‘సర్వే’జన కష్టమే

Staff Shortages In Revenue Department Chittoor - Sakshi

పీడిస్తున్న సర్వేయర్ల కొరత

మున్సిపాలిటీల్లో పోస్టులన్నీ ఖాళీ

చైన్‌మన్లూ లేకపోవడంతో అగచాట్లు

జిల్లా అధికార యంత్రాంగంలో అత్యంత కీలకమైన రెవెన్యూ శాఖకు అనుబంధంగా ఉన్న భూరికార్డుల సర్వే విభాగాన్ని సర్వేయర్ల కొరత తీవ్రంగా పీడిస్తోంది. జిల్లా వ్యాప్తంగా ఎన్నో భూముల సమస్యలు పరిష్కారంకాక పెండింగ్‌లో పడిపోయాయి.

మదనపల్లె రూరల్‌: జిల్లా రెవెన్యూ శాఖలో సర్వేయర్లు తక్కువగా ఉన్నారు. జిల్లాలో మొత్తం 66 మండలాలు 8 మున్సిపాలిటీలు, రెండు కార్పొరేషన్లు ఉన్నాయి. వీట న్నింటిలో 130 మంది దాకా సర్వేయర్లు ఉండాలి. కానీ  66మంది మాత్రమే ఉన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఒక్కో మున్సిపాలిటీలో ఇద్దరు, కార్పొరేషన్‌లోముగ్గురు, నలుగురు సర్వేయర్లు ఉండాల్సి ఉంది. మున్సిపాలిటీల్లో సర్వేయర్లకు దిక్కులేరు. డెప్యూటీ సర్వేయర్లు ద్వారా పనులు చేపడుతున్నారు.  భూముల హద్దుల గుర్తింపు కష్టతరంగా మారింది.

పెండింగ్‌లో అర్జీలు  
జిల్లా వ్యాప్తంగా (ఎఫ్‌లైన్‌ ) అర్జీలు దాదాపు 1300 వరకూ ఉన్నట్లు సమాచారం. ఇక పట్టా సబ్‌ డివిజన్‌ అర్జీలు వందల్లో అపరిష్కృతంగా ఉన్నాయి. ఎవరైనా భూముల సర్వేకు సంబంధించి రూ. 250 చలానా కట్టాలి. 30 రోజుల గడువులోగా సర్వే చేయాల్సి ఉంటుంది. కానీ సర్వేయర్ల కొరత వల్ల దాదాపు రెండు నెలలైనా పరిష్కారంకాని సమస్యలు ఎన్నో ఉన్నాయి. 

ఖాళీలివీ  
జిల్లాలో మొత్తం 66 మండలాలు ఉండగా, వీటిలో అనేక మండలాల్లో సర్వేయర్‌ పోస్టులు ఖాళీగా వున్నాయి. తిరుపతి డివిజన్‌లో 12, చిత్తూరు డివిజన్‌లో 9, మదనపల్లె డివిజన్‌లో 8 మొత్తం 29 వరకూ సర్వేయర్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయని సమాచారం.

మున్సిపాలిటీల్లో అసలు లేనేలేరు
జిల్లాలో 8 మున్సిపాలిటీలు, రెండు కార్పొరేషన్‌లు ఉన్నాయి. ఇందులో ఏ ఒక్క మున్సిపాలిటీలో కూడా ప్రత్యేకంగా సర్వేయర్లు ఉన్న దాఖాలు లేవు. మున్సిపాలిటీల్లో భూముల హద్దుల సమస్యలు ఎన్నో ఏళ్లేగా పెండింగ్‌లోనే ఉన్నాయి.

అధికంగా చైన్‌మన్ల కొరత..
జిల్లా వ్యాప్తంగా మొత్తం 12–15 మంది చైన్‌మన్లు ఉండాలి. కానీ జిల్లాలోని 66 మండలాల్లో కలిపి ఐదుగురు మాత్రమే ఉన్నారు. భూముల హద్దుల వ్వవహారంలో చైన్‌మెన్ల పాత్ర కీలకంగా ఉంటుంది. చాలా మండలాల్లో సర్వేయర్లు ప్రైవేటుగా చైన్‌మెన్లను ఏర్పాటు చేసుకుంటున్నారు.

ఒత్తిళ్లు తప్పడం లేదు  
సర్వేయర్ల కొరతతో ఎన్నో ఒత్తిళ్లు ఎదుర్కొంటున్నాం. ఫస్ట్‌గ్రేడ్‌ మున్సిపాలిటీలో 35 వార్డులు, మండలంలో 16 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. సర్వేయర్లు తక్కువగా ఉండటం వల్ల ప్రైవేటు సర్వేయర్ల సహాయం తీసుకోవాల్సి ఉంది. డివిజన్‌ కేంద్రమైన మదనపల్లెలో ఒకే సర్వేయర్‌ ఉండటంతో పనిభారం ఎక్కువగా ఉంటోంది.––రంగస్వామి, తహసీల్దార్, మదనపల్లె

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top