవరో అగంతకులు తన ముద్దుల బాబును ఎత్తుకుపోయారు. తన బాబు ఎక్కడున్నాడో.. ఎలా ఉన్నాడో.. ఏమైనా తిన్నాడో లేదో.. అంటూ నిండు గర్భిణిగా ఉండి కూడా నిద్రాహారాలు లేకుండా ఎదురుచూసింది. నా బిడ్డను క్షేమంగా విచిపెట్టండంటూ ఆమె చేతుల జోడించి వేడుకున్న తీరు చూపరులను సైతం కంట తడిపెట్టించింది. కిడ్నాపర్ల చెరలో ఉన్న పాల బుగ్గల చిన్నారిని చూసి క్షేమంగా ఇంటికి చేరాలని కోరుకోని హృదయం లేదు. దేవుడికి మొక్కని చేతులు లేవు. 60 గంటల పాటు సాగిన ఉత్కంఠకు తెరదించుతూ.. అందరిని ఆనందంలో ముంచెత్తుతూ కిడ్నాపర్ల చెర నుంచి పోలీస్‌ అధికారుల చేతుల మీదుగా తల్లి చెంతకు చేరాడు జసిత్‌. 

సాక్షి, మండపేట: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన జసిత్‌ కిడ్నాప్‌ కథ సుఖాంతమైంది. కిడ్నాపర్లు బాలుడిని బుధవారం అర్ధరాత్రి సమయంలో చింతలరోడ్డులోని ఇటుకల బట్టీ వద్ద విడిచిపెట్టగా కార్మికులు చేరదీసి కుటుంబ సభ్యులు, పోలీసులకు సమాచారం అందించారు. గురువారం ఉదయం 7 గంటల సమయంలో ఎస్పీ నయీం అస్మి స్వయంగా జసిత్‌ను తీసుకువచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు. కాగా కిడ్నాప్‌నకు కారణాలు మిస్టరీగానే మిగిలాయి. కేసును ఛేదించే దిశగా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. క్రికెట్‌ బెట్టింగ్‌ వ్యవహారమే కిడ్నాప్‌కు కారణమై ఉండవచ్చునన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మండపేటలో బ్యాంకు ఉద్యోగులు నూకా వెంకటరమణ, నాగావళి దంపతుల కుమారుడు ఈ నెల 22వ తేదీ రాత్రి నానమ్మతో కలిసి అపార్ట్‌మెంటులోని ప్లాటులోకి వెళుతున్న సమయంలో మెట్ల వద్ద అపరిచిత వ్యక్తి దాడి చేసి జసిత్‌ను అపహరించుకుపోయిన విషయం తెలిసిందే.

మూడు రోజులుగా పెద్ద ఎత్తున పోలీసులు అన్ని కోణాల్లోను దర్యాప్తు నిర్వహించినా కిడ్నాపర్లు, బాలుడి ఆచూకీ లభ్యం కాలేదు. జసిత్‌ రోజూ ఆడుకునే ఇంటి వద్ద ఇద్దరు అనుమానాస్పద వ్యక్తులకు సంబంధించిన సీసీ ఫుటేజీ లభ్యం కావడంతో ఆ కోణంలోనూ దర్యాప్తు చేపట్టారు. బుధవారం అర్ధరాత్రి సమయంలో ఇద్దరు వ్యక్తులు జసిత్‌ను తీసుకువచ్చి కుతుకులూరు–లొల్ల మధ్య గల చింతల రోడ్డులోని బట్టీ వద్ద విడిచిపెట్టడంతో అదే సమయంలో కాలకృత్యాల కోసం బయటకు వచ్చిన బట్టి కార్మికుడు ఏసు అక్కడ ఉన్న బాలుడిని తీసుకువెళ్లి బట్టీ యజమాని కర్రి రామకృష్ణారెడ్డికి సమాచారం అందించాడు. నాలుగు గంటల సమయంలో రామకృష్ణారెడ్డి ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు బట్టీ వద్దకు చేరుకుని బాలుడిని మండపేట తీసుకువచ్చారు. ఎస్పీ నయీం అస్మి జసిత్‌ను ఎత్తుకుని తీసుకువచ్చి తల్లిదండ్రులకు అప్పగించడంతో కథ సుఖాంతమైంది. 

జసిత్‌ క్షేమంగా ఇంటికి చేరుకోవడంతో అతని ఇంటి వద్ద పండుగ వాతావరణం నెలకొంది. మూడు రోజులుగా నిద్రాహారాలు లేకుండా ఉన్న కుటుంబ సభ్యులు జసిత్‌ను చూసి ఆనందంతో ఉప్పొంగిపోయారు. అతనిని ముద్దాడుతూ మురిసిపోయారు. చుట్టుపక్కల వారు, పెద్ద ఎత్తున స్థానికులు ఇంటి వద్దకు చేరుకోవడంతో కోలాహలం నెలకొంది. మూడు రోజుల పాటు కిడ్నాపర్ల చెరలో ఉన్న జసిత్‌కు పోలీసులు వైద్య పరీక్షలు చేయించగా, బాలుడు ఆరోగ్యంగా ఉన్నాడని ప్రభుత్వ ఆస్పత్రి డిప్యూటీ సివిల్‌ సర్జన్‌ చైతన్య తెలిపారు. జసిత్‌ రాకతో గత మూడు రోజులుగా కంటి మీద కునుకులేకుండా శ్రమిస్తున్న పోలీసులు వేడుక చేసుకున్నారు. ఎస్పీ వారందరికీ స్వీట్లు అందించి అభినందించారు. అన్ని కోణాల్లోను దర్యాప్తు చేయడం, సీసీ ఫుటేజీ లభ్యం కావడం, మీడియా ద్వారా కిడ్నాప్‌ వ్యవహారం వైరల్‌ కావడంతో కిడ్నాపర్లు జడిసి బాబును విడిచిపెట్టి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. కిడ్నాపర్ల ఆచూకీ ఇంకా లభ్యం కాకపోవడంతో దర్యాప్తు కొనసాగిస్తామని ఎస్పీ తెలిపారు. కిడ్నాపర్లు జసిత్‌ను విడిచిపెట్టిన ఇటుకల బట్టీ వద్దకు ఎస్పీ వెళ్లి బట్టీ యజమాని, కార్మికులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. బుధవారం రాత్రి 12.50 గంటల సమయంలో రెండు మోటారు సైకిళ్లపై నలుగురు వ్యక్తులు వచ్చి జసిత్‌ను ఇటుకల బట్టీ వద్ద దింపివెళ్లినట్టు సమాచారం. 1.30 గంట ప్రాంతంలో వారు తిరిగి వెళ్లడం సీసీ కెమెరాల్లో పోలీసులు గుర్తించినట్టు తెలిసింది. 

క్రికెట్‌ బెట్టింగ్‌పై అనుమానాలు
సంఘటన తీరును బట్టి క్రికెట్‌ బెట్టింగ్‌ కారణమై ఉంటుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తండ్రి వెంకటరమణ బెట్టింగ్‌లో నష్టపోయి సొమ్ములు చెల్లించకపోవడంతో బుకీలు కిడ్నాప్‌కు పాల్పడి ఉంటారని తెలుస్తోంది. మండపేట, కుతుకులూరు ప్రాంతంలో క్రికెట్‌ బెట్టింగ్‌ కార్యకలాపాలు ఎక్కువగా జరుగుతుండడం ఈ అనుమానాలకు బలం చేకూరుస్తోంది. కాగా క్రికెట్‌ బెట్టింగ్‌ ఆరోపణలను తండ్రి వెంకటరమణ ఖండించారు. తాను ఎప్పుడూ బెట్టింగ్‌ ఆడలేదని, క్రికెట్‌ మాత్రమే ఆడతానని తెలిపారు. 

కిడ్నాప్‌ మిస్టరీ వీడేనా?
బాలుడు క్షేమంగా ఇంటికి చేరినా కిడ్నాప్‌కు గల కారణాలు ఇంకా మిస్టరీగానే మిగిలాయి. ఎవరు చేశారో? ఎందుకు చేశారో.. వారి ఉద్దేశమేంటో.. కారణమేంటనే విషయమై కొలిక్కిరాలేదు. క్రికెట్‌ బెట్టింగ్‌ వ్యవహారంపైనే పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నట్టు తెలిసింది. రాయవరం మండలం లొల్ల, లేదా అనపర్తి మండలం కుతుకులూరులోని ఒక చిన్న ఇంటిలో జసిత్‌ను ఉంచినట్టు పోలీసులు గుర్తించినట్టు సమాచారం. కాగా రెండు రోజుల్లో నిందితులను అదుపులోకి తీసుకుంటామని ఎస్పీ అస్మి మీడియాకు తెలిపారు. 

ఎవరా రాజు? 
కిడ్నాపర్లలో ఒకరి పేరు రాజు అని జసిత్‌ చెబుతున్నాడు. అతనే తనను తీసుకువచ్చి విడిచిపెట్టాడంటున్నాడు. ఇరువురు వ్యక్తులు తనను ఎత్తుకెళ్లినట్టు చెబుతున్న జసిత్‌ వారిలో ఒకరి పేరు రాజు అని స్పష్టం చేస్తున్నాడు. ఈ రాజు ఎవరనేది మిస్టరీగా మారింది. తనను ఒక చిన్న ఇంటిలో ఉంచారని, అక్కడ ఆంటీతోపాటు ఒక బాబు కూడా ఉన్నట్టు చెబుతున్నాడు. రోజూ తనకు ఇడ్లీ పెట్టేవారని, ఒక సారి పెరుగు అన్నం పెట్టారని, తనను కొట్టలేదని చెప్పాడు జసిత్‌. మమ్మీ డాడీ కావాలని నేను ఏడుస్తుంటే రాజు తనను రాత్రి సమయంలో ఇటుకల బట్టీ వద్దకు తీసుకువచ్చి కాలకృత్యానికి వచ్చిన వ్యక్తి వద్ద విడిచిపెట్టి వెళ్లిపోయాడని చెప్పాడు. 

డిప్యూటీ సీఎం బోస్‌ సమీక్ష 
అసెంబ్లీ సమావేశాల్లో ఉన్న ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ కేసు దర్యాప్తుపై ఎప్పటికప్పుడు పోలీసులతో సమీక్షించారు. తల్లిదండ్రులను పరామర్శించి ధైర్యం చెప్పారు. త్వరితగతిన కేసును ఛేదించాలని పోలీసులను ఆదేశిస్తూ ప్రభుత్వ పరంగా అవసరమైన సహకారం అందించారు. 

చిచ్చర పిడుగు జసిత్‌ 
నాలుగేళ్లు.. సరిగా మాటలు కూడా చెప్పలేని వయస్సు. ఎవరినైనా చూస్తే భయపడిపోవడమో.. బిడియపడిపోవడమో చేయడం సర్వసాధారణం. కాని జసిత్‌ అలా కాదు. చిచ్చరపిడుగు. అందగాడే కాదు.. మంచి మాటకారి కూడా. కళ్లెదుటే నానమ్మపై దాడిచేసి తనను బలవంతంగా ఎత్తుకెళ్లిపోయారు. తల్లిదండ్రులకు దూరంగా అపరిచిత వ్యక్తుల మధ్య మూడు రోజులు గడిపాడు. అర్ధరాత్రి సమయంలో చిమ్మ చీకటిలో కిడ్నాపర్లు తీసుకువచ్చి ఇటుకల బట్టీ కార్మికుడి సమీపంలో విడిచిపెడితే అతని వద్దకు పరుగు తీశాడు. రాత్రంతా వారి మధ్యనే గడిపాడు. తనను చేరిదీసిన బట్టి కార్మికులను ఆకలేస్తోందంటూ అడిగి మరీ ఇడ్లీ తిన్నాడు. గురువారం ఉదయం జసిత్‌ను ఎస్పీ నయీం అస్మి ఎత్తుకుని  ఇంటికి తీసుకువచ్చి అప్పగించారు. తల్లిదండ్రులను ముద్దులతో ముంచెత్తిన జసిత్‌ మీడియా అడిగిన ప్రశ్నలకు తడుముకోకుండా సమాధానాలు చెబుతున్న తీరు అందరినీ మంత్ర ముగ్ధుల్ని చేసింది. లిటిల్‌ హీరో అంటూ పోలీసులు, మీడియా ప్రతినిధులు, స్థానికులు జసిత్‌ను ఎత్తుకుని సెల్ఫీలు దిగి మురిసిపోయారు.   

కనుగులవలస, శ్రీహరిపురం గ్రామాల్లో బంధువుల ఆనందం 
ఆమదాలవలస: మండపేటలో కిడ్నాప్‌కు గురైన జసిత్‌ గురువారం క్షేమంగా ఇంటికి చేరడంతో ఆమదాలవలస మండలం కనుగులవలస, శ్రీహరిపురం గ్రామాల్లో బంధువులు ఆనందంలో మునిగిపోయారు. మూడు రోజులుగా కంటి నిండా నిద్ర లేకుండా గడుపుతున్న బాలుడి మేనమామలు చింతాడ యర్రయ్య, శ్రీనివాసరావు, తాత, అత్తలు ఊపిరిపీల్చుకున్నారు. జసిత్‌ తల్లిదండ్రుల స్వగ్రామాల్లో మూడు రోజులుగా మండపేట పోలీసులు, క్రైమ్‌ బృందాలు దర్యాప్తు చేయడంతో ఇక్కడ అలజడి మొదలైంది. చివరకు క్షేమంగా ఇంటికి రావడంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే మండపేట పోలీసులు మాత్రం ఇంకా తమ దర్యాప్తు కొనసాగిస్తూనే ఉన్నారు. కిడ్నాప్‌ ఛేదించేందుకు కేసు దర్యాప్తు వేగవంతం చేస్తున్నట్లు సమాచారం. 

తండ్రికి సమాచారం ఇచ్చాం
మా బట్టీలో పనిచేసే ఏసు ఫోన్‌ చేసి చెప్పడంతో తెల్లవారుజాము 4 గంటల సమయంలో బట్టీ వద్దకు వెళ్లి బాలుడిని చూశాను. కిడ్నాప్‌ అయిన కుర్రాడేనని గుర్తించాను. వాట్సప్‌ వాడకం తెలీక మా తోడల్లుడి కుమారునికి చెబితే అతను వచ్చి జసిత్‌ ఫొటో తీసి అతని తండ్రికి పంపి ఫోన్‌చేసి చెప్పారు. వీడియోకాల్‌ చేయాలని కోరితే వీడియో కాల్‌ చేసి అతని తండ్రికి చూపించాము. ఆకలి వేస్తోందని చెబితే ఇడ్లీ తెప్పించి పెట్టాను.  కర్రి కృష్ణారెడ్డి, ఇటుకల బట్టీ యజమాని, కుతుకులూరు. 

చాలా ఆనందంగా ఉంది 
చాలా ఆనందంగా ఉంది. నా బాబు క్షేమంగా ఇంటికి చేరుకోవడంతో మూడు రోజులుగా పడుతున్న నరకయాతనను మరిచిపోయాను. కిడ్నాప్‌ జరిగిన రోజున నాలో నేను లేను. ఎక్కడున్నాడో? ఎలా ఉన్నాడో? ఏమైనా తిన్నాడో లేదోనని కంటిమీద కునుకులేకుండా గడిపాను. బాబు దొరికాడని తెల్లవారుజామున తెలియగానే ప్రాణం లేచి వచ్చింది. క్షేమంగా ఇంటికి చేరిన వాడిని చూడగానే మాటల్లో చెప్పలేని ఆనందం కలిగింది. ఇక ముందు వాడిని చాలా జాగ్రత్తగా చూసుకుంటాను. కిడ్నాప్‌ ఎందుకు చేశారో తెలీదు. పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. సహకరించి అండగా నిలిచిన పోలీస్, మీడియా, సహచర సిబ్బంది, ఇటుకల బట్టీ యజమాని, కార్మికులు అందరికీ కృతజ్ఞతలు.   నాగావళి, జసిత్‌ తల్లి. 

నా వద్దకు పరుగెడుతూ వచ్చాడు
రాత్రి 1 గంట సమయంలో కాలకృత్యం కోసం నేను బయటకు వచ్చాను. ఈ కుర్రాడు నా వద్దకు పరుగెట్టుకుని వచ్చి నన్ను గట్టిగా పట్టుకున్నాడు. కొద్ది దూరంలో ఇరువురు వ్యక్తులు చీకట్లో మోటారుసైకిల్‌పై ఉండటాన్ని గమనించాను. ఒకరు హెల్మెట్‌ ధరించి ధరించి, మరొకరు మాస్క్‌ ధరించి ఉన్నారు. కుర్రాడు నా వద్దకు వచ్చిన తర్వాత వారు అక్కడి నుంచి వేగంగా వెళ్లిపోయారు. ఎన్‌.ఏసు, ఇటుకలబట్టీ కార్మికుడు, లొల్ల, రాయవరం మండలం. 

సీఎం జగన్‌మోహన్‌రెడ్డికి కృతజ్ఞతలు 
మా బాబు సురక్షితంగా ఇంటికి చేరుకోవడంలో సహకరించిన సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి కృతజ్ఞతలు. స్వయంగా ఆయనే ఎస్పీ నయీం అస్మికి ఫోన్‌చేసి కిడ్నాప్‌పై ఆరా తీసి త్వరితగతిన కేసును ఛేదించాలని ఆదేశించినట్టు తెలిసింది. థాంక్స్‌ టూ సీఎం సర్‌. ఎవరు కిడ్నాప్‌ చేశారో? ఎందుకు చేశారో తెలీడం లేదు. పోలీసులు పెద్ద ఎత్తున విచారణ చేస్తుండటం, మీడియా ప్రచారంతో కిడ్నాపర్లు జడిసి బాబును విడిచిపెట్ట ఉంటారని భావిస్తున్నాం.   వెంకటరమణ, జసిత్‌ తండ్రి 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top