సిబ్బంది లేక ఇబ్బందులు

Staff Shortage in Kurnool Home construction - Sakshi

గృహ నిర్మాణ శాఖలో వేధిస్తున్న సిబ్బంది కొరత

ఒక ఏఈకి రెండు,  మూడు మండలాల బాధ్యతలు

కార్యాలయాల్లోనూ ఇదే పరిస్థితి

జాప్యమవుతున్న ఇళ్ల బిల్లులు

కర్నూలు(అర్బన్‌): జిల్లా గృహ నిర్మాణ సంస్థను సిబ్బంది కొరత వేధిస్తోంది. జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్‌ కార్యాలయం, డివిజన్ల పరిధిలోని ఈఈ కార్యాలయాలతో పాటు క్షేత్ర స్థాయిలోనూ తగినంత సిబ్బంది లేరు. దీనివల్ల పలు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. జిల్లాలో ప్రస్తుతం 43 వేల గృహ నిర్మాణాలు పూర్తి కాగా, 48,920 నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయి. కొనసాగుతున్న గృహ నిర్మాణాలకు సంబంధించి జియో ట్యాగింగ్‌ చేసి బిల్లులను చెల్లించేందుకు సిబ్బంది కొరత ప్రతిబంధకంగా మారింది. దీనివల్ల బిల్లులు చేయడంలో నెలల తరబడి జాప్యం జరుగుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి.              

ఏయే పోస్టులు ఖాళీగా ఉన్నాయంటే ...  
జిల్లా కేంద్రంలోని ప్రాజెక్టు డైరెక్టర్‌ కార్యాలయంలో రెండేళ్లుగా మేనేజర్‌ పోస్టు ఖాళీగా ఉండడంతో ఒక డీఈ ఇన్‌చార్జ్‌గా వ్యవహరిస్తున్నారు. ఐటీ మేనేజర్‌ పోస్టు కూడా ఏడాదిన్నరగా ఖాళీగా ఉంది. ప్రస్తుతం కోడుమూరు డీఈ ఇన్‌చార్జ్‌ ఐటీ మేనేజర్‌గా అదనపు విధులను నిర్వహిస్తున్నారు. డోన్, పత్తికొండ, ఎమ్మిగనూరులో డీఈ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. డోన్‌లో ఏడాది నుంచి ఖాళీ ఉంది. పత్తికొండ డీఈ ఆరు నెలల క్రితం సస్పెండ్‌ అయ్యారు. అప్పటి నుంచి ఎవరినీ నియమించలేదు.  ఎమ్మిగనూరు డీఈ  మూడు నెలల క్రితం పదవీ విరమణ చేశారు. ఈ మూడు చోట్ల ఇన్‌చార్జ్‌లతోనే  నెట్టుకొస్తున్నారు.  

సగం ఏఈ పోస్టులు ఖాళీ
క్షేత్ర స్థాయిలో లబ్ధిదారుల సమస్యలను పరిష్కరించడంలో, బిల్లులను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌ చేయించడంలోఏఈల పాత్ర కీలకం. జిల్లాకు మొత్తం 69 మంది ఏఈలు ఉండాలి. ప్రస్తుతం 34 మంది మాత్రమే విధులు నిర్వర్తిస్తున్నారు. సగానికి సగం పోస్టులు ఖాళీగా ఉండడంతో రెండు, మూడు మండలాలకు ఒక ఏఈ ఇన్‌చార్జ్‌గా వ్యవహరించాల్సి వస్తోంది. దీంతో బిల్లులు  సకాలంలో చేయలేకపోతున్నారు. కర్నూలు, నంద్యాల, ఆదోని ఈఈ కార్యాలయాల్లోనూ కనీసం రెండు, మూడు పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. దీంతో ఈఈలు మండలాల్లో పనిచేస్తున్న సిబ్బందిపైనే ఆధారపడుతున్నారు.  

జాప్యం లేకుండా చూస్తున్నాం
గృహ నిర్మాణ సంస్థలో ఇంజినీర్లు, సిబ్బంది కొరత ఉన్నప్పటికీ ఎక్కడా పనిలో జాప్యం జరగకుండా చర్యలు చేపట్టాం. ముఖ్యంగా క్షేత్ర స్థాయిలో వేర్వేరు దశల్లో కొనసాగుతున్న గృహ నిర్మాణాలకు సంబంధించి జియో ట్యాంగింగ్‌ చేయడం, బిల్లులను ఆన్‌లైన్‌లో పంపడం వంటి కార్యక్రమాల్లో ఇప్పటి వరకు ఎలాంటి జాప్యమూ జరగడం లేదు. ప్రతి రోజు పర్యవేక్షణ ఉన్న కారణంగా ఏ రోజు చేసిన బిల్లులను ఆదే రోజు ఆన్‌లైన్‌లో నమోదు చేసి పంపుతున్నాం. సిబ్బంది కొరత ఉన్న విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేశాం.  – కేబీ వెంకటేశ్వరరెడ్డి, హౌసింగ్‌ పీడీ

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top