కళాకారుల  కడుపు కొట్టారు

Stage Artists Protest Against Tdp Govt Kadapa  - Sakshi

సాక్షి, కడప : పండుగల సమయంలో శిల్పారామాల్లో పలు సాంస్కృతిక కార్యక్రమాలను ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తారు. పౌరసంబంధాలశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటయ్యే ఈ ప్రదర్శనలకు ఆ శాఖ అధికారులే పారితోషికం చెల్లిస్తారు. రెండేళ్లుగా గత ప్రభుత్వం దీన్ని కాంట్రాక్టు పద్ధతికి మార్చింది. స్థానిక కళాకారుల్లో ఒక ప్రముఖుడికి కళా బృందాల ఎంపిక, ప్రదర్శనల బాధ్యతలు అప్పగించారు. వారు జిల్లాలోని కళాకారులకు పారితోషికం చెల్లించేవారు.

చెల్లింపులు కొద్దినెలలు బాగానే సాగాయి. రానురాను ఆలస్యమవుతూ వచ్చాయి. ‘ప్రభుత్వ సొమ్ము కదా..ఆలస్యంగానైనా వస్తుంది’ అన్న నమ్మకంతో కళాకారులు అప్పు  చేసి పెట్టుబడి పెట్టి ప్రదర్శనలు ఇచ్చారు. క్రమంగా ప్రభుత్వం కళాకారులకు పారితోషికాలు ఎగ్గొట్ట సాగింది. గత సంక్రాంతి, దసరా ఉత్సవాలను పురస్కరించుకుని శిల్పారామాల్లో సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ఎప్పటిలాగే బాధ్యతలను స్థానిక కళా ప్రముఖునికి అప్పగించారు. డబ్బులు రావని తెలిసి ముందు ప్రదర్శనలు ఇచ్చిన కళాసంస్థలు మరోమారు ఇచ్చేందుకు ఒప్పుకోలేదు. దీంతో కొత్త సంస్థలకు అవకాశం ఇచ్చారు.

ఇంకో నెల ఆలస్యమైనా ప్రభుత్వం తప్పక నిధులు ఇస్తుందన్న ఆశతో   ప్రదర్శనలు ఇచ్చారు. సాధారణంగా ప్రతి ప్రదర్శన తర్వాత శిల్పారామాల అధికారులు కళాబృందాలకు స్పాన్సర్ల ద్వారా అప్పటికప్పుడు పారితోషికం చెల్లిస్తుంటారు. మీ ప్రదర్శనలు ఆ విభాగంలోకి రావని ప్రభుత్వమే డబ్బు చెల్లిస్తుందని శిల్పారామం అధికారులు స్పష్టం చేశారు. ఈలోపు ప్రదర్శనల బాధ్యతలు తీసుకున్న కళా ప్రముఖులు ‘మీ బ్యాంకు అకౌంటు నంబరు ఇవ్వండి....ప్రభుత్వం నేరుగా మీ అకౌంటులోనే పారితోషికాలను జమ చేస్తుంది’ అని బ్యాంకు అకౌంట్‌ నంబర్లు తీసుకున్నారు.

దీంతో ఒకనెల ఆలస్యమైనా డబ్బు తప్పక వస్తుందని కళాకారులు నమ్మారు. మేకప్, సంగీతం, రవాణా, భోజనాలు, వసతి డ్రస్సులు వెరసి ఒక్కొక్క సంస్థ రూ. 12–15 వేలు ఒక్కొక్క ప్రదర్శనకు ఖర్చు చేసింది. ఇలా ఐదారు రోజులపాటు రోజూ రెండు, మూడు సంస్థల ప్రదర్శనలు సాగాయి. పలు సంస్థలు సొంత ఖర్చులు పెట్టుకుని ప్రదర్శనలు ఇచ్చారు. శ్రమ, సమయం, అప్పు తెచ్చిన పెట్టుబడి, దానిపై చెల్లిస్తున్న వడ్డీ తడిసి మోపెడు కావడంతో కళాకారులు  ఆవేదనకు లోనయ్యారు. డబ్బు ఎలా వస్తుందో? ఎవరిని అడగాలో తెలియక బాధపడుతున్నారు. అనవసరంగా అప్పుల్లో మునిగిపోయామంటూ వాపోతున్నారు. నిరుపేదలమైన తమను ప్రభుత్వమే మోసం చేస్తే ఎవరికి చెప్పుకోవాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అవినీతికి తావు లేని పాలనే ధ్యేయంగా ముందుకు సాగుతున్న కొత్త ప్రభుత్వం తమ సమస్యను సానుభూతితో పరిష్కరిస్తుందని ఆశిస్తున్నారు.పార

ఇది చంద్రన్న మోసం
నిరుపేద కళాకారులమైన తమ కష్టానికి పారితోషికాన్ని ఎగ్గొట్టడం న్యాయం కాదు.  ఆ ప్రభుత్వం తమకు రావాల్సిన మొత్తాలను ఇవ్వకుండా మోసం చేసింది. ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ జోక్యం చేసుకుని న్యాయం చేస్తారన్న ఆశ ఉంది.  
 – రాయుడు, సీనియర్‌ రంగస్థల కళాకారుడు, కడప
కడుపు కొట్టొద్దు
పనులు మానుకుని సొంత ఖర్చులతో ప్రదర్శనలు ఇచ్చాం. బిల్లులు రాకపోవడంతో వడ్డీల భారం పెరుగుతోంది. అసలు చెల్లించడం గురించిన ఆలోచన భయపెడుతోంది. నిరుపేదలమైన కళాకారుల కడుపుకొట్టిన ఏ ప్రభుత్వం మనుగడ సాధించలేదు.    
– సుబ్బరాయుడు, నటుడు, హార్మోనిస్టు, కడప 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top