
మాచర్ల మాజీ మున్సిపల్ చైర్మన్ తురకా కిషోర్ అరెస్ట్ వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. అరెస్టుకు కారణం ఏంటన్నది ఎక్కడా పోలీసులు ప్రస్తావించలేదని, అలాంటప్పుడు అది ఇల్లీగల్ అరెస్ట్ అవుతుంది కదా అని వ్యాఖ్యానించింది.
సాక్షి, అమరావతి: వైఎస్సార్‌సీపీ నేత, మాచర్ల మాజీ మున్సిపల్ చైర్మన్ తురకా కిషోర్ తరఫున దాఖలైన హెబియస్ కార్పస్ పిటిషన్‌పై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా అరెస్ట్‌పై కీలక వ్యాఖ్యలు చేసిన అత్యున్నత న్యాయస్థానం.. అదే సమయంలో రిమాండ్ రిపోర్టును పరిశీలిస్తూ మెజిస్ట్రేట్ల తీరుపైనా అసహనం వ్యక్తం చేసింది.
‘‘ఈ కేసులో గ్రౌండ్ ఆఫ్ అరెస్ట్(అరెస్టుకు కారణం) ఎక్కడుంది?. గ్రౌండ్స్ ఆఫ్ అరెస్టు ఓరల్‌గా(నోటిమాటగా) చెప్తే కుదరదు. గ్రౌండ్స్ ఆఫ్ అరెస్టుకు సంబంధించి ఇన్ రిటర్న్‌గా(రాతపూర్వకంగా) సర్వ్ చేయాలి. లేకపోతే అది ఇల్లీగల్ అరెస్ట్ అవుతుంది’’ అని పోలీసులను ఉద్దేశించి వ్యాఖ్యానించింది. అదే సమయంలో..
తురకా కిషోర్ పై పెట్టిన అక్రమ కేసులు లిస్టు చదివి వినిపించిన ధర్మాసనం.. 3, 4, 5 , 6 ఏళ్ల కిందటి నాటి ఘటనల్లో తాజాగా కేసులు నమోదు చేశారంటూ వ్యాఖ్యానించింది. ‘‘ఎఫ్ఐఆర్లు నమోదు చేసి వెంటనే పీటీ వారెంట్లు వేసి అరెస్టు చేశారు. మరీ అంత అర్జెంటుగా పీటీ వారెంట్‌లో వేయాల్సిన అవసరం ఏముంది?. రెంటచింతల కేసులో పోలీసులు అంత అర్జెంటుగా అరెస్టు ఎందుకు అరెస్ట్ చేశారు?. అసలు రెంటచింతల కేసులో రిమాండ్ రిపోర్టు అర్థం కావటం లేదు. తప్పు మీది కాదు... తప్పు అంతా మాదే. మేజిస్ట్రేట్లకు సరైన శిక్షణ ఇవ్వలేకపోయాం’’ అని అసహనం వ్యక్తం చేసిన ధర్మాసనం తదుపరి విచారణ రేపటికి(గురువారానికి) వాయిదా వేసింది.
అన్ని కేసుల్లో(12) బెయిల్ రావడంతో తురకా కిషోర్ జులై 30వ తేదీన ఉదయం గుంటూరు జైలు నుంచి విడుదలయ్యారు. అయితే అనూహ్యంగా ఎంట్రీ ఇచ్చిన పోలీసులు.. కుటుంబ సభ్యులను నెట్టిపడేసి మరీ బలవంతంగా ఆయన్ని లాక్కెల్లారు. ఏడు నెలల తర్వాత కోర్టులు ఊరట ఇవ్వడంతోనే ఆయన విడుదల అయ్యారని, అయినప్పటికీ పోలీసులు అక్రమ నిర్బంధానికి పాల్పడ్డారంటూ కుటుంబ సభ్యులు హైకోర్టును ఆశ్రయించారు.