ఆ నోట్ల కట్టలు నోళ్లు తెరిస్తే..? | Sakshi Editorial On Chandrababu Govt SIT alleges liquor case 11 Crores | Sakshi
Sakshi News home page

ఆ నోట్ల కట్టలు నోళ్లు తెరిస్తే..?

Aug 3 2025 12:27 AM | Updated on Aug 3 2025 12:27 AM

Sakshi Editorial On Chandrababu Govt SIT alleges liquor case 11 Crores

జనతంత్రం

చాలా విషయాలు బయటకొస్తాయి. ఆ నోట్ల కట్టలపై నిజాయితీగా విచారణ జరిగితే మద్యం కేసు కడుపులో దాక్కున్న గుట్టు రట్టవుతుంది. కట్టు కథలు ఎవరు చెబుతున్నారో, పుక్కిటి పురాణాలను ఎవరు వల్లెవేస్తున్నారో తేలిపోతుంది. అంతేకాదు, అపవిత్ర రాజకీయ మైత్రీబంధాల బండారం కూడా బద్దలు కావచ్చు. పన్నెండు అట్టపెట్టెల్లోని 11 కోట్ల సంగతి ఇది.

ఆంధ్రప్రదేశ్‌ పోలీసుల సిట్‌ బృందం చెప్పిన లెక్క. జగన్‌ ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన ఎక్సైజ్‌ పాలసీలో కుంభ కోణం ఉన్నదని దర్యాప్తు కోసం సీఐడీకి అప్పగించి ఏడాది పూర్తయింది. ‘సిట్‌’ రంగప్రవేశం చేసి ఆరు నెలలయింది. ఈ మధ్యనే ఒక అసంపూర్ణ ఛార్జిషీట్‌ వేశారు. ఆయన చెప్పాడని ఈయన పేరు, ఈయన చెప్పాడని ఆయన పేరు చొప్పున ఓ నలభై ఎనిమిది మందిని ఇందులో నిందితులుగా చేర్చారు.

త్వరలో ఇంకో చార్జిషీట్‌ను వేస్తారట! అందులో ఇంకొంత మందిని చేరుస్తారేమో! ఈ కుంభకోణం ద్వారా ఆనాటి ప్రభుత్వం 3,500 కోట్ల రూపాయల మేరకు అవినీతికి పాల్పడిందని సిట్‌ ఆరోపిస్తున్నది. నిందితులుగా నమోదైన వారిలో కొందరి చేత నయానో భయానో తమ స్క్రిప్టుకు అనుకూలంగా చెప్పించుకుంటున్నారనీ, కొందరు చెప్పిన వాఙ్మూలాలకు విరుద్ధంగా రాసుకొని బలవంతంగా సంతకాలు తీసుకుంటున్నారనీ వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. 

ఈ రకమైన వాఙ్మూలాల మీదనే కథ నడిపిస్తున్నారు తప్ప ఇంతవరకూ తమ ఆరోపణలకు బలం చేకూర్చే వస్తుగతమైన, సాంకేతికమైన, లిఖిత పూర్వకమైన ఆధారాలేవీ సిట్‌ సంపాదించలేక పోయిందనేది యథార్థం. ఇక తుది ఛార్జిషీట్‌ను వేయవలసిన దశలో 12 అట్టపెట్టెలు, 11 కోట్ల నోట్ల కట్టలు అనే వృత్తాంతాన్ని ముందుకు తెచ్చింది.

వరుణ్‌ అనే నిందితుడు ఇచ్చిన సమాచారం మేరకు హైదరాబాద్‌ శివార్లలోని ఒక ఫామ్‌హౌస్‌లో ప్రధాన నిందితు డైన రాజ్‌ కేసిరెడ్డి ఆదేశాలతో దాచిపెట్టిన 11 కోట్ల రూపాయలను గత బుధవారం సీజ్‌ చేసినట్టు న్యాయస్థానానికి సిట్‌ చెప్పింది. 2024 జూన్‌లోనే తాము ఈ డబ్బును అక్కడ పెట్టి నట్టు కూడా వరుణ్‌ చెప్పినట్టు సిట్‌ తెలియజేసింది. ఈ 11 కోట్లు కూడా లిక్కర్‌ కుంభకోణం డబ్బేనని సిట్‌ వాదన. దీనిపై స్పందిస్తూ రాజ్‌ కేసిరెడ్డి కోర్టులో ఒక పిటిషన్‌ వేశారు. 

సిట్‌ సీజ్‌ చేసినట్టు చెబుతున్న ఫామ్‌హౌస్‌ తీగల విజయేందర్‌రెడ్డి అనే వ్యాపారవేత్తదని, ఆయన టర్నోవర్‌ కోట్ల రూపాయల్లో ఉంటుందని కూడా కేసిరెడ్డి తన పిటిషన్‌లో తెలిపారు. విజయేందర్‌రెడ్డికి చెందిన ఒక ఆస్పత్రిలో తన భార్య చిన్న భాగస్వామి మాత్రమేనని, అంతకుమించి ఆ ఫామ్‌హౌస్‌తో తనకు ఎటువంటి సంబంధం లేదని ఆయన వాదించారు. 

సీజ్‌ చేసిన సొమ్ముకూ, తనకూ ఎటువంటి సంబంధం లేదని చెబుతూ 2024 జూన్‌ నుంచి ఫామ్‌హౌస్‌లో ఉంచినట్టు చెబుతున్న నోట్లను వీడియో తీయించాలని, ఆ సీరియల్‌ నెంబర్ల ఆధారంగా ఆ నోట్లను ఎప్పుడు విడుదల చేశారో రిజర్వు బ్యాంకు ద్వారా సమాచారం తెప్పించుకోవాలని ఆయన అభ్యర్థించారు. 2024 జూన్‌ తర్వాత విడుదల చేసినట్టు తేలితే ప్రాసిక్యూషన్‌ కథనం తేలిపోతుందనీ, తనకు న్యాయం జరుగుతుందనీ ఆయన వాదించారు. 

దీనిపై జడ్జి స్పందిస్తూ ఆ నోట్ల కట్టలను ఫోటోలు తీయించాలని దర్యాప్తు అధికారిని ఆదేశించారు. ఫోటోలు, వీడియోలు తీయకుండానే ఆ నోట్ల కట్టలను సిట్‌ బ్యాంకులో డిపాజిట్‌ చేసే ప్రయత్నం చేస్తున్నదని, దాన్ని అడ్డుకోవాలని, కోర్టు కమిషన్‌ ఆధ్వర్యంలో వీడియో తీయించాలని కేసిరెడ్డి న్యాయవాదులు శనివారం నాడు మరో పిటిషన్‌ వేశారు. తాము అప్పటికే కోర్టులో నగదు డిపాజిట్‌ చేశామని దర్యాప్తు అధికారి కోర్టుకు చెప్పారు. 

అలా చేసి వుంటే ఆ లావాదేవీ తాలూకు కౌంటర్‌ ఫాయిల్‌ చూపెట్టాలని కేసిరెడ్డి న్యాయవాదులు డిమాండ్‌ చేశారు. దర్యాప్తు అధికారి ఇప్పుడు తన దగ్గర లేదన్నారు. కనీసం వాట్సాప్‌లోనైనా పంపించాలని వారు కోరారు. చాలాసేపటి వరకు ఎటువంటి వాట్సాప్‌ సమాచారం రాలేదు. అంటే బ్యాంకులో డిపాజిట్‌ చేయకుండానే చేసినట్టు కోర్టులో సిట్‌ చెప్పి ఉండాలి. 

పిటిషన్‌ విచారించిన జడ్జి కీలకమైన ఆదేశాలను సిట్‌కు, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాకు జారీ చేశారు. సదరు 11 కోట్లను ప్రత్యేకంగా ఉంచాలనీ, మిగతా డబ్బుతో కలపొద్దనీ చెప్పారు. అలాగే పంచనామా చేసి ఆ నోట్ల సీరియల్‌ నంబర్లను నమోదు చేయాలని, ఈ ప్రక్రియను వీడియో తీయాలని సిట్‌కు ప్రత్యేకంగా తెలిపారు.

ఆ నోట్లను వీడియో తీయాలని ముందురోజు జడ్జి చెప్పినప్పటికీ, లెక్క చేయకుండా ఆ నోట్లను హడావిడిగా బ్యాంకులో డిపాజిట్‌ చేశామని ఎందుకు చెప్పినట్టు? ఒకసారి బ్యాంకులో డిపాజిట్‌ చేసిన తర్వాత, ఆ సొమ్ము మిగతా డబ్బులో కలిసిన తర్వాత దానిపై విచారణ కుదరదనే ఎత్తుగడను వేశారని అనుకోవాలా? సిట్‌ వ్యవహరించిన తీరు పారదర్శకంగా లేదు. న్యాయబద్ధంగా దర్యాప్తు చేస్తున్నట్టుగా లేదు. 

ఈ కేసులో ఇంతవరకూ ఒక్క సాక్ష్యాన్ని కూడా సమర్పించలేకపోయారని కోర్టు అక్షింతలు వేసినందువల్లనే ఈ గూడుపుఠాణీ జరిపినట్టు నిందితులు ఆరోపిస్తే దాన్ని పూర్వ పక్షం చేయగలరా? దర్యాప్తు సంస్థ నిష్పాక్షికంగా పని చేస్తున్నట్టయితే, కోర్టు కమిషన్‌ సమక్షంలో రిజర్వు బ్యాంకు ప్రతినిధుల సమక్షంలోనే వీడియో తీసి, నోట్ల సీరియల్‌ నెంబర్లను నమోదు చేసి అనంతరం బ్యాంకులో డిపాజిట్‌ చేసి ఉండేవారు. ఎవరూ అడగనవసరం లేదు. 

అది వారి కనీస బాధ్యత. ఈ నోట్ల కట్టల వ్యవహారంలో ఆది నుంచి అంతంవరకూ సిట్‌ వ్యవహారం తీరు పారదర్శకంగా లేదు. ‘విశ్వసనీయ’ సమాచారం మేరకు పక్క రాష్ట్రంలోకి వెళ్ళి డబ్బు సీజ్‌ చేయాల్సి వచ్చినప్పుడు ఆ రాష్ట్ర పోలీసులకు ముందస్తు సమాచారం ఇవ్వడమో, వారిని కూడా వెంటబెట్టుకుని వెళ్లడమో చేసి ఉండవలసింది. లేదంటే సీబీఐ లేదా ఈడీ వంటి కేంద్ర సంస్థలకు సమాచారం అందించి ఉండవలసింది. 

దొరికింది నల్లధనం కనుక ఆదాయం పన్ను శాఖకు కూడా సమాచారం ఇచ్చి ఉండవలసింది. దొరికిన నల్లడబ్బు ఒక పెద్ద కేసులో సాక్ష్యంగా చూపెడుతున్నారు కనుక ఈమాత్రం పారదర్శకత లేకపోతే అదొక కుట్రపూరిత వ్యవహారంగానే జనం భావిస్తారు. ఇప్పుడు ఏసీబీ కోర్టు తాజా ఆదేశాల తర్వాత సిట్‌ వారి స్క్రిప్టు ఏ మలుపులు తిరుగుతుందో చూడవలసి ఉన్నది.

పొరుగు రాష్ట్రానికి వెళ్లి కుట్రపూరిత వ్యవహారాలకు పురుడు పోయాలంటే అదీ, ఒక వాణిజ్య ప్రముఖుని ఫామ్‌హౌజ్‌ కేంద్రంగా జరిపించాలంటే స్థానిక వ్యవస్థల సహకారం లేకుండా సాధ్యపడుతుందనేది అనుమానమే. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ వ్యవస్థల మధ్య సహకార ధోరణి బాగా ఉన్నట్టే చెబుతున్నారు. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పరం సహకరించుకొని ప్రజలకు మేలు చేసే పనులు చేస్తే మంచిదే. 

కానీ ఒక ప్రభుత్వ స్వార్థ రాజకీయాలకు సాయపడే విధంగా వ్యవహరించడం, ఒక ప్రభుత్వంలోని ప్రముఖ వ్యక్తికి మేలు చేయడం కోసం ఒట్టు తీసి గట్టున పెట్టడం ప్రజల్లో చర్చకు దారితీస్తున్నాయి. ‘పుష్ప’ సినిమా విడుదల సమయంలో జరిగిన తొక్కిసలాట, అల్లు అర్జున్‌ అరెస్టు వగైరాలు తాజా సంఘటనలే. ఆ సమయంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఒక ప్రతిజ్ఞ చేశారు. 

తాను సీఎం కుర్చీలో కూర్చున్నంతకాలం సినిమా టిక్కెట్ల ధరలు పెంచడానికి, స్పెషల్‌ షోలు వేయడానికి అనుమతించబోనని ఖండితంగా చెప్పారు. జనం కూడా హర్షించారు. నాయకుడంటే ఈమాత్రం పట్టుదల ఉండాలని అభినందించారు. కానీ ఆరు నెలలు తిరిగే సరికి ఆ పట్టుదల పట్టు తప్పింది. 

‘హరిహర వీరమల్లు’ సినిమా టిక్కెట్‌ రేట్లు పెంచుకోవడానికి, స్పెషల్‌ షోలు వేసుకోవడానికి అనుమతులు లభించాయి. ఆ సినిమా హీరో పక్కరాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్న విషయం తెలిసిందే. రెండు రాష్ట్రాల మధ్య రాజకీయ, వ్యక్తిగత సహకా రాలపై పొలిటికల్‌ సర్కిల్స్‌లోనే కాదు, బ్యూరోక్రాట్లు, వ్యాపార వర్గాలు కూడా మాట్లాడుతున్నాయి.

రెండు తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ – తెలుగుదేశం పార్టీల మధ్య సహకారం కొత్తదేమీ కాదు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న సమయంలోనే జగన్‌మోహన్‌రెడ్డి కాంగ్రెస్‌ నుంచి బయటకు వచ్చి సొంత పార్టీ స్థాపించుకున్న దగ్గర నుంచి ఈ పార్టీల బంధం కొనసాగుతున్నది. ఆయన మీద కేసులు వేయడం, జైలుకు పంపించడంలోనూ కాంగ్రెసు నాయకత్వంలోని కేంద్ర – రాష్ట్ర ప్రభుత్వాలు, చంద్రబాబు నేతృత్వంలోని తెలుగుదేశం – యెల్లో మీడియాలు సమష్టిగానే పనిచేశాయి. 

రాష్ట్ర విభజన తర్వాత 2018లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకొని కాంగ్రెసు పార్టీ తన విజయావకాశాలను కాలదన్నుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు తెలంగాణ క్షేత్రస్థాయిలో కేసీఆర్‌కు మళ్లీ ఆదరణ పెరుగుతున్నదని సంకేతాలు అందుతున్న నేపథ్యంలో చంద్రబాబు సరికొత్త ఆలోచనలు చేస్తున్నట్టు సమాచారం. 

కేసీఆర్‌ను అధికారానికి దూరంగా ఉంచడం కోసం ఏపీ మాదిరిగానే టీడీపీ, జనసేనలు బీజేపీ కూటమి (ఎన్డీఏ)గా పోటీ చేస్తే ప్రయోజనమా? లేక బీజేపీని ఒక్కదాన్నే పోటీలో నిలిపి తాము వ్యూహాత్మకంగా వ్యవహరిస్తే ప్రయోజనమా అనే అంశంపై ఆయన మల్లగుల్లాలు పడుతున్నట్టు విశ్వసనీయ సమాచారం.

ఆంధ్రప్రదేశ్‌లోని కాంగ్రెస్‌ పార్టీ విభాగం ఆచరణలో ఎన్డీఏలో నాలుగో పార్టీగా వ్యవహరిస్తున్నదనే భావన సామాన్య ప్రజల్లోనే కాదు, ఆ పార్టీ కార్యకర్తల్లో కూడా ఉన్నది. ఒకపక్క రాహుల్‌గాంధీ ఎన్డీఏపై రాజీలేని పోరాటానికి కసరత్తులు చేస్తు న్నారు. ఢిల్లీ గద్దె కోసం నాలుగో పానిపట్టు యుద్ధానికి సిద్ధమవు తున్నారు. బీజేపీపై సైద్ధాంతిక పోరాటాన్ని కూడా ప్రారంభించి అస్త్రశస్త్రాలను ఆవాహన చేసుకుంటున్నారు. 

ఇదే సమయంలో బీజేపీ ముసుగులో ఉన్న ఓ రాజ్యసభ సభ్యుడు కాంగ్రెస్‌ ముఖ్య మంత్రికి మద్దతుగా రంగంలోకి దిగి రెచ్చి పోవడం కాంగ్రెస్‌ పార్టీకి మేలు చేసే విషయమైతే కాదు. బీజేపీ పార్లమెంట్‌ సభ్యుడు సీఎం రమేశ్‌కు కాంగ్రెస్‌ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి 16 వేల కోట్ల కాంట్రాక్టు ఇచ్చాడని బీఆర్‌ఎస్‌ నాయకుడు కేటీఆర్‌ ఆరోపించారు. దాన్ని ఖండించడానికి, వివరణ ఇచ్చుకోవడానికి సిఎం రమేశ్‌కు ఉన్న హక్కును ఎవరూ కాదనలేరు.

కానీ, ఆయన అంతటితో ఆగిపోకుండా బీఆర్‌ఎస్‌ బండారం బయటపెడతానని హెచ్చరించడం, బీజేపీలో తమ పార్టీని విలీనం చేయడానికి కేటీఆర్‌ తన సహాయాన్ని అర్థించాడని చెప్పడం బూమెరాంగయింది. కేసీఆర్‌ స్థాయి నేత తన పార్టీని ఒక జాతీయ పార్టీలో విలీనం చేయాలని భావిస్తే సీఎం రమేశ్‌ లాంటి వాళ్ల సహాయం అవసరమా? ఇటువంటి నాసిరకం ఆరోపణను ఎవరూ విశ్వసించకపోగా ఒకరకంగా బీఆర్‌ఎస్‌కు మేలు చేసింది. బీజేపీ – బీఆర్‌ఎస్‌ల మధ్య అవగాహన ఉన్నదని నమ్మించేందుకు కాంగ్రెస్‌ పార్టీ చేస్తున్న ప్రయత్నాలకు రమేశ్‌ ప్రకటన గండి కొట్టింది.


వర్ధెల్లి మురళి
vardhelli1959@gmail.com

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement