పంచాయతీలు 920 కార్యదర్శులు 502 మంది..

Staff Shortage in Vizianagaram Panchayath - Sakshi

పంచాయతీలకు కార్యదర్శుల కొరత

అదనంగా బీఎల్‌ఓ బాధ్యతలు

మూతపడి ఉంటున్న పంచాయతీ కార్యాలయాలు

ప్రజలకు తప్పని ఇబ్బందులు

విజయనగరం రూరల్‌: పల్లెలే ప్రగతికి పట్టుగొమ్మలు.. గ్రామాల అభివద్ధిలో పంచాయతీరాజ్‌ వ్యవస్థ అత్యంత కీలకం.. గ్రామీణ ప్రజలకు ప్రభుత్వపరంగా ఎటువంటి అవసరం వచ్చినా అందుబాటులో ఉండాల్సింది పంచాయతీ కార్యదర్శులే.. అటు ప్రభుత్వానికి ఇటు ప్రజలకు మధ్య వారధిగా కీలకమైన పనులు నిర్వహించడంలో గ్రామ పంచాయతీ కార్యదర్శులదే ప్రధానపాత్ర. అయితే పంచాయతీల్లో కార్యదర్శల కొరత వేధిస్తుండడంతో ఒక్కో కార్యదర్శికి రెండు, మూడు పంచాయతీల చొప్పున  అదనపు బాధ్యతలు అప్పగించడంతో కార్యదర్శులు ప్రజలకు అందుబాటులో లేకుండాపోతున్నారు.

సగం మంది కూడా లేరు..
జిల్లాలోని 920 గ్రామ పంచాయతీలుంటే  502 గ్రామ పంచాయతీలకే గ్రామ కార్యదర్శులు ఉన్నారు. దీంతో ఒక్కో కార్యదర్శికి రెండు, మూడు పంచాయతీల బాధ్యతలు అప్పగిస్తున్నారు. రెండేసి పంచాయతీల్లో విధులు నిర్వహించడంతో కార్యదర్శులపై పనిభారం పడుతోంది. దీంతో పాటు ప్రభుత్వ కార్యక్రమాలు, పింఛన్ల పంపిణీ, గ్రామ పంచాయతీల్లో నిర్వహించే ప్రతీ పనినీ ఆన్‌లైన్‌ చేయడం, మండల పరిషత్‌ కార్యాలయంలో సమావేశాలతో వీరిపై మరింత పనిభారం పడుతోంది. సార్వత్రిక ఎన్నికల వేళ ఒక్కో కార్యదర్శి గ్రామ పంచాయతీలు, వార్డుల్లో బీఎల్‌ఓలుగా విధులు నిర్వహిస్తున్నారు. రెండేసి గ్రామాల్లో విధులు నిర్వహించాల్సి రావడంతో ఒక్కోసారి గ్రామాల్లో పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండే అవకాశమే ఉండడం లేదు. పనిభారంతో కనీసం కుటుంబ సభ్యులతో గడపలేకపోతున్నామని కార్యదర్శులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  

రాజకీయ ఒత్తిళ్లు..
ఒకపక్క పనిభారంతో ఎలాగోలా నెట్టుకొస్తున్న పంచాయతీ కార్యదర్శులపై అధికార పార్టీ నాయకులు, జన్మభూమి కమిటీ సభ్యులు ఒత్తిడి తీసుకువస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా పనులు  చేయాలని టీడీపీ నాయకులు ఒత్తిడి తీసుకువస్తుండడంతో పంచాయతీకార్యదర్శలు  బెంబేలెత్తిపోతున్నారు. ఈ విషయం ఉన్నతాధికారులకు తెలిసినా జన్మభూమి కమిటీలు రాజ్యాంగేతర శక్తులుగా తయారు కావడంతో వారు కూడా ఏమీ చేయలేక చేతులెత్తేస్తున్నారు.  

పడకేస్తున్న పారిశుద్ధ్యం
పంచాయతీల్లో ఈ పాలన చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది.ఈ మేరకు కంప్యూటర్లు, ప్రింటర్లు కూడా కేటాయించారు. అయితే నెట్‌ సౌకర్యం లేకపోవడంతో కార్యదర్శులు ప్రతి పనికీ మండల పరిషత్‌ కార్యాలయానికి వెళ్లాల్సి వస్తోంది. కార్యదర్శులు గ్రామాల్లో అందుబాటులో ఉండకపోవడంతో పారిశుద్ధ్య అధ్వానంగా మారింది. ప్రస్తుతం ప్రత్యేకాధికారుల పాలన ఉన్నా పారిశుద్ధ్య పనులు సక్రమంగా జరగడం లేదు. అలాగే వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలు కూడా అస్తవ్యస్తంగా తయారయ్యాయి.

కొరత వాస్తవమే..
జిల్లాలో 920 పంచాయతీలకు 502 మంది కార్యదర్శులే ఉన్నారు. వాస్తవంగా జిల్లాలో 489 క్లస్టర్లు ఉన్నాయి. క్లస్టర్‌ ప్రకారంగా పంచాయతీ కార్యదర్శుల కొరత లేనట్టే. దీంతోపాటు పంచాయతీలకు 357 మంది ప్రత్యేకాధికారులున్నారు. పంచాయతీ కార్యదర్శులకు పింఛన్ల పంపిణీ, మరుగుదొడ్లు, శ్మశాన వాటికల నిర్మాణ బాధ్యతల పర్యవేక్షణతో పాటు గ్రామాల్లో ప్రజలకు అందుబాటులో ఉండి పలు ధ్రువపత్రాలు అందించాల్సి ఉంటుంది. ఇటు ప్రభుత్వ కార్యక్రమాలు, ఎన్నికల విధుల్లో భాగంగా బీఎల్‌ఓల బాధ్యతలు కూడా నిర్వర్తిస్తున్నారు. అయినా రెండు రోజులకోసారైనా పంచాయతీ కార్యదర్శులు గ్రామాలను సందర్శిస్తున్నారు. పారిశుద్ద్య నిర్వహణపై ఫిర్యాదులు ఉంటే సమాచారం అందిస్తే చర్యలు తీసుకుంటాం.   – బలివాడ సత్యనారాయణ, డీపీఓ, విజయనగరం

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top