రికార్డుల్లోకి నేర ‘చరిత్ర’

State-level biometric criminal data system - Sakshi

     డీజీపీ చైర్మన్‌గా ‘రాష్ట్రస్థాయి బయోమెట్రిక్‌ క్రిమినల్‌ డేటా వ్యవస్థ’

     త్వరలోనే ఏర్పాటుకు ప్రణాళికలు రూపకల్పన

     తొలిదశలో పది వేల మంది నేరస్తుల సమగ్ర సమాచారం నిక్షిప్తం

     మలిదశలో 50 వేల మంది టార్గెట్‌

     కీలక శాఖల సమన్వయంతో ఏపీ పోలీస్‌ కొత్త టెక్నిక్‌

     ఎక్కడ ఏ నేరం జరిగినా ఇట్టే పట్టుకుని శిక్షపడేలా చేయడం కోసం కసరత్తు  

సాక్షి, అమరావతి: నేరం జరిగిన తీరును బట్టే ఎవరు చేశారో ఓ అంచనా వేయొచ్చు.. చిన్నపాటి క్లూ దొరికితే చాలు నేరస్తుడిని ఇట్టే పట్టేయవచ్చు.. పట్టుకున్న క్రిమినల్‌కు కచ్చితంగా శిక్ష పడేలా కీలక ఆధారాలు సేకరించవచ్చు.. ఆశ్చర్యంగా ఉందా? ఏపీ పోలీసులు ఇప్పుడు ఇదే తరహా కొత్త వ్యూహానికి పదును పెడుతున్నారు. మారుతున్న కాలంతో పాటు నేరస్తులు పోటీ పడుతున్నా.. వారికి చెక్‌ పెట్టడంలో పోలీసులు మాత్రం వెనుకబడుతున్న లోపాన్ని గుర్తించారు.

ఈ నేపథ్యంలోనే ఇటీవల నేర పరిశోధన, దర్యాప్తునకు దోహదం చేసే రాష్ట్రస్థాయి అధికారుల కీలక సమావేశం నిర్వహించారు. నేర ‘చరిత్ర’ను సృష్టించే ఆధునిక పద్ధతికి శ్రీకారం చుట్టాలని నిర్ణయించారు. డీజీపీ చైర్మన్‌గా ఉండే రాష్ట్రస్థాయి బయోమెట్రిక్‌ క్రిమినల్‌ డేటా వ్యవస్థ(ఏపీ స్టేట్‌ లెవెల్‌ బయోమెట్రిక్‌ క్రిమినల్‌ డేటా ఇండెక్సింగ్‌ సిస్టమ్‌)కు రూపకల్పన చేస్తున్నారు. ఇందుకోసం నేర పరిశోధనలలో కీలకపాత్ర పోషించే పలు శాఖలను ఒకే గొడుకు కిందకు తెచ్చి ‘సమగ్ర ఫోరెన్సిక్‌ ఆధార సంస్థ’గా పనిచేయిస్తారు. దీనిలో భాగంగా తొలిదశలో పది వేల మంది నేరస్తుల పూర్తి సమాచారాన్ని సేకరిస్తారు. మలి విడతలో 50 వేల మంది నేరస్తుల చరిత్రను నిక్షిప్తం చేయనున్నారు.

ఏయే వివరాలు సేకరిస్తారు?
రాష్ట్రంలో పలు కేసుల్లో శిక్ష పడినవారు, పలు కేసులు విచారణలో ఉన్నవాళ్లు, అరెస్టులు అయినవాళ్లు, బెయిల్‌పై ఉన్నవాళ్లు, అనుమానితుల పూర్తి సమాచారాన్ని బయోమెట్రిక్‌ క్రిమినల్‌ డేటాలో పొందుపరుస్తారు. ప్రధానంగా వాళ్ల వేలిముద్రలు, హస్తముద్రలు, పాదముద్రలు, సంతకాలు, చేతి వ్రాత, స్వర నమూనాలు, నడక, ఆలోచన ధోరణి, బాడీ లాంగ్వేజ్, ఫోన్‌ మాట్లాడే తీరు, తల వెంట్రుకలు, శరీరంపై మచ్చలు, డీఎన్‌ఏ తదితర అన్ని నమూనాలతోపాటు ఫొటోలు, వీడియో షాట్‌లు రికార్డు చేస్తారు. వారు పుట్టిన ప్రాంతం, ఆధార్, పాన్‌కార్డు, డ్రైవింగ్‌ లైసెన్సు, మొబైల్‌ నంబర్, ల్యాండ్‌ ఫోను నంబర్, నివాసం ఎక్కడ, కుటుంబ సభ్యుల వివరాలు, వారితో కలిసి ఉండే వారి వివరాలను వాటితో జతచేస్తారు. క్రిమినల్స్‌ గత నేర చరిత్ర, ప్రస్తుత స్థితిగతులు, శిక్షలు, వీడిపోయిన కేసులు, బెయిల్‌ ఇచ్చిన వారు, ఏఏ కేసుల్లో సాక్షిగా ఉన్నారు, డిఫెన్సు లాయర్‌ ఎవరు అనే వివరాలతోపాటు పోలీస్‌ రికార్డుల్లోని వివరాలను కూడా ఆన్‌లైన్‌ బయోగ్రఫిక్‌లో చేరుస్తారు. వీటిని కేసుల్లో పురోగతి, దర్యాప్తు, విచారణకు దోహదం చేసేలా ఉపయోగించుకోనున్నారు.

వైఫల్యాల నుంచి పాఠాలు
వాస్తవానికి ఏపీలో ఫోరెన్సిక్‌ విభాగంలో పోలీసులకు కావాల్సిన సాక్ష్యాలను బలపరిచే సరైన వ్యవస్థ లేదు. నేరస్తులను పట్టుకోవడంలోను, తగిన ఆధారాలు సేకరించడంలోను, వారికి శిక్షలు పడేలా చేయడంలోను ఘోర వైఫల్యం కన్పిస్తోంది. ఫలితంగా నేరస్తులు తప్పించుకోవడం, ఒక్కోసారి నేరం చేయనివారు కూడా బాధితులుగా మారడం జరుగుతోంది. ఇలాంటి లోపాలను ఇప్పటికే అధిగమించిన అమెరికా లాంటి దేశాలు ఫోరెన్సిక్‌ వ్యవస్థను బలోపేతం చేసుకుని నేరస్తులకు చెక్‌ పెట్టగలుగుతున్నాయి. ఇటీవల అట్లాంటాలో క్రైమ్, ఫోరెన్సిక్‌ ల్యాబ్‌లపై సదస్సుకు ఏపీ పోలీసు ప్రతినిధులు హాజరయ్యారు. అభివృద్ధి చెందిన దేశాలతో పోల్చితే నేరాలు చేసిన వాళ్లను పట్టుకోవడం, శిక్షలు పడేలా చేయడంలో మనం ఎక్కడ విఫలమవుతున్నామనో తెలుసుకోగలిగారు. దేశంలోను, రాష్ట్రంలోనూ ఫోరెన్సిక్‌ మెడిసిన్, ఫింగర్‌ ప్రింట్, ఎక్సైజ్, నార్కోటిక్స్, డ్రగ్‌ మొదలైన వాటి ద్వారా ఎన్నో సంచలన కేసుల్లో నేరస్తుల ఆటకట్టించవచ్చని గుర్తించారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల డీజీపీ అధ్యక్షతన కీలక అధికారుల సమావేశంలో ‘భిన్న విభాగాల సమూహం(మల్టీ డిపార్టుమెంటల్‌ వర్కింగ్‌ గ్రూపు)’తో ఇంటిగ్రేటెడ్‌ ఫోరెన్సిక్‌ ఎవిడెన్స్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌(సమగ్ర ఫోరెన్సిక్‌ సాక్ష్యాధార వ్యవస్థ)కు రూపకల్పన చేయాలని నిర్ణయించారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top